ఈసారి కథ, పెద్ద పిల్లల కోసం-
అనగా అనగా ఒక వైద్యుడు ఉండేవాడు.
ఆయన చాలా భక్తిపరుడు, తాత్విక చింతన కలవాడు. దేనికీ పెద్ద చలించేవాడు కాదు- ఏం జరిగినా "పర్లేదులే" అనుకొని పోతూ ఉండేవాడు.
వైద్యుడిగా ఆయనకి మంచిపేరే ఉండేది. రకరకాలవాళ్ళు ఆయన దగ్గరికి వచ్చి వైద్యం చేయించుకునేవాళ్ళు. పేదవాళ్ళు, ధనికులు, మధ్య తరగతివాళ్ళు- ఇట్లా ఎవరొచ్చినా అందరినీ సమంగా చూసేవాడాయన.
అయితే ఒకసారి ఒక దొంగల నాయకుడికి చికిత్స అవసరమైంది. కొంచెం అనుమానిస్తూనే అతను ఈ వైద్యుడిని సంప్రతించాడు. అతని శరీరమూ అందరి శరీరాల లాంటిదే కదా! వైద్యుడు చికిత్స చేశాడు. దొంగల నాయకుడి ఆరోగ్యం మెరుగైంది. వైద్యుడిమీద గురి కుదిరింది. అప్పటినుండి అతనూ అతని అనుచరులు అందరూ కూడా వైద్యుడి అభిమానులైపోయారు. దొంగల గుంపులో ఎవరికి బాగాలేకపోయినా నిస్సంకోచంగా ఈ వైద్యుడి దగ్గరికి రావటం మొదలుపెట్టారు. వైద్యుడికీ ఇది బాగానే ఉన్నది- దొంగలు ఆయనకి బాగానే డబ్బులు ఇస్తున్నారు మరి!
అంతా బాగా జరిగిపోతున్నది అనుకునేంతలోనే అకస్మాత్తుగా రాజభటులు వచ్చి వైద్యుడిని బంధించారు. 'వైద్యుడి వేషంలో ఉన్న దొంగల నాయకుడివి నువ్వే! రాజుగారి ఖజానాని కొల్లగొట్టటానికి పథకం వేశారు మీరంతా కలిసి!' అన్నారు.
మామూలువాళ్ళయితే మొత్తుకునేవాళ్ళు, కాళ్ళావేళ్ళా పడే వాళ్ళు. కానీ వైద్యుడు ఏడవలేదు; మొత్తుకోలేదు. "నాకేం తెలీదు. నేను కేవలం వైద్యుడిని. దొంగలకూ- వాళ్ల పథకాలకూ నాకేం సంబంధం లేదు" అని ఊరుకున్నాడు.
'కనీసం బాధకూడా పడటం లేదు. నిజంగా వీడే దొంగల నాయకుడు!' అనుకున్నారు భటులు.
దేశాచారం ప్రకారం వైద్యుడిని న్యాయసభ ముందు ప్రవేశపెట్టారు. అప్పటికీ వైద్యుడు చలించలేదు. న్యాయాధికారులు ఆయన్ని రకరకాలుగా ప్రశ్నించారు. దేనికీ సరైన- అంటే వాళ్లకి నచ్చే-సమాధానం రాలేదు. 'ఎంత గుండెలు తీసిన బంటో‌చూడండి, దొరికిపోయాక కూడా నేరం ఒప్పుకోవట్లేదు! అసలు మన దేశంలో శిక్షల్ని బాగా పెంచాలి' అనుకున్నారు అందరూ. వైద్యుడికి మరణశిక్ష విధించారు.
అయినా వైద్యుడు ఏడవలేదు: 'మీ భార్యా బిడ్డలు ఎలా బ్రతుకుతారు?' అని అడిగితే 'నారు పోసిన దేవుడే నీరు పోస్తాడు' అన్నాడు.
అనుమానం కొద్దీ‌రాజుగారు అతని మరణశిక్షను ఐదేళ్ళపాటు వాయిదా వేస్తూ వచ్చాడు. మొదట్లో చెప్పిన సంగతులు తప్ప ఇతను వేరే చెప్పింది లేదు. అయినా ఆ సరికి ప్రజల్లో అతని పట్ల అనుమానం పాదుకొని పోయింది: 'వైద్యుడి ముసుగులో ఖజానాని కొల్లగొట్టేందుకు పన్నాగం పన్నాడు చూడు! అతన్ని ఉరితీయాల్సిందే' అని కొందరు ప్రదర్శనలు కూడా‌ చేయటం మొదలుపెట్టారు. కానీ వైద్యుడి పద్ధతి చూస్తే- "అతను దొంగ కాదేమో అనిపిస్తున్నది.. అయినా న్యాయం ముందు వ్యక్తిగత అభిప్రాయానికి, అనిపించటానికి విలువలేదు" అనుకున్న రాజుగారు వైద్యుడి శిక్షను అమలు చేయించారు.
ఆ తర్వాత తెలిసింది అందరికీ- "ఈయన మామూలు వైద్యుడే; దొంగలు-దొంగలనాయకులు వేరే ఉన్నారు" అని. అందరూ నాలుకలు కరుచుకున్నారు. కానీ ఇప్పుడు ఎవరు ఏం చేయగలరు?!
అటు దొంగల ప్రాణం కూడా చివుక్కుమన్నది. వాళ్లంతా కలిసి అన్యాయంగా చనిపోయిన వైద్యుడి పేరిట దేశంలో అంతటా అల్లర్లు సృష్టించటం మొదలు పెట్టారు. రాజుగారు తల పట్టుకున్నారు.
'శిక్షలు నేరస్తులలో పరివర్తన తెచ్చేవిలా ఉండాలి' అన్నది ఆధునిక శిక్షాస్మృతుల మౌలిక సూత్రం. మరణశిక్ష అమలు చేసిన తర్వాత 'పరివర్తన' అనేది ఎలా వస్తుంది? అందుకని ఇప్పుడు అనేక దేశాలు వేటికవి మరణశిక్షను రద్దు చేద్దామని ఆలోచిస్తున్నాయి. "పెద్దనేరాలకు కూడా వేరే శిక్షలేవైనా ఆలోచిద్దాంలే; ఈ మరణశిక్ష ఒక్కటీ వద్దు. దీన్ని రద్దు చేద్దాం!" అనుకుంటున్నాయి.
మనమూ ఆలోచించాలి. పెద్దవాళ్లం అవుతాంగా, రేపు?!
-కొత్తపల్లి బృందం