అనగనగాఒక ఊరు. ఆ ఊరిలో 'దివ్య' అనే అబ్బాయి ఉండేవాడు. ప్రతి ఒక్కరూ వాడిని 'అమ్మాయి పేరు పెట్టుకున్నావ్ ఏంటీ' అని ఎగతాళి చేసేవారు. దివ్య పెద్దగా ఏమీ పట్టించుకునేవాడుకాదు; కానీ వాడి మనసులో మాత్రం 'అయ్యో, నా పేరు ఇట్లా ఎందుకు పెట్టారు? వేరే పేరేదయినా పెట్టిఉంటే బాగుండేది కదా' అనుకునేవాడు. బయటికి మాత్రం 'నా పేరు, నా యిష్టం. నీదేంటిరా?' అని కోపంగా అనేసి పేరు మార్చుకోకుండానే ఉండేవాడు.
వాడికి ఉండే రకరకాల అనుమానాల్లో ఒకటి స్వర్గం గురించి. 'స్వర్గం అంటే ఏమిటి?' అని వాడి డౌటు. ఆ సంగతిని వాడు చాలా మందిని అడిగాడు.
వాళ్ళ అమ్మను కూడాను. అమ్మకి వీడు అట్లా ఎందుకు అడుగుతున్నాడో తెలీదు కదా, అందుకని చెప్పింది- 'స్వర్గం చాలా బాగుండే స్థలంరా. అక్కడ ఉన్నవాళ్ళు ఏమీ కోరుకుంటే అది తక్షణమే జరుగుతుంది' అన్నది. అయితే వీడు అడిగాడు- 'స్వర్గానికి ఎలా వెళ్తారు?' అని. 'చనిపోయాక వెళ్తారురా!' అంది వాళ్ళమ్మ, పెద్దగా ఏమీ ఆలోచించకుండా.
'ఎట్లాగైనా స్వర్గం చూసి రావాలి' అనిపించటం మొదలు పెట్టింది దివ్యకు. "స్వర్గంలో అన్నీ చాలా బాగుంటాయి..ఏవి కావాలంటే అవి వస్తాయి..నా పేరు కూడా, ఏది కావాలంటే అది వచ్చేస్తుంది..ఒక్కసారి వెళ్ళి వచ్చేస్తే సరి.." ఇట్లా అనుకుంటూ వాడు కలల్లో తేలిపోవటం మొదలు పెట్టాడు. "స్వర్గం వెళ్ళాలంటే చనిపోవాలి. ఆహారం తీసుకోవటం మానేస్తే చనిపోతాం కదా, అప్పుడు స్వర్గం వెళ్ళచ్చు" అనుకొని, వాడు తిండి తిప్పలు మానేశాడు.
మన శరీరానికి ఆహారం చాలా అవసరం. అది లేకపోతే నీరసించి పోతాం. చూస్తూ చూస్తూండగానే దివ్య చాలా నీరసించి పోయాడు. మంచం దిగి నడవలేని పరిస్థితి వచ్చేసింది. వాడి మెదడు కూడా సరిగ్గా పనిచేయటం మానేసింది. ఏవేవే తిక్క తిక్కగా మాట్లాడటం మొదలు పెట్టాడు వాడు.
వాళ్ల అమ్మ వాళ్లకు భయం వేసి, వాడిని డాక్టరు దగ్గరికి తీసుకెళ్ళారు. డాక్టరు గారు వాడిని పరీక్షించి, "వీడు ఏవేవో ఊహల్లో ఉంటున్నాడు. మన లోకంలో లేడు. వీడికి మంచి ఆహారం ఇచ్చి, అనువైన ప్రదేశంలో ఉంచితే, నాలుగు రోజుల్లో అన్నీ సర్దుకుంటాయి. ఏమీ పరవాలేదు" అని చెప్పారు.
