మార్కాపురంలో ఉండే రాముకు బెల్లపు లడ్లంటే చాలా ఇష్టం. ఒకరోజు వాడు బడినుండి ఇంటికి వచ్చేసరికి ఎదురుగా బెల్లపు లడ్లు కనిపించాయి.
మహదానందంతో లడ్లమీదికి దాడి చేశాడు వాడు. ఒక లడ్డూ తిని ఇంకో లడ్డు కోసం చెయ్యి చాపేసరికి- కనబడ్డాయి... లడ్డూల పళ్ళెంలో‌ చాలా ఈగలు వాలి ఉన్నాయి- జుయ్ జుయ్ మని శబ్దం చేసుకుంటూ ఎగిరెగిరి నాకుతున్నాయి లడ్డూలని!
వాటిని చూస్తే కంపరం పుట్టింది రాముకు. పళ్ళెం మీద ఒక చేతిని నిలిపి, రెండో చేత్తో 'ఠాప్' మని చప్పట్లు కొట్టినట్టు చరిచాడు. చేతులు విప్పి చూసుకుంటే ఒకటి కాదు- రెండు కాదు- ఏకంగా‌ ఏడు ఈగలు చచ్చి అతుక్కొని ఉన్నాయి, చేతిలో!
'ఒక్క దెబ్బకు ఏడు ప్రాణాలు! ఒక్క దెబ్బకు ఏడు ప్రాణాలు!' అని అనుకున్నకొద్దీ రాముకి ఉత్సాహం ఎక్కువైంది.
తను చేసిన ఘన కార్యం గురించి అందరికీ చెప్పుకోవాలని మోజు పుట్టింది వాడికి. దాంతో వాడు ఊళ్ళోకి పోయి, దర్జీ చేత ఒక పట్టీ కుట్టించుకున్నాడు- దానిమీద 'దెబ్బకు ఏడు ప్రాణాలు!' అని పెద్ద అక్షరాలతో రాయించుకున్నాడు. ఆ పట్టీని పటకాలాగా నడుము చుట్టూ కట్టుకొని, అట్లా లడ్డూలు తింటూ కులాసాగా ఊరి చివరికంటా వెళ్ళొద్దామని బయలు దేరాడు.
ఊరి చివర్లోనే చక్కని అడవి. రాముడు అడవిలో కొద్ది దూరం నడిచాడో లేదో, 'ఆగు' అని అరుస్తూ వాడి ముందు ప్రత్యక్షం అయ్యాడు, ఒక రాక్షసుడు. రాము ఒక క్షణం భయపడ్డాడు. కానీ అంతలోనే వాడికి తన నడుముకు ఉన్న పటకా గుర్తుకొచ్చి, చాలా ధైర్యం అనిపించింది.
వాడు నిటారుగా నిలబడి 'ఏంరా, ఒరే! దెబ్బకు ఏడు ప్రాణాలు అంటే ఏంటో నీకూ తెలీలేదా?! వివరించాలా? ఒక్క దెబ్బ చాలు, అంతే!' అన్నాడు, చేత్తో పటకా కేసి చూపిస్తూ.
రాక్షసుడు రాము నడుం చుట్టూ ఉన్న పటకా కేసి చూసి, కొంచెం బిత్తరపోయాడు. అయితే వెంటనే తేరుకొని, 'నీ బలం చూపించురా, నమూనాకు ఇదిగో- నా బలం ఎంతటిదో‌చూపిస్తాను చూడు' అని ఒక రాయిని తీసుకొని నలిపేసాడు. అది పొడి పొడి అయిపోయి రాలిపోయింది.

రాము గట్టిగా నవ్వి, తన జేబులోంచి ఓ బెల్లపు ఉండను బయటికి తీసి దాన్ని ఒంటి చేత్తో నలిపేసాడు. అది కూడా పిండి పిండి అయిపోయింది- అంతే కాదు; దానిలోంచి ఒక చుక్క నూనె కూడా‌ కారింది!
