అనగా అనగా దండకారణ్యం అనే అడవి ఒకటి ఉండేది. దట్టమైన ఆ అడవిలో పులులు, సింహాలు, ఏనుగులు, ఖడ్గమృగాలు లాంటి జంతువులెన్నో నివసిస్తూ ఉండేవి.ఆ అడవి మధ్యలో ఓ పెద్ద మర్రి చెట్టు ఉండేది. లెక్కలేనన్ని పండ్లతోటీ, పచ్చని ఆకులతోటీ గొప్ప స్థలాన్ని ఆక్రమించుకొని ఉండేదది. అది ఆకాశం అంత ఎత్తుగా నిల్చొని ఉంటే, దానిముందు తోటి చెట్లన్నీ మరుగుజ్జుల్లాగా కనబడేవి. 'వాటితో పోటీ పెట్టుకొని ఇది ఇంత ఎత్తుకు ఎదిగిందేమో' అనిపించేది. దాని కొమ్మలు నాలుగు దిక్కుల్లోనూ ఎంతో దూరం విస్తరించి ఉండేవి. ఇక ఆ కొమ్మలమీద ఉన్న రకరకాల పక్షుల కిలకిలారావాలు వింటే 'ఓడిపోయిన ఆ తోటి చెట్లను చూసి ఇవన్నీ ఎగతాళి చేస్తున్నాయేమో, కిలకిలా నవ్వుతున్నాయేమో' అనిపించేది.
ఆ మర్రి చెట్టులో ఒక ప్రక్కగా నివసించేవి- మహా భయంకరాలైన కాకి మూకలు. ఆ గుంపులన్నిటికీ రాజు 'మేఘవర్ణుడు' అనే కాకి. చెట్టు మీద ఉండే లెక్కలేనన్ని కాకులు తనని కొలుస్తూ ఉంటే, మేఘవర్ణుడు 'అపర గరుత్మంతుడేమో' అన్నట్లు గొప్పగా కనబడేది.

మర్రి చెట్టుకు దగ్గరలోనే ఒక చక్కని కొండ గుహ ఉండేది. చీకటి గుయ్యారంగా ఉండే ఆ గుహలో చాలా గుడ్లగూబలు, తరతరాలుగా నివసిస్తూ ఉండేవి. వాటికి నాయకుడు- 'ఉపమన్యుడు' అనే గుడ్లగూబ. ఉపమన్యుడిని చూస్తేచాలు- గుడ్లగూబల శత్రువులన్నీ వణికి పోయేవి.
ఒకనాటి రాత్రి ఉపమన్యుడు ఎప్పటిలాగానే తన మంత్రి గూబలతో సమావేశం అయినప్పుడు దానికేదో‌ఆలోచన వచ్చింది. అప్పటికప్పుడు అది తన సేనానిని అక్కడికి రప్పించి, దానికి ఉత్సాహం-ఆవేశం కలిగేటట్లు గొప్పగా మాట్లాడింది. దాంతో ఆ సేనానికి వీరావేశం వచ్చింది; కొమ్ములు మొలిచినట్లయింది. లెక్కలేనన్ని గుడ్లగూబల సైన్యాన్ని వెంటబెట్టుకొని, భీకరమైన అరుపులు ఆకాశాన్ని అంటుతుండగా అది కదిలి, తమ విరోధులైన కాకులు నివసించే మర్రి చెట్టును చుట్టుముట్టింది.
