ఓరుగల్లు నగరాన్ని కాకతీయులు పరిపాలించే కాలంలో కడిపికొండ అనే ఊళ్ళో కనకయ్య అనే రైతు ఒకడు ఉండేవాడు.
అతనొకసారి పొలం దున్నుతుంటే నాగలి కర్రుకు ఏదో గట్టిగా తగిలింది. మొదట దాన్ని చూడగానే అదేదో చెట్టు వేరు అనుకున్నాడు కనకయ్య. అతను దాన్ని నరికేందుకు ప్రయత్నిస్తే 'ఖంగు'మని మ్రోత వచ్చింది. చూడగా అదొక లోహ స్తంభం! చాలా లావుగా, బరువుగా, నాలుగు బారల పొడవున, నాలుగు భాగాలుగా, ఉన్నదది! దాన్ని ఎద్దులకు కట్టి, అతి కష్టం మీద బయటికి తీశాడు కనకయ్య . దానికంటిన మట్టిని దులిపి, శుభ్రం చేసి చూడగా అది మామూలు లోహం కాదు- పోతపోసిన అసలు బంగారు స్తంభం అది!
అదే సమయంలో కనకయ్యకు దురాశ పుట్టుకొచ్చింది. స్తంభాన్ని ఇట్లా వెలుగు పొద్దున ఇంటికి తీసుకువెళ్తే అందరూ చూస్తారు! అది తనది- పూర్తిగా తన సొంతం! దాన్ని వేరే ఎవ్వరికీ ఇవ్వకూడదు! రాత్రి బాగా చీకటి పడ్డాక దాన్ని ఇంటికి తీసుకెళ్ళాలి!
అందుకని అతను దానిమీద ఓ పాత కంబళిని కప్పి పెట్టి, ఎప్పటి మాదిరే తన పనిని కొనసాగించాడు. అయితే అతని మనసు ఉరకలు వేస్తున్నది- దాన్ని ఎప్పుడు ఇంటికి తీసుకెళ్దామా అని ఆరాట పడుతున్నది. ధ్యాస అంతా స్తంభం మీద నిలవటం వల్లనేమో, దున్నే పని అంతబాగా సాగలేదు.
అయితేనేమి, ఎట్టకేలకు చీకటి పడింది. స్తంభాన్ని మళ్ళీ ఎద్దులకు కట్టి, లాగమన్నాడు కనకయ్య . పగలంతా పనిచేసి అలిఉన్నందునో, ఏమో- ఎద్దులు ఆ స్తంభాన్ని పిసరంత కూడా కదల్చలేకపోయాయి. రాత్రంతా ప్రయత్నిస్తూనే ఉన్నాడు అతను. మళ్ళీ మళ్ళీ ఎద్దులను స్తంభానికి కట్టి లాగించేందుకు చూశాడు. అయినా ఉదయం మట్టిలోంచి అంత సులభంగా బయటికి వచ్చిన ఆస్తంభం, ఎందుకోమరి, ఇప్పుడు పూర్తిగా మొరాయించింది. ఒక్క ఆవగింజంత కూడా ముందుకి జరగలేదది!
తెల్లవారు జాముకల్లా పూర్తిగా అలసిపోయాడు కనకయ్య. ఉదయించ-బోతున్న సూర్యుడి కిరణాలు ఆకాశంలో‌ తూర్పు దిక్కున పరచుకున్నాయి. ఆ సమయంలో కనకయ్యకు జ్ఞానం ఉదయించింది.

ఈ స్తంభం తనదే అనుకున్నాడు కదూ, తను?! కాదు! నిజానికి జీవితంలో తను నిర్వర్తించాల్సిన నాలుగు బాధ్యతలకు ప్రతీక ఈ స్తంభం! ఇందులో మొదటి భాగం- తన వృత్తిని చక్కగా కొనసాగించటానికి పెట్టుబడి. రెండో భాగం- తన కుటుంబ అవసరాలను తీర్చేందుకు. మూడవ భాగం‌ తన సంతానపు సంక్షేమం కోసం‌ ఉద్దేశించాల్సినది. ఇక నాలుగవ భాగం లోకకల్యాణంకోసం, ఇతరుల క్షేమంకోసం వాడాల్సినది. మొత్తం తనదే అనుకోవటం ఆశపోతు తనమే- అందుకనేనేమో, పవిత్రమైన ఈ స్థంభం కదలనని మొరాయించింది!
ఒకసారి ఆ అవగాహన వచ్చేసరికి కనకయ్య మనసు తేలికైంది. 'ఎవరైనా చూస్తారేమో' అన్న భయం మాయమైంది. అటుగా వచ్చిన గ్రామస్తులందరినీ సాయానికి రమ్మన్నాడు కనకయ్య. అందరూ కలిసి లాగారు. స్తంభం కదిలింది. ఆనాడు లోకకల్యాణం కోరి కనకయ్య కల్పించిన సౌకర్యాలు కడిపికొండవాసులకు తరగని ఆస్తులై, ఈనాటికీ సేవలందిస్తున్నాయి !