రాము నలిపేసింది రాయినే అనుకున్నాడు రాక్షసుడు. రాతిలోంచి నూనెను పిండిన రాముని చూసి వాడి వెన్నెముకలోంచి వణుకు పుట్టుకొచ్చింది. వాడు గబుక్కున రాము చెయ్యి పట్టుకొని ఊపుతూ, 'బలే బలవంతుడివోయ్, నువ్వు! నా పేరు ఏకదంతం. నువ్వు నాకు నచ్చావు. నాతో పాటు రా, మా యింటికి! అక్కడ మా తమ్ముడు ద్వేదంతం ఉన్నాడు. వాడికి కూడా‌నిన్ను పరిచయం చేస్తాను. రా, మాయింటికి పోదాం!' అని వాడిని దొరకపుచ్చుకొని తమ గుహకు తీసుకెళ్ళాడు.
రాముకి వాడితో వెళ్ళటం అస్సలు ఇష్టం కాలేదు- కానీ‌ ఏం చేస్తాడు, ఏకదంతం వాడి చేతిని బిగించి పట్టుకొని లాక్కుపో-యాడాయె!
అక్కడికి వెళ్ళేసరికి ద్వేదంతం ఏదో వండుతున్నాడు. ఇక రాముకీ వాళ్ళిద్దరితోబాటు తినటం, అక్కడే పడుకోవటం తప్పలేదు. "సరేలే, తెల్లవారగానే ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకు పోవచ్చు' అని వాడు వాళ్ళు పెట్టిందేదో తినేసి, మంచం మీద నిగడ తన్నుకొని పడుకున్నాడు.
రాము పడుకోవటమైతే పడుకున్నాడు గానీ, భయంతో వాడికి ఎంతకీ నిద్ర పట్టలేదు. రాక్షసుల ముఖాలే వాడి కళ్ళముందు కదలాడుతూ ఉన్నాయి. దాంతో వాడు ఒక్కసారి లేచి, వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారో చూశాడు, కిటికీలోంచి.
ఆ సమయానికి ప్రక్క గదిలో రాక్షసులిద్దరూ మాట్లాడుకుంటున్నారు- 'ఒరే! మేలుకొని ఉండగా వీడిని ఏమీ చెయ్యలేం. కొంచెం సేపయ్యాక, గాఢ నిద్రలోకి జారతాడు గదా, అప్పుడు ఇనుప కడ్డీలతో వీడిని సఫా చేసేద్దాం' అని.
అది వినే సరికి రాము ఇక మళ్ళీ మంచం మీదికి ఎక్కలేకపోయాడు. దగ్గర్లో ఉన్న దిండులను తీసుకొచ్చి, వాటిని మంచం మీద వరసగా పేర్చి తను మంచం వెనకగా దాక్కున్నాడు.
అర్థరాత్రి దాటాక లోనికి వచ్చిన రాక్షసులు, నిండా దుప్పటి కప్పి ఉన్న దిండ్లను చూసి వాడే అనుకున్నారు. తాము తెచ్చిన ఇనుప కడ్డీలతో మళ్ళీ‌మళ్ళీ బాదారు దిండ్లని. చివరికి ఆ మంచం విరిగి రెండు ముక్కలయ్యేంత వరకూ బాదటం ఆపలేదు! ఒకసారి మంచం విరిగాక, 'కిక్కురుమనకుండా చచ్చాడురా, బలవంతుడట-బలవంతుడు!' అని ఈసడిస్తూ వెళ్ళి పడుకున్నారు.
తెల్లవారాక వాళ్ళిద్దరూ ఫలహారం మొదలుపెట్టేసమయానికి, నవ్వుతూ వచ్చి టేబుల్ ముందు కూర్చున్నాడు రాము- 'శుభోదయం అన్నలూ!' అంటూ. చచ్చిపోయాడనుకున్న రాము లేచి వచ్చేసరికి రాక్షసులిద్దరికీ‌ ఆశ్చర్యమూ, భయమూ ఒకేసారి కలిగాయి.
