కొత్తదనంతో, చకచకా చదివించిన కథలతో ఈ సంచిక ప్రత్యేకంగా , ఆ సక్తి కరంగా అనిపించింది.
ముఖ్యంగా చెప్పుకోవలసింది 'దొందూ దొందే' కథ. మానసకి ప్రత్యేక ప్రశంశలు. ముగింపు ఊహించని విధంగా, భలేగా వుంది. కాకపోతే అందరూ దెయ్యాలైతే, 'మరి అవ్వ కూడానా?' అన్నది అర్థం కాలేదు.
నాగుల్‌షరీఫ్, యోగేశ్వర రెడ్డి ఎన్ని కథలు వ్రాసుంటారో ఇప్పటికి! వ్రాసిన కొద్దీ ఆలోచనలు పదునెక్కుతాయనడానికి ఉదాహరణ- షరీఫ్ వ్రాసిన 'మర్యాద మాటల పిచ్చుక'. దీని ముగింపు కూడా బాగుంది. ఐతే మధ్యలో 'చిలుక' ప్రస్తావన వచ్చింది ఎందుకనో! 'యుక్తి' లాంటి కథలు మునుపు చదివాం గానీ, 'ఇది క్రొత్తదే' అనిపించేలా వ్రాశాడు యోగి.
'అపకారికి ఉపకారము' నీతికథల ఫార్ములాకి ప్రతీక. కానీ పిల్లలకు మంచి-చెడుల అవగాహన పెద్దలతో సమానంగానో, లేదా మరి కాస్త ఎక్కువగానేనో ఉంటుందనిపించింది. 'ద్వేషం, అసూయలాంటి గుణాలు చెడ్డవి'అని తెలియడమే కాక, వాటితో నలిగే పోయే వారి పట్ల కూడా ఎలా ప్రవర్తించాలో చెప్పింది దివ్య! చిన్న పిల్లకి ఆ అవగాహన పెద్ద విషయమే.
32వ పేజీలో ఇచ్చిన 'బాపూ బొమ్మ' అబ్బురపరచింది. ఒకే గీతతోఅంత పెద్ద బొమ్మ గీద్దామని ఎలా అనిపించిందో, ఆయనకు!
ధనుంజయరావు రాసిన 'పరిపాలకు లెవరు?' బావుంది. "స్వాతంత్ర్యం తీసుకోవడానికి భారతదేశం ఇంకా సిద్ధంగా లేదు" అని బ్రిటిష్ వాళ్ళు చాలా కాలం పాటు అన్నారు- ఆ సంగతి గుర్తుకొచ్చింది ఈ కథ చదివాక. ఇక, సింహరాజు - 'అయ్యాడు' - 'పోతున్నది' అంటూ ఒకే కథలో , ఒకే పాత్రకి రెండు లింగాలు ఆపాదించే గందరగోళం గతంలో కూడా జంతువుల కథల దగ్గర జరిగింది. కొత్తపల్లి వారు వీటిని సవరించుకోవాలి.
శంకర శివరావు గారి 'తాయత్తు మహిమ' కథాంశం ఆసక్తికరంగా వుంది. అల్లిక మాత్రం కొంత గందరగోళంగా అనిపించింది. ముఖ్యంగా సీతాలు ఏకబిగిన ఇచ్చిన ఉపన్యాసంలో విషయం ఇంకొంచెం క్లుప్తంగా వుంటే బాగుండేదేమో అనిపించింది.
'రూమీ చెప్పిన కథలు' మొదలు పెట్టినందుకు కొత్తపల్లికి అభినందనలు. తప్పకుండా ఇది పిల్లలకు మంచి బహుమతి.
47వపేజీలో కొటేషన్ మార్కుల గందరగోళం బాగానే ఉంది- కొత్తపల్లివారు సవరించుకోవాల్సిన మరో అంశం ఇది.
'వెనక కాళ్ళ దెబ్బ'లో ముందు తన కాళ్ళు తనకి సహకరించడం లేదనుకునేంత మూర్ఖంగా వున్న గాడిద, అంత వెంటనే పులి దురుద్దేశ్యాన్ని పూర్తిగా ఎట్లా అర్థం చేసుకుందో తెలీలేదు. ప్రాణం మీదికొస్తే అట్లా అవుతుందేమో మరి!
చివరగా - వీరాంజి రూపుదిద్దిన 'ధ్యానంలో వున్న గాంధీ' బొమ్మ చూసిన కొద్దీ మనసు ప్రశాంతమయ్యేట్లు వుంది. "పెన్సిల్ ముక్క" గాంధీగారి గురించి అంతకు ముందు చదవని ఓ కొత్త కథని చెప్పింది. చిన్న కథలో అంత పెద్ద విషయాన్నీ, బాపూ నిరాడంబర జీవితాన్నీ, ప్రేమనీ చూపిస్తూనే ఆయన మహా మొండి ఘటమనీ చెప్పడం సరదాగా వుంది.
కొత్తపల్లి బృందానికి , పిల్లలందరికీ దసరా శుభాకాంక్షలు.