మైకెల్ పెర్హాం బ్రిటన్ దేశానికి చెందిన ఒక నావికుడు. పదిహేడేళ్ళ వయసులో ఒంటరిగా సముద్రయానం చేసి, ప్రపంచాన్ని చుట్టి వచ్చి రికార్డు సృష్టించాడితను.
మైక్ ఇంగ్లాండ్ దేశంలో 1992లో పుట్టాడు. వాళ్ళ అమ్మా నాన్నలకు సాహసాలు చేయటమంటే చాలా ఇష్టం. అలా చిన్న మైకెల్‌కి కూడా సాహస యాత్రలంటే ఆసక్తి కలిగింది.
మైక్ వాళ్ళ నాన్న స్వతహాగా నావికుడు. మైక్‌కి ఏడేళ్ళు రాగానే ఆయన పడవ నడపటం ఎలాగో నేర్పించాడు అతనికి. అప్పటినుంచి మైక్ సముద్రంలో ఎక్కడెక్కడో పడవలు నడుపుతూ సాధన చేశాడు. అతనికి పధ్నాలుగేళ్ళు వచ్చేసరికి అట్లాంటిక్ మహాసముద్రాన్ని ఒంటరిగా దాటేశాడు! ప్రపంచంలో ఆ వయసు పిల్లలు ఎవ్వరూ ఈనాటివరకూ ఆ పని చేసి ఉండలేదు! అది మైక్ పెర్హాం సాధించిన మొదటి ప్రపంచ రికార్డు.
దాంతో అతనికి తన శక్తి సామర్ధ్యాలమీద మరింత నమ్మకం కలిగింది. ఈసారి పడవను వేసుకొని ఒంటరిగా ప్రపంచాన్నే చుట్టి రావాలనుకున్నాడు. అతని ఆ ప్రపంచ యాత్రకు అనేక వాణిజ్య సంస్థలు మద్దతునిచ్చాయి. ఈ పర్యటనలో అతను అనేక ఒడిదుడుకులను, చిన్న ప్రమాదాలను కూడా ఎదుర్కొన్నాడు. అన్ని అడ్డంకులనూ అధిగమించి చివరకు సాధించాడు. ప్రపంచాన్ని చుట్టివచ్చిన అతి పిన్న వయస్కుడిగా గిన్నిస్ రికార్డు సృష్టించాడు. ఆ యాత్ర ద్వారా తను సంపాదించిన డబ్బును అతను రెండు సేవా సంస్థలకి అందించాడు.
ఈ ప్రపంచ పర్యటనలో తన అనుభవాలను క్రోడీకరిస్తూ "సెయిలింగ్ ది డ్రీం" అని ఒక పుస్తకం కూడా రాసాడతను. ఈ పుస్తకం రాసేనాటికి అతని వయసు పద్దెనిమిది సంవత్సరాలే! ఈ పుస్తకం ఎంత చక్కగా ఉందంటే, దాన్ని రాసినందుకు కూడా అతనికి మరికొన్ని అవార్డులు వచ్చాయి.
నావికుడిగా సాహస యాత్రలు అంటే ఎంతో శారీరిక, మానసిక శ్రమతో కూడుకున్న వ్యవహారం. వాతావరణం ఎలా ఉంటుందో తెలీదు. సమయానికి తగిన ఆహారం-నీరు ఉంటాయో లేదో తెలీదు. నిద్రపోవడానికి కూడా సమయం ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి. అందులోనూ ఒంటరి ప్రయాణాలంటే మరీ కష్టం. ఇదంతా తట్టుకోవడానికి మైక్ తరుచుగా వ్యాయామాలు చేస్తూంటాడు; నిపుణుల సలహాలు తీసుకుంటూ ఉంటాడు. అలాగే, ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ, ఎంతో క్రమశిక్షణతో ఉండడం అవసరం అంటాడు.
ఇంతకీ ఇవన్నీ చేస్తూ కూడా అతను చదువు మానలేదు. "నిన్ను ఎవరు ప్రోత్సహించారు?" అని ఓ ఇంటర్వ్యూలో అడిగితే, "మా స్కూలు యాజమాన్యం, కుటుంబ సభ్యులు" అని చెప్పాడు. ప్రస్తుతం మైక్ తమ దేశంలోనే ఒక విశ్వవిద్యాలయంలో టీవీ ప్రొడక్షన్ గురించిన కోర్సు చదువుతున్నాడు. నావికుడిగా తన వ్యాపకం కొనసాగిస్తూనే, సమాజ సేవ కూడా చేయాలి అనుకుంటున్నాడు. తను ప్రయాణించే ప్రతి మైలుకు ఒక బ్రిటీష్ పౌండు డబ్బులు 'షెల్టర్ బాక్స్' అనే ఒక సేవా సంస్థ కు చేరేలా చూడడం అతని ఆశయమట. తన ప్రయాణాల గురించి, సాహసాల గురించి తన ఈడు వారితో పంచుకోవడం అంటే కూడా అతనికి ఇష్టం. వాటి గురించి ఇప్పటికే కొన్ని ప్రసంగాలు, ప్రశ్నోత్తరాల కార్యక్రమాలు కూడా చేసాడు. నౌకాయానమే కాక- పర్వతారోహణ, స్కీయింగ్ వంటి సాహస క్రీడల్లోనూ ప్రావీణ్యత సాధిస్తున్న మైకెల్ పెర్హాం క్రీడాకారులందరికీ స్ఫూర్తి- కదూ?