ఈ విధంగా సింహాలు, పులులు అన్నీ తనకు దాసులై, తన మాటను కాదనక ప్రవర్తిస్తూండేసరికి, నక్కకు మెల్లగా గర్వం తలకెక్కింది. పొగరుమోతు తనం కొద్దీ అది తన జాతి వాళ్లను అవమానించటం, చిన్నచూపు చూడటం మొదలు పెట్టింది. రాను రాను అది తోటి నక్కల మొహాలను చూసేందుకు కూడా ఇష్టపడనట్లు తయారైంది. దాంతో ఆ నక్కలకు దు:ఖం ముంచుకొచ్చింది. మనసులు కష్ట పెట్టుకొని, అవి అన్నీ ఒకరోజున రహస్యంగా కలసి కూర్చొని తమ బాధల్ని కలబోసుకొన్నాయి.
అప్పుడు వాటిలో ఒక ముసలి నక్క అందరినీ ఉద్దేశించి "చూడండి, ఇదంతా మనం స్వయంగా చేసుకున్న అపరాధం తప్ప, వేరు కాదు. మన రాత ఇట్లా ఉంది కనుక, తెలివిమాలి మనమే అతనికి పాలనాధికారాన్ని కట్టబెట్టాము. ఆ పదవి తలకెక్కటం చేత అతనికి ఇప్పుడు కాకి-కోకిల రెండూ ఒకటిగానే కనబడుతున్నాయి. ఎంత మేలు చేసినాగాని, మనం అతనికి స్నేహితులం కాగలిగామా? పొగరుమోతులకు చేసిన మేలు వృధా అవ్వటమే కాదు; అలా మేలు చేసిన వాళ్లకు కూడా కష్టాలను తెచ్చిపెడుతుంది. తప్పుడు వాడి దగ్గర నిలచి ఉండటం మన తప్పే. ఇంతకాలం వీడి దగ్గర ఊడిగం చేసి వీడిచేత తినరాని తిట్లు తిని తిని- మన ఎముకలన్నిటికీ చిల్లులు పడ్డాయి. ఇప్పుడు పరిస్థితి విషమించింది. వీడిని ఇన్నాళ్ళూ ఏదో మట్టి కుండను మోసినట్లు తలపైకి ఎత్తుకొని మోశాము- ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ కుండను కటిక నేలమీద పడేసి పగల-గొట్టకపోతే మన ప్రాణాల మీదికే వస్తుంది.
ఈ నీచుడు రాజ్యమదంతో కళ్ళు మూసుకు-పోయి క్రింద-మీద తెలీకుండా ఉన్నాడు. తనవారు ఎవరో, పరాయి వాళ్లెవరో కూడా తెలీటం లేదు వీడికి. మనం అందరం వీడి అబద్ధాలను నిజమని నమ్మి మోసపోయాము. 'నక్క ఎక్కడ-నాగలోకం ఎక్కడ?' గుంటలో నివసించే నక్కకు దేవతలు స్వయంగా రాజ్యాధికారం ఇవ్వటమేమిటి- ఇదంతా ఒట్టి మాటే. ముందు దీనికి ఎలాగో ఒక నీలిరంగు అబ్బింది- అటుపైన దానిని వాడుకొని, మిగిలిన మాయోపాయాలన్నిటినీ ఇది తనంతట తాను పన్ని ఉంటుంది. అద్భుతమైన ఈ రంగు ఎలా వచ్చిందో తెలీక మనందరం ఈ విధంగా నిశ్చేష్టులం అయి-పోయి ఉన్నాం. దీని మాయ వేషాలను నిజం అనుకొని అందరిలోనూ నవ్వులపాలు అయిపోయాం. ఒక్క మనమే అనేది ఎందుకు? -గొప్ప గొప్ప సింహాలు, పులులు అన్నీ కూడా ఈ టక్కరి నక్క చేత ఘోరావమానానికి గురయ్యాయి. మనమే తెలివి గలవాళ్లం అనుకుంటే మన రాజులు ఇంకా తెలివైనవాళ్ళు!