ఆ సమయానికి కాకులన్నీ‌నిద్రబారిన కళ్ళతో, ఒళ్ళుమరిచి కూరుకుతూ ఉన్నాయి. వాటిని ఆ స్థితిలో చూసేసరికి గుడ్లగూబలకు ఎక్కడలేని సంతోషం కలిగింది; దాంతోబాటు విపరీతమైన కోపం కూడా వచ్చింది. అవన్నీ కాకులతో తలబడి యుద్ధం మొదలు పెట్టాయి. కొమ్మల్లో ఎక్కడెక్కడో దాక్కున్న కాకులను వెతికి పట్టుకొని, వాడి గోళ్లతో గీకి, తీక్షణమైన ముక్కు కొనలతో పొడిచి, గట్టిగా అట్టలుకట్టి ఉండే రెక్కల అంచులతో చరచి, కొన్నిటి రెక్కలు విరిచేశాయి; కొన్నిటి ప్రక్కటెముకలు ముక్కలు చేశాయి; కొన్నిటి ముక్కులు చెక్కలు చేశాయి- కొద్దిసేపట్లోనే లెక్కలేనన్ని కాకుల్ని చంపి యమపురికి పయనం కట్టించాయి. అంతవరకూ నల్లటి కాకులతో చీకటి క్రమ్మినట్లున్న ఆ మర్రిచెట్టు ఒక్కసారిగా తెరచుకొని వెలుగులో మునిగినట్లయింది. దాన్ని చూసిన ఉపమర్దనుడి సర్వాంగాలూ సంతోషంతో పులకించి పోయాయి. కోరిక తీరిన సంతోషంతో దాని కళ్ళు మరింతగా వికసించాయి.
గుడ్లగూబలు విజయోత్సాహంతో చేసిన కోలాహలంతో భూమి మీద ఉన్న జంతువులన్నిటి చెవులూ ఒక్కసారిగా దద్దరిల్లిపోయినట్లయింది. అట్లా యుద్ధంలో సునాయాసంగా గెలిచి, ఉపమర్దనుడు పరివారంతో సహా అట్టహాసంగా తమ కొండ గుహకు చేరుకున్నది.
ఇక అలా ఆ రాత్రి దాడి చేసిన గుడ్లగూబల చేత చిక్కకుండా ఎక్కడో ఒళ్ళు దాచుకొన్న మేఘవర్ణుడు, మరునాడు తెల్లవారాక మళ్ళీ మర్రిచెట్టు దగ్గరికి ఎగిరి వచ్చి చూసుకున్నది. ఒళ్ళుమరచి నిశ్చింతగా గూళ్లలో నిద్రపోతున్న తన వారిపైన అకస్మాత్తుగా విరుచుకు పడిన అకాల ప్రళయం ఏం చేసిందో కళ్ళారా చూసేసరికి దాని గుండెలు పగిలినట్లయింది. దు:ఖంతో అది చాలా సేపు నిశ్చేష్టమైపోయింది. తెలివి వచ్చాక చనిపోయిన తన పిల్లల్నీ, బంధువుల్నీ, మిత్రుల్నీ పేరు పేరునా, వరస వరసనా తలచుకొని నిట్టూర్పులు వదలుతూ, ఏడిచిందది.

ఇక దాని మాదిరే రాత్రి గుడ్లగూబల పాల పడక తప్పించుకొని, ఎక్కడెక్కడో దాక్కున్న కొన్ని కాకులు కూడా ఒకచోట చేరాయి. తమ రాజు మేఘవర్ణుడు ఇంకా ప్రాణాలతోటే ఉన్నదని తెలుసుకొనే సరికి వాటికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. అవి అన్నీ కలిసి గుంపుగా మళ్ళీ ఓసారి తమ నివాసమైన మర్రిచెట్టు దగ్గరకు చేరుకున్నాయి. నాశనమైపోయిన తమ గూళ్లను చూసేసరికి వాటికి దు:ఖం ఆగలేదు. అవన్నీ కంటికి-నేలకు ఏకధారగా ఏడుస్తూ తమ రాజుతో "ప్రభూ! తెల్లవారాక మళ్ళీ తమరి పాదాలను ఈ విధంగా దర్శించుకుంటామనుకోలేదు. మా పూర్వ పుణ్యం ఫలించింది; తమరు భద్రంగా ఉన్నారు. వెయ్యి నక్షత్రాలున్నా చంద్రుడు లేని రాత్రి శోభించని తీరున, వెయ్యిమంది ప్రజలున్నా సరే, రాజులేని రాజ్యం నిండుగా ఉండదు;చీకటితో మూసుకుపోయినట్లు ఉంటుంది. దేవుడు చల్లగా చూడబట్టి, తమరు-మేము కూడా ప్రాణాలతో మళ్ళీ ఈ భూమిపైన అడుగు పెట్టగలిగాము.
