గోవిందప్ప ఒక పాల వ్యాపారి. రోజూ పాలలో సగానికి సగం నీళ్ళు కలిపి అమ్మేవాడు అతను. ఊళ్ళో వాళ్ళు ఎవ్వరికీ ఈ నీళ్ళపాలు నచ్చేవి కావు. అయినా ఏం చేస్తారు, ఇంకెక్కడా పాలు దొరకవాయె! దాంతో తప్పని సరై కొనేవాళ్ళు; మనసులో తిట్టుకునేవాళ్ళు.
ఒక రోజున అతని దగ్గరికి ఓ సన్యాసి వచ్చి, గ్లాసెడు పాలు పోయించుకున్నాడు. గోవిందప్ప పోసిన నీళ్ళ పాలను చూసి, 'నాయనా, మరీ ఎక్కువ నీళ్ళు కలిసినట్లున్నాయి?' అన్నాడు. 'ఇక్కడి బర్రెలు ఎక్కువ నీళ్ళు తాగుతున్నాయి లెండి' అన్నాడు గోవిందప్ప వెటకారంగా.
'కాదు నాయనా! ఎక్కువ త్రాగింది బర్రెలు కాదు-నువ్వే అని నాకనిపిస్తున్నది. నీకు ఆలోచించుకునే అవకాశం ఈ రోజున లభిస్తుందిలే' అని వెళ్ళిపోయాడు సన్యాసి.
ఆరోజు పాలు అమ్మేశాక, గోవిందప్పకు అనుమానం వచ్చింది: 'ఈ సన్యాసి ఎవడో ఇవాళ్ల నన్ను తిట్టి పోయాడు- ఎందుకైనా మంచిది- ఇవాళ్ళ కొంచెం జాగ్రత్తగా ఉంటాను. వచ్చిన డబ్బుల్ని లెక్కపెట్టుకొని తీసుకెళ్తాను' అనుకున్నాడు. ఆరోజు వచ్చిన నాలుగు వందల రూపాయల్నీ లెక్కపెట్టి సంచిలో వేసుకున్నాడు. యింటికి బయలు దేరాడు.
మధ్యాహ్నం ఎండ చాలా ఎక్కువగా ఉంది. గోవిందప్పకు బాగా దాహం వేసింది. దారిలో చెరువు గట్టున ఉన్నదొక చేద బావి. అక్కడ ఆగి, సంచిని ప్రక్కన పెట్టి, నీళ్ళు చేదుకొని కడుపారా త్రాగాడు. తిరిగి పోదామని చూస్తే సంచి మాయం!
గోవిందప్పకు చాలా బాధ వేసింది. "ఇప్పటికిప్పుడు సంచి ఎట్లా మాయం అవుతుంది? ఇక్కడెవ్వరూ లేరే!"- అని కంగారుగా అంతటా వెతికాడు.
అప్పుడు కనబడింది- కోతి ఒకటి, అతని సంచీని తీసుకొని పోయి, చెట్టుమీద ఎక్కి కూర్చున్నది!
దాన్ని తరిమేందుకు ప్రయత్నించాడు గోవిందప్ప. అది సంచీని పట్టుకొనే చెట్టుమీదినుండి చెట్టుమీదికి దూకటం మొదలు పెట్టింది.
చివరికి అలసిపోయిన గోవిందప్ప నిరాశగా నిల్చుండి పోయాడు. ఇప్పుడు తీరిక దొరికింది కోతికి. అది సంచీలో చెయ్యిపెట్టి, ఒక్కో నాణాన్నీ దొరకపుచ్చుకొని చెరువులో నీళ్ళలోకి విసిరెయ్యటం మొదలు పెట్టింది.
గోవిందప్ప చూస్తూ ఉండగానే ఒక్కొక్క నాణెమూ చెరువులో కలిసి పోయింది. ఇప్పుడు అతనికి ఏడుపొక్కటే తక్కువ.
నాణాలన్నీ అయిపోయాక, కోతి సంచీని నేలమీదికి విసిరేసి వెళ్ళిపోయింది.
గోవిందప్ప గబగబా వెళ్ళి, సంచీలో చెయ్యిపెట్టి చూసుకున్నాడు. సంచీలో నాణాలు పోయాయి గానీ, నోట్లు అలాగే ఉన్నాయి !
ఆ సంచీని పట్టుకొని అటూ ఇటూ చూడకుండా గబగబా ఇల్లు చేరుకున్నాడతను.
లెక్కపెట్టుకొని చూస్తే అందులో సరిగ్గా రెండు వందల రూపాయలున్నాయి!
అంటే పాల ధర పాళ్లకు, నీళ్ళ ధర నీళ్ళకు వచ్చిందన్నమాట!
మామూలుగా అయితే ఏమీ పట్టించుకునేవాడు కాదు గానీ, ఉదయం సన్యాసి మాటలు విన్నాడు కదా- గోవిందప్ప ఆలోచనలో పడ్డాడు.
ఆ తర్వాత మెల్లగా అతని పాలు చిక్క బడ్డాయి. సన్యాసి మాటలు నిజమయ్యాయి!