తెట్టు గ్రామ పంచాయితీ ప్రెసిడెంట్ జనార్థన స్వామి చాలా మంచివాడు. ప్రజలకి ఉపయోగపడే ఎన్నోపనులు చేస్తూ చుట్టు ప్రక్కల ఉన్న గ్రామాలలో మంచి పేరు సంపాదించుకున్నాడు ఆయన.
ఈ పంచాయితీ పరిథిలోనే ఉన్న పూజారివారి పల్లి అనే చిన్న గ్రామంలో సాంబడు అనే కుర్రవాడు ఉండేవాడు. వాడికి ఒక అవ్వ తప్ప ' నా ' అన్న వారెవ్వరూ లేరు. తల్లిదండ్రులు చిన్నప్పుడే పోవడంతో అవ్వే వాడిని పెంచి పెద్ద చేసింది.
వాడికి ఒక చెడ్డ అలవాటు ఉంది. ఎవరైనా ఏదైనా తింటుంటే వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఆత్రంగా 'నాకు?!" అని చెయ్యి చాపుతాడు. వాళ్ళు తినేదో లేక మరొకటో వాడి చేతిలో పెడితే గాని అక్కడి నుండి వెళ్ళడు. వీడి సంగతి తెలిసిన వారెవ్వరూ వాడికి కనబడేట్లు తినరు. ఈ అలవాటు కారణంగా వాడిని ఎవ్వరూ పనికి కూడా పెట్టుకోవడం లేదు. తెలియని వారు పెట్టుకున్నా త్వరలోనే పనిలో నుండి తీసేసేవారు వాడిని.
అవ్వకు వీడి గురించి పెద్ద బెంగ పట్టుకుంది. "అవ్వా! వీడిని జనార్థన స్వామికి ఒప్పగించి రా! ఆయనకి తప్ప వీడిని భరించడం ఎవరి వల్లా కాదు" అని ఆమెకు సలహా ఇచ్చాడు ప్రక్కింటి రంగయ్య .
అవ్వకు ఆ సలహా నచ్చింది. మర్నాడే తెట్టుకు బయలుదేరింది. జనార్థన స్వామిని కలుసుకుని వీడికున్న అలవాటు గురించీ, దాని వల్ల పని లేకుండా పోవడం గురించి చెప్పుకుంది.
'అది పెద్ద సమస్య కాదు కదా! ఎందుకు పనిలో నుండి తీసివేస్తున్నారు?' అని అనుకుంటూ "నువ్వేం దిగులు పడకు అవ్వా! నా దగ్గర పని చేస్తాడులే " అన్నాడు స్వామి.
మర్నాడు స్వామి కూతురు లక్ష్మి లడ్డు తింటుంటే సాంబడు ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి ఆత్రంగా "నాకు?!" అని చేయి చాపడం చూసాడు స్వామి. భార్యని పిలిచి "వీడికి కడుపు నిండా అన్నం పెట్టు" అని చెప్పాడు. ఆమె 'వద్దు ఇక చాలు' అనేదాకా అన్నం పెట్టింది వాడికి. ఆ తర్వాత ఏమయిందో తెలుసా? వాడు బయటికి వచ్చి చెయ్యి కడుక్కుంటూ ఇంకా అక్కడే కూర్చుని లడ్డు తింటున్న లక్ష్మి దగ్గరకు మళ్ళీ వెళ్ళి ఆత్రంగా "నాకు?!" అన్నాడు!
'వీడు ఎందుకు అలా అడుగుతున్నాడు? పిండి వంటలు తినాలనుందేమో, వీడికి!' అనుకుని మర్నాడు పిండివంటలతో సుష్టుగా భోజనం పెట్టించాడు స్వామి. భోజనం అయ్యాక చెయ్యి కడుక్కోవడానికి పెరట్లోకెళ్ళిన సాంబడు అక్కడ కూర్చుని అన్నం తింటున్న పాలేరును చూసీ చూడగానే అతని దగ్గరకి ఆత్రంగా పరిగెత్తాడు- "నాకు?!" అంటూ.
స్వామికి చాలా చిరాకు కలిగింది. ఆ రాత్రంతా సాంబడి గురించిన ఆలోచనతో ఆలస్యంగా నిద్ర పోవడంతో మర్నాడు ఆయనకు తలనొప్పి కూడా వచ్చింది. ఫలహారం అయ్యాక తలనొప్పి మాత్ర వేసుకోవడానికి అక్కడే బల్ల తుడుస్తూ ఉన్న సాంబడిని మంచి నీళ్ళు తెమ్మన్నాడు స్వామి. వాడి చేతిలోనుండి నీళ్ళు తీసుకుని మాత్ర వేసుకోబోతున్న స్వామిని చూసిన సాంబడు "నాకు?!" అంటూ చెయ్యి చాపాడు.