ఆ దేవుడు కూడా పగవారి పక్షమే వహించి మనకు ఎంత కీడు చేశాడో చూడండి! అయినా తప్పకుండా జరగవలసిన దానిని తప్పించటం ఎవరికి సాధ్యం?! ఎలాంటి కారణమూ లేకుండానే మీవంటి ధర్మాత్ములకు చేసిన కీడు, క్రూరకర్ములైన ఆ గుడ్లగూబలను ఊరికే వదలదు.
ఈ సమయంలో మనకు కాలం అనుకూలించటం లేదు- కాలాన్ని మీరి నడవటం ఎవరికి సాధ్యం? మన బంధువులు-గొప్ప గొప్ప పేరుగల కాకులు కూడా, కాలం తీరే సరికి నిద్రావశాలై పోయినై; పగటిపూట కళ్ళు ఆనని ఆ అనామకపు గుడ్డి గుడ్లగూబల పాలబడి ప్రాణాలు కోల్పోయినై.
అయినా మనకు ఎదురైన కష్టం దైవ వైపరీత్యం అయినప్పుడు బాధపడవలసిన అవసరం లేదు. మేం అప్పుడే అలసిపోయి, కొంచెం కన్ను మూశాం అంతే- అంతలో అకస్మాత్తుగా లెక్కలేనన్ని శత్రుమూకలు వచ్చి, మేం ఇంకా కళ్ళు తెరవకనే వీళ్ల గొంతులు కోసి పోయినై. మేమే మేలుకొని ఉంటే మీ సేవకులను ఇట్లా చేసినవాడు ఒక్కడైనా తప్పించుకొని పోగలిగేవాడా? ఇప్పుడెందుకో మా దురదృష్టం కొద్దీ పరాభవం పాలయ్యాం కానీ, ఇంతకు ముందెన్నడూ ఇట్లా అయినవాళ్లం కాదు. శూరవీరులైన తమంతటివారికీ ఈ పరాభవం తప్పలేదు చూడండి. ఇదంతా మా రాత కాబోలు. శత్రువులు మనల్ని యుద్ధంలో బాధించినందుకు దిగులు చెందకండి. 'పెరుగుట విరుగుటకొరకే' అని చెబుతారు పెద్దలు. ఇవాళ్ళ 'శత్రువులను ఓడించాను' అని విర్రవీగే పగవాడికి రేపు ఏమి మూడనున్నదో, ఎవరికి తెలుసు? ఇంతకాలమూ మమ్మల్ని కంటికి రెప్పలాగా కాచిన తమరిని తలచుకొని, 'తమరే మా కంటి వెలుగు' అని మీ వెంట ఉండేందుకే మేం అందరం మీ పాదాల చెంతకు చేరుకున్నాం. మీవంటి గొప్పవారి కరుణ మా మీద ప్రసరిస్తేనే కదా, మా మనసుల్లోని తాపం చల్లారేది?! "ఈతకు ఎక్కువ లోతు లేదు- కాబట్టి సాహసిద్దాం; ప్రజలు మనల్ని విమర్శించేందుకు తావివ్వకుండా, ఆయువు తీరిపోయేంతవరకూ పోరాడదాం.. మన కాలం మంచిదైనప్పుడు ముందుకు పోయి యుద్ధం చేద్దాం, శత్రువును మట్టుపెట్టుదాం. లేకపోతే, శత్రువు బలవంతుడు కనుక, 'మన భాగ్యం ఇంతే' అనుకొని వారినే ఆశ్రయించుకొని బ్రతుకుదాం.. లేదా, ఇప్పటికి దూరదేశం ఎక్కడికైనా వలసపోయి, శత్రువులకు అసాధ్యమైన కోటను ఒకదాన్ని సంపాదించుకుందాం.. లేదా బలవంతుడైన మిత్రుల సహాయంతో శత్రువును సునాయాసంగా ఓడిద్దాం.." అంటూ రకరకాలుగా అనసాగాయి.