'రా, రా తమ్ముడూ! రాత్రి బాగా నిద్ర పట్టిందా?' అన్నారు వాళ్ళు. 'పర్లేదు అన్నలూ! బానే పడుకున్నాను చాలా సేపు. కానీ మధ్యరాత్రి ఎక్కడినుండి వచ్చాయో గానీ రెండు ఎలుకలు వచ్చాయి- తోకలతో కొట్టి కొట్టి సతాయించాయి నన్ను. ఇంకొంచెం సేపుంటే వాటిని పట్టుకొని నలిపిపారేసి ఉండేవాడిని- బ్రతికి పోయాయి' అన్నాడు రాము నవ్వుతూ.

'బాబోయ్! వీడు మామూలు మనిషి కాదు. మాయం!' అని రాక్షసులిద్దరూ తటాలున మాయం అయిపోయారు.
రాము నవ్వుకుంటూ‌అక్కడున్న బంగారం అంతా తీసుకొని ఇల్లు చేరుకున్నాడు.
అయితే అట్లా అంత బంగారం కళ్ళ చూసే సరికి, వాడికి తన ధైర్య సాహసాలమీద మరింత గురి కుదిరింది. రాజుగారి దగ్గరికి వెళ్ళి తన ప్రతిభకు తగిన ప్రతిఫలం పొందాల్సిందేనని, వాడు ఇప్పుడు రాజధానికి బయలుదేరిపోయాడు! రాజధానిలో వాడిని అడ్డగించబోయిన భటులందరికీ వాడు తన నడుముకున్న పటకానే చూపిస్తూ‌ పోయాడు. 'అమ్మో! వీడెవడో వీర యోధుడల్లే ఉన్నాడు. దెబ్బకు ఏడు ప్రాణాలట! మనకెందుకు, రాజుగారి దగ్గరికే పంపుదాం' అని వాళ్లంతా వాడిని నేరుగా రాజుగారి దగ్గరికే పంపించారు.
ఆ సమయానికి రాజుగారు తల పట్టుకొని ఉన్నారు- రాజ్యంలోకి ఎవరో ఇద్దరు రాక్షసులు వచ్చి పడ్డారు. ప్రజల్ని నానా ఇబ్బందులూ పెడుతున్నారు. వాళ్లని ఎవరు- ఏం చేయాలో, ఎలా చెయ్యాలో తెలీటం లేదు.
"నువ్వెవరో తెలీదు...నిజంగా మహా యోధుడివా?! మా రాజ్యానికి ఈ రాక్షసుల బెడద తొలగించావంటే, నిన్ను మా దగ్గరే ఉంచుకొని చదివించి, పెద్దయ్యాక మా అమ్మాయినిచ్చి పెళ్ళి కూడా చేస్తాను. కాదూ, ఈ పని నీవల్ల అవ్వదంటే చెప్పు; ఆ పటకా తొలగించుకొని ఇంటికి పో. రాక్షసుల సంగతి నేనే చూసుకుంటాను" అన్నాడు రాజు, 'దెబ్బకు ఏడు ప్రాణాలు' అని చదివి.
రాముకి అభిమానం పొంగివచ్చింది. అదీకాక, వాడికి ఇప్పుడు రాక్షసులంటే భయం లేదుగా, అందుకని వాడు రాజుగారికి మాట ఇచ్చి బయలుదేరాడు. రాక్షసులిద్దరినీ వెతుక్కుంటూ పోయాడు.
అడవిలోకి వెళ్లగానే కనబడ్డారు ఏకదంతం, ద్వేదంతం. ఇద్దరూ ఓ మర్రి చెట్టు క్రింద కూర్చొని గమ్మత్తుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. రాము అక్కడున్న గులక రాళ్లను కొన్నిటిని ఏరి జేబులో వేసుకొని, మెల్లగా చెట్టెక్కి కూర్చున్నాడు. ముందుగా ఒక రాయిని గట్టిగా ఏకదంతం మీదికి విసిరాడు. ఏకదంతం ఒక్కసారి ఉలిక్కిపడి, ద్వేదంతం కేసి అనుమానంగా చూసి ఊరుకున్నాడు.
