కట్టెలు కొట్టే రంగయ్య ఎప్పటిలాగే అడవికి వెళ్ళాడు. మధ్యాహ్నం వరకూ కట్టెలు కొట్టాడు. కొట్టిన కట్టెలన్నిటినీ పెద్దమోపుగా కట్టాడు. ఎంతో శ్రమపడి ఆ మోపును నెత్తికి ఎత్తుకున్నాడు. వాటి బరువుకి అతని వెన్నెముక వంగింది; శరీరం వణికింది. అయినా అతను వాటిని మోసుకుంటూ నడకసాగించాడు.

అది అతను ఎప్పుడూ వెళ్లే దారే. కానీ ఇప్పుడు మటుకు నడక చాలా కష్టంగా ఉంది. అడుగు ముందుకి పడటంలేదు. అట్లా అని కట్టెలు ఎప్పటికంటే మరీ ఏమంత బరువుగా లేవు. అకస్మాత్తుగా రంగయ్యకి తెలిసి వచ్చింది- కష్టం ఎందుకవుతున్నదో! తను ముసలి వాడవుతున్నాడు!! ఒకసారి ఆ ఆలోచన రాగానే రంగయ్య ఇక బరువును మోయలేక పోయాడు: తలమీద మోపును క్రింద పడేశాడు; తనూ నేల మీద కూలబడి, నెత్తిన చేతులు పెట్టుకొని తన భవిష్యత్తు గురించి ఆలోచించుకొని ఏడ్చాడు.

"అయ్యో! దేవుడా!! నాకీ కష్టం వద్దు. అసలు యీ జీవితమే వద్దు. ముగించెయ్యి. నన్ను తీసుకెళ్లిపో," అని బిగ్గరగా అరిచాడు.

సరిగ్గా అదే సమయానికి మృత్యుదేవత అతని మీదుగా వెళ్తున్నది- రంగయ్య కోరిక వినబడగానే ఆ తల్లి గబుక్కున అతని ముందు ప్రత్యక్షం అయ్యింది. "ఏమన్నావ్?! ఏమ-న్నావ్?! మళ్లీ అను, ఓ సారి?! నీ కోరికని తక్షణం నెరవేరుస్తాను, చెప్పు" అన్నది గట్టిగా.

రంగయ్య కొద్దిసేపు వినబడీ వినబడకుండా ఏదో గొణిగాడు.

ఆ తర్వాత చక్కగా వినబడేట్టు అన్నాడు - "తల్లీ, నాకో సాయం చెయ్యి. యీ కట్టెల మోపుందే, దాని కొంచెం ఎత్తి నా తల మీద పెట్టు, చాలు- ఆ తర్వాత నా తంటాలేవో నేను పడతాను!" అని.

రకరకాల బరువులు మోయటం అలవాటైన ప్రాణాలు మనవి! అలసట కొద్దీ కాస్త అటూ ఇటూ ఊగినా, చివరికి ఆ బరువుల్ని మోయటం వైపే మొగ్గుతాం!