ఆరోజున దివ్య నిద్రపోయి లేచేసరికి వాళ్లంతా "పిల్లల డ్రీమ్ లాండ్" లో ఉన్నారు. "మనం ఎక్కడికొచ్చాం?" అడిగాడు వాడు ఆశ్చర్యంగా. "ఇది పిల్లల స్వర్గంరా" అన్నది వాళ్ల అక్క. దివ్య వాళ్ల అక్క, చెల్లి, స్నేహితులు అందరూ దివ్యని కాపాడటానికి డాక్టరుగారు చెప్పిన విధంగా నటించడం ప్రారంభించారు మరి!
అంతలో ఒక అమ్మాయి వచ్చి, చక్కగా నవ్వి, "స్వర్గానికి స్వాగతం! ఇక్కడ మీరు ఏమంటే అది జరుగుతుంది- ఏది కావాలంటే అది తెచ్చిస్తాం. మీకేది కావాలన్నా నన్ను పిలవండి" అన్నది. "అందరం స్వర్గానికి వచ్చేశాం" అని ఆనందంతో చిందులేశాడు దివ్య. వెంటనే ఆ అమ్మాయిని పిలిచి, "నా పేరు మార్చుకుంటున్నాను- ఇప్పటినుండి నా పేరు 'హీరో పవన్‌కళ్యాణ్'. సరేనా?" అన్నాడు. "ఓ, ఇక్కడ మీరు ఎలాగంటే అలాగే" అన్నదా అమ్మాయి.
అప్పటి నుండి దివ్యను అందరూ 'హీరో పవన్‌కళ్యాణ్' అని పిలవడం మొదలు పెట్టారు.
ఇట్లా ఓ నాలుగు రోజులు గడిచింది. మంచి ఆహారం తినటం వల్ల, దివ్య ఇదివరకటిలాగానే బలంగా తయారయ్యాడు. వాడి మెదడుకు రక్తప్రసరణ సరిగ్గా జరిగింది కూడాను. దాంతో వాడికి వాళ్ల అమ్మానాన్నలు గుర్తుకు రావటం మొదలు పెట్టారు. "అదొక్కటీ వీలవదండి- పిల్లల స్వర్గం కదా, ఇది? దీనికి పిల్లలు మాత్రమే రాగలరు!" అన్నది స్వర్గం అమ్మాయి. అయితే మరునాటికల్లా దివ్య ఇక తట్టుకోలేకపోయాడు- "నాకు ఇవేవీ అక్కర్లేదు- నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి" అని ఏడవటం మొదలుపెట్టాడు.
అప్పుడు అతన్ని పరీక్షించిన డాక్టరుగారు నవ్వి, సరేలే, పంపిస్తాం" అన్నారు. అందరూ కలిసి నిద్రపోతున్నవాడిని నిద్రపోతున్నట్లు వాడిని వాళ్ల ఇంటికి చేర్చేశారు మళ్ళీ. వాడు నిద్ర మేల్కొని చూసే సరికి వాళ్ల అమ్మ, నాన్న- అందరూ కనబడ్డారు వాడికి!
"ఏంటిరా, హీరో పవన్ కల్యాణ్! అట్లా చూస్తున్నావేంటి?" అన్నది వాళ్లమ్మ. దివ్యకు సిగ్గు ముంచుకొచ్చింది. నన్ను ఎప్పటిలాగానే 'దివ్య' అని పిలవండి. నా పేరు నాకు చాలా బాగుంది. ఇప్పట్లో పేరు మార్చుకోను" అన్నాడు వాడు. "మరి, స్వర్గంలో వాళ్ళు అట్లా చెప్పారే?" అంది అమ్మ సంతోషంగా నవ్వుతూ. "స్వర్గంలో నాపేరు మార్చుకున్నాను. ఇక్కడ నా పేరు అట్లాగే ఉంచుకుంటాను" అన్నాడు దివ్య, మరింత సిగ్గు పడుతూ. వాడు బాగైపోయినందుకు వాళ్ల అమ్మావాళ్ళు చాలా సంతోషించారు. వాడంటే ఇష్టం ఉన్న స్నేహితులందరూ అటుపైన వాడిని ఏడిపించటం మానేశారు కూడానూ!