అప్పుడు వాటి కలకలాన్నంతా సద్దుమణిగేలా చేసి, 'చిరంజీవి' అనే మంత్రి ఇట్లా అన్నది- "ప్రభూ! తమరి అమాత్యులు అందరూ సమర్థులు. దు:ఖం వల్ల తమ మనసుకు సమాధానం లేక, ఇప్పుడు పలువిధాలుగా ఆలోచిస్తున్నట్లున్నారు కానీ, నిజానికి తమరికి తోచని అంశాలేమున్నాయి? అది అటుంచండి, తమరునన్ను కూడా ఒక మంత్రిగా ఆదరిస్తున్నారు కనుక, దేవరవారి ఆజ్ఞ అయితే, నాకు తోచిన ఉపాయం ఒకటి నేనూ విన్నవించుకుంటాను- యుద్ధంలో గరుత్మంతుడినైనా ఎదిరించగల శూరులను చాలా మందిని కోల్పోయి, కోరలు పీకిన పాములలాగా భంగపడి ఉన్నాం. ఈ సమయం మనకు అనుకూలంగా లేదు; శత్రువును ఓడించేందుకు మనకున్న శక్తి చాలదు. తగిన సమయం వచ్చేవరకూ శత్రువు మీద కన్ను వేసి ఉంచుదాం; దగ్గరలో లేనట్లే ఉందాం; కొంగ మాదిరి శత్రువును ఒక్కసారిగా గుటుక్కున మ్రింగుదాం. అప్పటివరకూ ఏదో ఒకవిధంగా శత్రువును గమనించటం అవసరం అని నా అభిప్రాయం. పగవాడు చాలా పొగరు మీద ఉన్నాడు కదా, మనం వాడిని ఎట్లా గమనించగలం అని ఆలోచించకండి- తమరి ఆజ్ఞ అయితే, ఆ బలంతోటీ, వీరందరికీ నామీద గల నమ్మకంతోటీ, నేను పోయి, ఎంద దుష్కరమైన పనినైనా సాధించుకొని రాగలను. అయితే కొంచెం శ్రమ పడి మీరంతా నాకొక సాయం చేయాలి- దగ్గరలో అంతటా వెతికి కొంచెం రక్తం సంపాదించుకొని రండి. నామీద చల్లి, నా శరీరాన్ని రక్తసిక్తం చేయండి. ఇక అటుపైన ఆలస్యం చేయకుండా 'ఋశ్య శృంగం' అనే కొండకొమ్మును చేరుకోండి. భారం అంతానామీద విడిచిపెట్టి, మీరంగా అక్కడ నిశ్చింతగా సుఖంగా ఉండండి. మన పగ నెరవేర్చి మేలు కూర్చే పూచీ నాది!" అన్నది. కాకులన్నీ సంతోషించి, అప్పటికప్పుడు సందుగొందుల్లో అంతటా వెతికి ఎలుకలు మొదలైన చిన్న జంతువులను చంపి, వాటి రక్తాన్ని తెచ్చి చిరంజీవికి పూసినై. అటుపైన అవన్నీ భారాన్ని దానిపైనే విడచి, ఎగిరి ఋష్యశృంగానికి పోయినై.
(తర్వాత ఏమైందో వచ్చే సారి చూద్దాం...)