ఇప్పుడు రాము మరో రాయిని, మళ్ళీ ఏకదంతం మీదికి విసిరాడు. ఈసారి వాడు 'ఏమిరా, నీకేమయింది?! బుద్ధి ఎక్కడికో పోతున్నట్లున్నదే!?' అని గట్టిగా తిట్టాడు ద్వేదంతాన్ని.
చెట్టుమీదున్న రాము నవ్వుకొని, ఈసారి రాయిని ద్వేదంతం మీదికి విసిరాడు. ద్వేదంతం చటుక్కున లేచి 'నేను నిన్ను ఏం చేసాను? అట్లా కొడతావెందుకు?!' అని ఏకదంతంతో కలబడ్డాడు.
అట్లా రాము ఇద్దర్నీ మార్చి మార్చి కొట్టటం, ఇద్దరూ ఒళ్ళు మరచిపోయేట్లు కొట్టుకోవటం జరిగాయి- చివరికి ఇద్దరూ కలిసి పైకి చూసేసరికి, కొమ్మల్లో ఇకిలిస్తూ కనబడ్డాడు రాము- "నేను రానా? నేను కొట్టనా?!" అని అడుగుతూ.
రాక్షసులిద్దరికీ గుండె జారిపోయినట్లయింది. "అన్నా! తమ్ముడూ! వీడు మనల్నే వెంబడిస్తున్నాడు! మాయం!" అని వాళ్ళిద్దరూ తటాలున మళ్ళీ‌ అక్కడినుండి మాయం అయిపోయారు. ఈసారి ఇద్దరూ ఆ రాజ్యాన్నే విడిచిపెట్టి పారిపోయారు.
రాజుగారు రాముని గొప్పగా సత్కరించారు. ఏనుగుమీద కూర్చోబెట్టి ఊరేగించారు. రాముకి చాలా సంతోషం వేసింది. మనసు కొంచెం సేపు మబ్బుల్లో తేలిపోయింది... అంతలోనే వాడి ముఖం మీద నీళ్లు వచ్చి పడ్డాయి- "లేవరా, గాడిదా! రాణి, రాజు, సింహాసనం, ఏనుగులూ అన్నీ ఎక్కడివక్కడే ఉన్నాయిలే! లేచి వెంటనే పళ్ళుతోముకొని బడికి బయలుదేరలేదంటే నీకు ఇక్కడే స్నానం చేయించేస్తాను నేను" అంటూ మరో చెంబెడు నీళ్ళు వాడి ముఖం మీద చిలకరించబోయింది రాము వాళ్ళమ్మ!
చటుక్కున లేచిన రాము గబగబా స్నానాల గదిలోకి దూరాడు. పళ్ళు తోముకొని రాగానే అమ్మ వాడి చేతిలో ఓ‌ బెల్లపు లడ్డూ పెట్టింది. "నేను తిన్నాగా?" అన్నాడు రాము. "ఎప్పుడు తిన్నావురా? నిన్న బడినుండి రాగానే పడుకొని మొద్దులాగా నిద్రే పోతివి. ఇప్పుడేగా, నిద్ర లేచింది!" అన్నది అమ్మ అనుమానంగా.
అప్పుడు అర్థమైంది రాముకి- "అమ్మా! తెల్లవారు జామున వచ్చిన కలలు నిజం అవుతాయా?" అడిగాడు.
"ఒరే, కలలేవీ నిజం కావురా! కరిగిపోతాయి! నిజం మటుకు నిప్పు- అది ఎప్పుడూ నిజంగానే ఉంటుంది.” అంది అమ్మ.