పార్వతిని చూస్తే రత్నమాలకి కోపం.
రత్నమాల వాళ్ళు చాలా పెద్ద ఇల్లున్న ధనవంతులు. పార్వతీవాళ్ళు ఆ యింట్లో రెండు చిన్న గదులలో అద్దెకి వుండే పేదవాళ్ళు. కానీ ఇంటి చుట్టుప్రక్కల వున్నవాళ్ళు అందరూ పార్వతితో చాలా ప్రేమగా మాట్లాడతారు. ఆమె అంటే చాలా గౌరవం చూపిస్తారు. ఏ సహాయం కావాలన్నా రత్నమాలని అడగకుండా పార్వతినే అడుగుతారు.
అందుకే రత్నమాలకి పార్వతి అంటే కోపం. కోపమే కాదు, అసలు అందరూ ఎందుకిలా చేస్తారని ఆశ్చర్యం కూడా.
"ఆవిడ బాగా సహాయం చేస్తుందని ఆవిడని అడుగుతారేమో!" అంటాడు రత్నమాల వాళ్ళ ఆయన.
"మరి నన్ను ఎవరు అడగడమే లేదు కదా! వాళ్ళు అడిగితే కదా నేను సహాయం చేస్తానో చేయనో తెలిసేది!" అంటుంది రత్నమాల.
“పార్వతి దగ్గర పది రూపాయలు కూడా వుండవు. నా దగ్గరేమో యింత డబ్బుంది. ఇన్ని నగలున్నాయి. అయినా అందరూ ఏమన్నా సహాయం కావాలంటే పార్వతి దగ్గరకే వెళ్తారు. నా దగ్గరికి రారు. ఎందుకో తెలీదు." అనుకుంది రత్నమాల ఒక రోజున చిరాకుపడుతూ.
"సహాయమెప్పుడూ దయతో చేయాలి. సహాయం చేయడానికి దయ ముఖ్యం కానీ డబ్బులు కాదు. డబ్బులున్నాయన్న పొగరుతోనో, అందరూ మనల్ని పొగడాలన్న కోరికతోనో సహాయం చేయకూడదు. అది తప్పు." అని వాళ్ళ ఆయన నచ్చచెప్పబోయాడు.
రత్నమాలకి యింకా కోపం వచ్చింది. "మీరు చెప్పేది చాలా బాగుంది. డబ్బుల్లేకుండా దయ మాత్రం వుంటే లాభం ఏముంది?" అంది.
దానికి ఆయన నవ్వి "ఏమో మరి, పెద్దవాళ్ళు చెప్తారు. మంచిపని చేసే అవకాశం అందరికీ రాదుట. మంచి మనసున్నవాళ్ళకే వస్తుందిట." అన్నాడు.
సరిగ్గా అప్పుడే ఎదురుగా వున్న ఖాళీ స్థలంలోని గుడిసెలలో వుండే రంగమ్మ ఓ బిందె పట్టుకుని పార్వతీ వాళ్ళ యింటిలోకి వెళ్ళడం కనిపించింది రత్నమాలకి.

"ఇవాల నీళ్ళటాంకర్ రాలేదమ్మా. ఒక బిందె మంచినీళ్ళిస్తావా!" అని అడిగింది రంగమ్మ పార్వతిని.
అది విన్న రత్నమాలకి నవ్వొచ్చింది. పార్వతీ వాళ్ళింట్లో ఉన్నదే ఒక బిందె. మంచినీళ్ళు రోజు విడిచి రోజు వస్తాయి కదా! అందుకని వాళ్ళు ఆ ఒక్క బిందె లోను, ఇంకా చిన్న చిన్న గిన్నెలలోను నీళ్ళు పట్టుకుంటారు. ఆ నీళ్ళే రెండు రోజులూ జాగ్రత్తగా వాడుకుంటారు. రత్నమాలేమో నాలుగు బిందెల నిండా, ఇంకా ఓ పెద్ద డ్రమ్ము నిండా నీళ్ళు నింపి పెట్టుకుంటుంది.
అందుకే రత్నమాల ‘ఇప్పుడు ఈ పార్వతి ఏంచేస్తుంది? రంగమ్మకి ఏం చెప్తుంది?” అనుకుంది.
పార్వతి రంగమ్మతో అ మాటే చెప్పింది. "సగం బిందెడు నీళ్ళే వున్నాయి రంగమ్మా!" అంది.
"పిల్లలు ఆకలి అంటున్నారు. అన్నం వండుదామంటే అసలు నీళ్ళు లేవు"అంది రంగమ్మ.
"అయ్యో!" అని బాధ పడింది పార్వతి. తన దగ్గర వున్న కాసిని నీళ్ళలోనుంచే కొన్ని తెచ్చి రంగమ్మ బిందెలో పోసింది.
రంగమ్మ అవి తీసుకుని వెళ్ళింది. బియ్యం కడిగి, గుడిసె బయటే వున్న పొయ్యి మీద అన్నం వండడం మొదలు పెట్టింది.
అది చూసి రత్నమాల వాకిట్లోకి వెళ్ళి "రంగమ్మా" అని కేక పెట్టి పిలిచింది. "మంచినీళ్ళు లేవా!" అని అడిగింది.
"లేవమ్మా, పార్వతమ్మ పుణ్యమా అని అన్నం అయితే వండుకున్నాం కానీ, తాగడానికి లేవు" అంది రంగమ్మ.
"మాయింట్లో ఉన్నాయి. కావాలంటే వచ్చి ఒక బిందె తీసుకువెళ్ళు" అని చెప్పి లోపలికి వచ్చింది రత్నమాల.
‘గిన్నెడు నీళ్ళిచ్చిన పార్వతమ్మదే పుణ్యం అయితే ఇప్పుడు నేను బిందెడు నీళ్ళిస్తున్నాను కదా, నాదెంత పుణ్యం!’ అనుకుంది. తన గొప్ప చూపించుకునే అవకాశం వచ్చినందుకు రత్నమాలకి చాలా సంతోషంగా అనిపించింది.
బిందె తీసుకుని వస్తున్న రంగమ్మని చూసి, గబగబా తను కూడా లోపలినుంచి నీళ్ళ బిందె పట్టుకొచ్చి వాకిట్లో పెట్టింది.
గేటు దాకా వచ్చింది రంగమ్మ. తలుపు తీసుకుని లోపలికి రాబోయింది. అంతలోనే ఆగిపోయి వెనక్కి పరుగెత్తింది.
ఏమయిందో అర్ధం కాక రత్నమాల ఆశ్చర్యంగా బయటికి వచ్చింది. అక్కడ ఆమెకి అపుడే వచ్చి ఆగిన నీళ్ళటాంకర్, అందులోనుంచి నీళ్ళు పట్టుకుంటున్న రంగమ్మా కనిపించారు.

మంచిపని చేసే అవకాశం అందరికీ రాదనీ, అది రావాలంటే ముందు మనం మన మనసులో మంచితనాన్ని పెంచుకోవాలనీ రత్నమాలకి అర్ధమయింది.