మగధ రాజ్యానికి ప్రభువు విక్రమ వర్మకి ఒకసారి చాలా ముఖ్యమైన పని పడి దూర ప్రదేశానికి వెళ్లవలసి వచ్చింది. వెళ్ళిన పని పూర్తయ్యాక తిరిగి రాజధానికి వచ్చేటప్పుడు దారిలో ఆయనకు చిన్ననాటి స్నేహితుడొకడు ఎదురయ్యాడు. అతను సామాన్య గృహస్తుడే, అయినా రాజుని ప్రేమగా పలకరించి, "విక్రమా! బాగా చీకటి పడింది. ఇప్పుడు ప్రయాణించాల్సిన అవసరం ఏమున్నది? నీకు అభ్యంతరం లేకపోతే, ఈ రాత్రికి మా ఇంట్లోనే ఉండి, సేదతీరు. తెల్లవారగానే రాజధానికి పోవచ్చులే, ఏమంటావు?" అన్నాడు.
'సరే' అని విక్రమవర్మ గుర్రాన్ని మిత్రుడి ఇంటి బయటే కట్టివేసి, ఆ రాత్రికి మిత్రుడి ఇంట బస చేశాడు. తెల్లవారాక నిద్రలేచి వచ్చి చూస్తే ఏముంది- గుర్రం కాస్తా మాయం!
మిత్రుడు చిన్నబోయాడు. కానీ ఏం చెయ్యగలడు, పాపం?
రాజుగారు ఊరుకోలేదు. రాజుగారు కద, మరి?! ఊళ్ళోవాళ్లందరినీ ఒకచోట చేర్చారు. "నా గుర్రాన్ని ఎవరైతే తీసుకెళ్ళారో, వాళ్లకు మరొక్క అవకాశం ఇస్తున్నాను- గుర్రాన్ని ఎక్కడినుండైతే విడిపించుకెళ్ళారో దాన్ని అక్కడే-మర్యాదగా- రేపు ఉదయంలోగా- కట్టి పెడితే సరి, లేదంటే గతంలో మా నాన్నగారు ఏ పని చేశారో నేనూ అదే పని చేస్తాను, ఖచ్చితంగా! ఇక దీనికి తిరుగులేదు! నా నిర్ణయం మారదు! గుర్తుంచుకోండి మరి!" అని కరాఖండీగా చెప్పేశారు.
ఊళ్ళోవాళ్ళు అందరూ బెదిరిపోయారు.
గుర్రాన్ని ఎత్తుకెళ్ళిన దొంగవాడు కూడా భయపడిపోయాడు. తను చేసిన పనివల్ల ఊరంతటికీ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని అతను ఊహించనేలేదు. అందుకని వాడు చడీ చప్పుడు లేకుండా వచ్చి, ఆరోజు రాత్రి గుర్రాన్ని యథాప్రకారం గుంజకు కట్టేసి వెళ్ళిపోయాడు.
తెల్లవారేసరికి గుర్రం గుంజకు కట్టేసి ఉంది.
దాన్ని చూశాక విక్రమవర్మ ముఖం ప్రసన్నమైంది. ఆయన మిత్రుడికి ధన్యవాదాలు చెప్పి, గ్రామస్తులందరికీ చెయ్యిఊపి అభివాదం చేసి, గుర్రం ఎక్కి బయలుదేరబోయారు. అంతలో ఆ ఊరి పెద్ద ఆయనకు నమస్కరించి "ప్రభూ! మీ గుర్రం దొరికినందుకు చాలా సంతోషం. అయితే మాదొక్క మనవి- పోయిన ఆ గుర్రం గనక దొరక్కపోతే మీ నాన్నగారు గతంలో ఏం చేసారో మీరూ అదే చేస్తామన్నారు- ఇంతకీ గతంలో తమరి తండ్రిగారు ఏం చేశారు ?!" అని అడిగాడు.
"గతంలో ఇలాగే ఓసారి మా నాన్నగారు ఓ ఊళ్ళో బసచేసి ఉండగా ఎవరో ఆయన గుర్రాన్ని దొంగిలించారు. అప్పుడు ఆయన మరొక గుర్రాన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కుని రాజధానికి తిరిగి వచ్చారు! గుర్రం తిరిగి ఇవ్వకుంటే నేనూ అదే పని చేసి ఉండేవాడిని!ఇంకేమి!" అని వెళ్ళిపోయారు విక్రమవర్మగారు.
గ్రామస్తులందరూ అవాక్కయ్యారు. తమ రాజుగారి గడుసుదనాన్ని తలచుకొని అనేక తరాలపాటు నవ్వుకున్నారు.