ఇప్పుడు ఇక గతించిన దానిని త్రవ్వుకొని ఏం లాభం? మన తెలివితక్కువతనమే పరిస్థితిని ఇంతవరకూ తెచ్చింది. ఇప్పుడైనా మనం కళ్ళు తెరిచి ఏదో ఒకటి చేయకపోతే దాని చేష్ఠలు మరీ శృతి మించే ప్రమాదం ఉన్నది. ఇప్పుడు వాడు పట్టిందల్లా బంగారం అవుతున్నది కదా అని వాడిని వెనక వేసుకురావటం తగదు. కాలం కలిసి వచ్చినప్పుడు ఎంత దుర్మార్గులకైనా సంపదలు సమకూరతాయి; కాలం సహకరించకపోతే ఎంత మంచి వాళ్లకైనా దుర్గతి ఎదురవు-తుంటుంది. అయినా మంచిమార్గంలో ఉన్నవాళ్ళే ఆపదలను అన్నిటినీ తట్టుకొని నిలబడతారు; అంతిమంగా విజయం వాళ్ళనే వరిస్తుంది.
వీడికి కాలం మూడింది గనకనే వీడు అందరితోటీ దురుసుగా ప్రవర్తించటం మొదలుపెట్టాడు. 'చెట్టు చెడే కాలంలో కుక్కమూతి పిందెలు వస్తాయట!' చెడేకాలం దగ్గర పడటం వల్లనే వీడికి ఇలాంటి దుర్బుద్ధి పుట్టినట్లున్నది. 'వినాశకాలే విపరీత బుద్ధి' అని పెద్దలు ఊరికే అనలేదు. పట్టు పురుగులాగా, ఈ గుంటనక్కకూడా తనను కట్టేసే త్రాళ్లను తానే వెంట తెచ్చుకున్నది- గమనించండి. మరి సింహాలు, అడవి పందులు కూడా దీనికి దాసులై దీనిని కొలుస్తున్నాయని మనం భయపడనవసరం లేదు. విషయాలు తెలిసినవాళ్లను అవమానించినప్పుడు దాని ఫలితం ఎంతవారికైనా అనుభవంలోకి రావలసినదే. మనం అజ్ఞానులం కాదు- విషయం మొత్తం తెలిసినవాళ్లం. అందువల్ల ఈ శత్రువును పరాభవించటం మన చేతిలోని పని. నేను ఒక ఉపాయం చెబుతాను, వినండి- ఈ రోజున మనందరం వీడికి ఎదురుగా నిలబడి ఒక్క పెట్టున ఊళలు పెడదాం. వీడు జాతి స్వభావం కొద్దీ మనతోబాటు తానూ కూయటం మొదలు పెడతాడు. అక్కడ చేరిన పులులు, సింహాలలో ఏదో ఒకదానికి దాని ఆ అరుపును విని కోపం రాకపోదు; అది అమాంతంగా దాని మీదికి దూకి ఆ గుంటనక్కను చంపక వదలనూ వదలదు. భగవంతుని సంకల్పం అనుకూలిస్తే శత్రు సంహారం అతి సులువుగా జరిగిపోతుంది. అపాయం ఏమాత్రం లేని ఉపాయం ఇంతకంటే మంచిది వేరే లేదు- ఏమంటారు, చెప్పండి?" అన్నది.
అమృత సమానాలైన ఆ మాటలు చెవిన పడగానే మిగిలిన నక్కలన్నీ పరిపూర్ణమైన ఆనందంతో గంతులు వేసాయి. అవన్నీ అప్పటికప్పుడు బయలుదేరి, సాయం సమయం అయి చంద్రుడు ఉదయించే సరికల్లా నీలి నక్క దర్బారు చేరుకున్నాయి. అటుపైన అన్నీ దానికి ఎదురుగా నిలబడి, 'ఆ రాజ్యం ఇక అంతరించిందేమో 'అన్నట్లు ఒక్కసారిగా "ఓ....." అని ఊళలు వేశాయి.
పుట్టుకతో వచ్చిన అలవాట్లు అంత సులువుగా పోవు కదా! నక్కరాజుకు ఆ కూత వినబడగానే, అది జాతి ధర్మ ప్రేరేపితం అయిపోయింది. విధి రాత తప్పించుకో-లేనట్లు, చెవులు పిక్కటిల్లేటట్లు రేగిన ఆ కూతతో తనూ గొంతు కలిపింది!