ఫక్కున నవ్వాడు స్వామి. ఆయన చిరాకంతా మాయమైంది. 'వాడికిది కేవలం అలవాటే గాని కోరిక కాదు' అని గ్రహించాడాయన. భార్యతో "వాడు అడిగినప్పుడల్లా ఏదో కాస్త చేతిలో పెడుతుండు" అన్నాడు.
అయితే ఇది పెద్ద సమస్యే అని తరువాత జరిగిన సంఘటనల వల్ల ఆయనకు తెలిసింది.
ఒకరోజు సాంబడు పాలు పిండుతున్నాడు. ఆ సమయంలో పనిమనిషి రంగమ్మ అక్కడకి కొంచెం దూరంలో కూర్చుని చద్దన్నం తినసాగింది.
పాలు పిండుతూ ఎందుకో తల తిప్పిన సాంబడికి ఇది కనిపించగానే పాలగెన్నెను అలానే వదిలేసి 'నాకు?!' అంటూ ఆత్రంగా పరిగెత్తాడు. ఆవు పాలగిన్నెను తన్నేసింది.
ఇంకో రోజు వాడు బావిలో నీళ్ళు తోడుతున్నాడు. అంతలో బ్రష్‌తో పళ్ళు తోముకుంటూ వచ్చాడు స్వామి కొడుకు. వాడిని చూడగానే 'ఏదో తింటున్నాడు' అనుకున్నాడు సాంబడు. చేదను అట్లానే వదిలేసి 'నాకు?!' అంటూ పరిగెత్తాడు!
చివరికి స్వామికో ఉపాయం తట్టింది. భార్యకు, పిల్లలకు, పాలేళ్ళకు తన ఆలోచనను చెప్పాడు. తర్వాతి రోజున మధ్యాహ్నం అయినా స్వామి భార్య సాంబడికి భోజనం పెట్టలేదు. వాడికి ఆకలి దహించుకు-పోతోంది.
వంట ఇంటి దగ్గర తచ్చాడుతున్న వాడిని పిలిచి "ఇంకా వంట అవలేదురా! ఈలోగా ఇది తిను" అంటూ ఒక జిలేబీ ఇచ్చింది ఆవిడ.
వాడు జిలేబీని తింటుండగా స్వామి కొడుకు వచ్చి "నాకు?!" అంటూ చెయ్యి చాపాడు. తత్తరపడిపోయిన సాంబడు తన చేతిలో ఉన్న జిలేబీని వాడికి ఇచ్చేశాడు.
ఇంకో గంట గడిచింది. స్వామి భార్య బయటకు వచ్చి వాడిని చూసి, మళ్ళీ ఇంకో జిలేబీ ఇచ్చింది. ఈసారి స్వామి కూతురు పరిగెత్తుకుంటూ వచ్చి "నాకు?!" అంది చేయి చాపుతూ. పాపం! సాంబడు. అది కూడా ఇచ్చేశాడు. కాసేపాగాక "అమ్మా! ఆకలేస్తుంది " అని కేకేశాడు.
"అయ్యో! ఆకలేస్తుందా! ఇదిగో ఇంకో జిలేబీ తిను" అంటూ స్వామి భార్య మరో జిలేబీని వాడి చేతిలో పెట్టింది. దాన్ని వాడు ఆత్రంగా కొంచెం కొరికేలోపు పాలేరు- "నాకు?!" అంటూ వచ్చాడు.
సాంబడికి ఇప్పుడు చాలా కోపం వచ్చింది. "నేను ఇవ్వను ఫో! నాకు చాలా ఆకలిగా ఉంది! నన్ను అడక్కు!" అన్నాడు.
అప్పుడు అక్కడికి వచ్చిన స్వామి వాడితో "సాంబా! నువ్వు అందరినీ ఇలాగే అడుగుతావు కదా! ఇప్పటికైనా తెలిసిందా? అలా అడిగితే తినేవాళ్ళకు ఎంత బాధ కలుగుతుందో! వాళ్ళకై వాళ్ళు నిన్ను పిలిచి పెడితే తీసుకోవాలి తప్ప, అదే పనిగా అడగకూడదు" అన్నాడు.
సాంబడికి ఇన్నిరోజులూ తను చేసిన తప్పు అర్థం అయింది. కానీ తన అలవాటుని మానుకోవటానికి మటుకు వాడు చాలా కష్టపడవలసి వచ్చింది!