ఒక ఊరిలో ఒక నాన్న, అమ్మ, అన్న, తమ్ముడు ఉన్నారు. అన్న పేరు పెద్దోడు. తమ్ముడి పేరు చిన్నోడు. అన్న వేరే ఊళ్ళో హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నాడు. సెలవులకు ఇంటికి వచ్చాడు.

ఆ సమయంలో అమ్మకు జ్వరం వచ్చింది. ఎంతకీ తగ్గలేదు. అప్పుడు చిన్నోడు, పెద్దోడు గుడికి పోయి "స్వామీ! మా అమ్మకు బాగైతే నీకు టెంకాయ కొడతాను" అని మొక్కుకున్నారు. ఆ తర్వాత రెండు రోజులకు అమ్మకి జ్వరం తగ్గింది- దాంతో వాళ్ళిద్దరికీ స్వామి మహిమ మీద చాలా నమ్మకం కుదిరింది.

అయితే అంతలోనే వాళ్ల తాత చనిపోయాడు. 'ఈ సమయంలో స్వామికి టెంకాయ కొట్టరాదు' అని చెప్పారు పెద్దలు. దాంతో చిన్నోడికి, పెద్దోడికి గుడిలో స్వామికి టెంకాయ కొట్టటం వీలవ్వలేదు. అంతలోనే సెలవలు అయిపోయాయి. పెద్దోడు హాస్టలుకు వెళ్ళిపోయాడు.

ఆ తర్వాత ఐదు రోజులకు అమ్మకు ఒక ఉత్తరం వచ్చింది- 'నీ కొడుక్కు జ్వరం' అని. కన్న ప్రేగు తల్లడిల్లింది. అమ్మ బయలుదేరుతుండగా పెద్దోడు ఫోన్ చేసాడు- "అమ్మా, నాకు జ్వరం వచ్చింది. అంతకు ముందు నీకు జ్వరం వచ్చినప్పుడు 'స్వామికి టెంకాయ కొడతాను" అని మొక్కుకున్నాను కదా? ఆ మొక్కు నేను తీర్చుకోలేదు. అందుకని స్వామికి కోపం వచ్చింది- రేపు ఆదివారం నాడు నారాయణస్వామికి టెంకాయ కొడితే చాలు- నేను బాగైపోతాను" అని చెప్పాడు.

"సరే" అని అమ్మ , తమ్ముడు ఇద్దరూ భక్తిగా స్వామికి టెంకాయ కొట్టారు. అయినా పెద్దోడికి జ్వరం తగ్గలేదు- ఇంకా హెచ్చయిపోయింది! మరునాడు అందరూ పెద్దోడి హాస్టలుకు పరుగు పెట్టాల్సి వచ్చింది.

"మీ కొడుక్కు జ్వరం అని ఉత్తరం కూడా రాయించాను కదమ్మా? మరి ఎందుకు రాలేదు వెంటనే?" అని అడిగిన వార్డెను గారితో అమ్మ సంగతి అంతా చెప్పింది- "ఆదివారం నాడు స్వామికి టెంకాయ కూడా‌ కొట్టామమ్మా! అయినా జ్వరం తగ్గలేదు ఎందుకనో మరి?" అని.

వార్డెను గారు తల పట్టుకొని చెప్పారు- "అయ్యో! ఇది టెంకాయతో పోయే జ్వరం కాదమ్మా! ఇప్పుడు ఊళ్లో చాలా మందికి విషజ్వరాలు ఉన్నాయి.

ఇది కూడా అలాంటిదేనేమో- ఒకసారి పట్నంలో ఆసుపత్రికి తీసుకువెళ్ళి చూపించండి- నయం అవుతుంది. స్వామి, టెంకాయ అనే ఇంతవరకూ తెచ్చుకున్నారు. ఇంకా వాటిని నమ్ముకొని కూర్చోకండమ్మా" అని.

అమ్మ, చిన్నోడు వెంటనే పెద్దోడిని ఆసుపత్రికి తీసుకుపోయి చూపించారు. "ఇది డెంగు జ్వరం. చాలా ప్రమాదం. ఇంత ఆలస్యం చేసారెందుకు?" అని, ఆసుపత్రివాళ్ళు వాడిని అక్కడే ఉంచుకొని మందులు ఇచ్చారు. రక్తం, గ్లూకోజు ఎక్కించారు. తరువాత కొన్నిరోజులకు పెద్దోడి జ్వరం తగ్గి ఇంటికి వచ్చాడు.

"వార్డెనుగారి మాట విని మంచిపని చేశాం. లేకపోతే పెద్దోడు మనకు దక్కేవాడు కాదు. ఇకమీద ఎప్పుడైనా స్వామికి మొక్కుందాం గానీ, ఆ మొక్కునే నమ్ముకొని ఆస్పత్రికి పోకుండా మటుకు ఉండద్దు" అని నాన్న అమ్మ అనుకున్నారు మనసులో.