ఆ రొద చెవిన పడగానే, దాని ప్రక్కనే నిలబడి ఉన్న పెద్దపులి ఒకటి అకస్మాత్తుగా 'అది నక్క కదా' అనుకొని, తన ధర్మం ప్రకారం తను ఒక్కసారిగా లేచింది. పళ్ళు నూరి, మెరుపు మెరసినట్లు చెంగున దాని మీదికి దూకి చటుక్కున దాని గొంతు కొరికి చంపేసింది. నెత్తులు వరదలైపారింది. మిగిలిన జంతువులన్నీ ఒక్కసారిగా లేచి, నీలి నక్క దుర్గతిని గురించి మాట్లాడుకుంటూ తమ దారిన తాము పోయాయి. అంతకు మునుపు ఆందోళనతో అటూ ఇటూ పరుగులెత్తిన తోటి నక్కల మనస్సులన్నీ ఒక్కసారిగా చల్లబడ్డాయి!
కాబట్టి, పరాయివాళ్లతో చేరి తనవారిని చిన్నచూపు చూడటం ఏమాత్రం మంచిది కాదు. ఈ కాకిని చేరదీయటం, ఎందుకనో, నాకు ఇష్టం కావటం లేదు. నేను చెప్పవలసినది చెప్పాను. ఇక తమరు ఎలాగంటే అలా చేద్దాము" అన్నది మంత్రి సర్వజ్ఞుడు.
దాని మాటలు విని హంసరాజు -"మనం ఇంకొద్ది రోజుల్లో దారుణమైన యుద్ధాన్ని ఒకదాన్ని ఎదుర్కొనాల్సి ఉన్నది. ఆలోగా చాలామంది వీరులను సమీకరించుకోవలసి ఉన్నది. వెతకబోయే తీగ కాలికి చుట్టుకున్నట్లు, ఈ వీరుడు మనం ఇంకా కోరకనే వచ్చి మన వాకిటికి ఎదురుగా నిలబడి ఉన్నాడు. సంపద వస్తానంటే కాదని మోకాలు అడ్డం పెట్టేది ఎందుకు? మన పాలిటి పుణ్యమే ఈనాడు ఇతని రూపంలో వచ్చి నిలచింది మన ముందు. కష్టాలు మన ప్రమేయం లేకుండా ఎలా వచ్చి పడతాయో, అలాగే సుఖాలు కూడా, మన ప్రమేయం లేకుండా వాటంతట అవే వస్తాయి.
అడగకుండా వచ్చి పడే మేలును కాదనకూడదు. మనం నీటి పక్షులం; ఇతను నేలమీద నివసించే పక్షి- అన్నావు- విను- వజ్రాన్ని అరగదీయాలంటే వజ్రమే కావాలి. నేలపక్షి అయిన చిత్రవర్ణుడిని గెలవటం అనేది మనకు ఈ నేలపక్షి నీలవర్ణుడి సాయం లేకుండా సాధ్యం కాదు. పిరికితనం కొద్దీ మనం ఇప్పుడు ఇతన్ని దూరం చేసుకున్నామనుకో, అతను అలిగి ఆ నెమలి చెంత చేరవచ్చు- అటుపైన మనకు శత్రువును గెలవటం మరింత కష్టం అవుతుంది; పని నెరవేరదు. చెయ్యి దాటిపోయాక 'అయ్యో' అని మొత్తుకోవటం ఆరిపోయిన దీపంలో నూనె పోసినట్లు వృధాయే అవుతుంది- కోరిన కోరిక నెరవేరకపోవటమేకాదు; మనసుకు దు:ఖం మిగులుతుంది.
అందువల్ల, అన్ని విధాలుగానూ మనకు ఈ కాకి స్నేహపాత్రుడే. లేనిపోని అనుమానాలను ఇక కట్టిపెట్టండి- నేను చెప్పినట్లు చేయండి" అన్నది నిశ్చయంగా.
మంత్రి కూడా కొంచెం సంకోచిస్తూ, 'ఇంకా ఎక్కువ మాట్లాడితే ఏమవుతుందో' అని భయపడి, "అన్ని విషయాలూ తెలిసినవారు తమరు. తమకు తెలియని ధర్మాధర్మాలు లేవు. పనుల తీరుతెన్నులు తమరిని మించి తెలిసినవారు లేరు. తమరికి ఎలా తోస్తే అలాగే చేద్దాము. నా ఎరుక ఉన్నంత వరకూ నేను చెప్పాను. యుద్ధ సన్నాహాలు ఎలాగూ మొదలయ్యాయి. కోటకూడా సిద్ధం అయి ఉన్నది. కాబట్టి ఇక ఆలసించక, దూతను రమ్మని, అతను ఎందుకు వచ్చాడో కనుక్కొని పంపించాలి" అన్నది.
(తర్వాత ఏమైందో మళ్ళీ చూద్దాం...)