ఒక ఊరిలో ఒక కోడి ఉండేది. ఆకోడి ఎవరిదీ కాదు. ఒక రోజు కోడిగుడ్లు పొదగడానికి అది ఒక అడవిలోకి వెళ్ళింది. అప్పుడు వర్షం పడుతున్నది. కోడి "అయ్యో, వాన పడుతోందే, ఏం చేసేది?" అని బాధపడుతూ కూర్చుంది.

అంతలో ఒక బండి మీద ఇటికల లోడు పోతుంటే చూసింది కోడి. "ఇటికలోడా-ఇటికలోడా, నీకు పుణ్యముంటుంది- నాకు ఒక లోడు ఇస్తావా ? నా గుడ్లు నాని-పోతున్నాయి. నేను ఇల్లు కట్టుకోవాలి" అని అడిగింది వాడిని. "అయ్యో అంతకేనా, ఏం పర్లేదు తీసుకో" అని ఇటికలోడు ఒక లోడు ఇటికలు వేసి వెళ్లిపోయాడు. ఆ ఇటికలతో కోడి ఇంటి గోడలు లేపింది.

కానీ వానకు గోడలన్నీ నాని పోతున్నాయి. "ఇంకా రెండు లోడులు ఐతే సరిపోతుంది" అని మనసులో అనుకుంది కోడి. అంతలోనే అటు వైపుగా ఒక చెరుకులోడు పోతూ ఉంటే కోడి చూసి, "చెరుకులోడా-చెరుకులోడా, నీకు పుణ్యముంటుంది- ఒక లోడు చెరుకులు ఇస్తావా ? నాగుడ్లు నానిపోతున్నాయి. నేను ఇల్లు కట్టుకోవాలి" అంది. "సర్లే తీసుకో" అని ఒక లోడు చెరుకులు వేసేసి వెళ్ళిపోయాడు చెరుకులాయప్ప. ఆ చెరుకులతో కోడి ఇల్లు సరి చేసుకుంది- కానీ వానకి చెరుకులిల్లు ఇంకా కొద్దిగా నానిపోతోంది.

"ఎలాగబ్బా?" అని ఆలోచిస్తూ కూర్చున్న కోడికి, అంతలోనే ఒక మల్లెపూలోడు కనిపించాడు.

"మల్లెపూలోడా-మల్లెపూలోడా, నీకు పుణ్యం ఉంటుంది- నాకు ఒక లోడు మల్లెపూలు వేస్తావా? నా గుడ్లు నానిపోతున్నాయి; నా ఇల్లు నానిపోతోంది" అంది కోడి. 'సరే'నని మల్లెపూలోడు ఒక లోడు మల్లెపూలు వేసి వెళ్ళాడు. అప్పుడు కోడి ఆ మల్లెపూలతో ఇంటిని చాలా బాగా కట్టింది.

ఇల్లు కట్టాక, కోడి ఆ ఇంట్లో ఇష్టంగా కూర్చొని మూడు గుడ్లను పొదిగింది. పుట్టిన వాటికి ముచ్చటగా మూడు ఆడపిల్లల పేర్లు పెట్టింది. మొదటి ఆమెపేరు ఇటికల ఈరమ్మ, రెండో ఆమె పేరు చెరుకుల చామంతి, మూడో ఆమె పేరు మల్లెల మహరాణి.

ముగ్గురు పిల్లలూ పెద్దయి పెళ్ళి వయస్సుకు వచ్చారు. అప్పుడు ఒకసారి ముగ్గురు రాజకుమారులు ఆ అడవిలోకి వచ్చారు. వాళ్లకు దాహమై నీళ్ళ కోసం అడవిలో అంతా వెతుకుతున్నారు. ఎక్కడా చిక్కలేదు. ఆ సమయంలో‌ వాళ్ళు ముగ్గురూ సరస్సులో స్నానం చేయటానికి వచ్చిన ముగ్గురు అమ్మాయిలనీ చూశారు.

అప్పుడు రాజకుమారులు ముగ్గురూ 'మమ్మల్ని పెళ్ళిచేసుకొంటారా' అని వీళ్ళు ముగ్గురినీ అడిగారు. ఇటుకల ఈరమ్మ, చెరుకుల చామంతి 'మేము చేసుకొంటాము-మేము చేసుకుంటాము' అన్నారు ఉత్సాహంగా. మల్లెల మహరాణికి కూడా ఇష్టమే అయ్యింది గానీ, "నేను మా అమ్మని అడిగి చెబుతాను" అంది. కానీ ఎంత సేపు చూసినా కోడి రానే లేదు. అప్పుడు పెద్ద రాజకుమారులు ఇద్దరూ ఈరమ్మను, చామంతిని తీసుకొని వెళ్ళిపోయారు. చిన్నరాజు, మల్లెల మహరాణి మాత్రం అక్కడే ఆగారు. మూడు రోజులైనా ఇంకా కోడి రానేలేదు- దాంతో చిన్నరాజు "మళ్ళీ వద్దాంలే" అని మల్లెల మహరాణిని ఒప్పించి తీసుకెళ్ళాడు.

వీళ్లందరూ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ పెద్దమ్మ వాళ్లందరికీ పెద్ద పూసలదండలు వేసింది. ఇప్పుడు మల్లెల మహరాణి తన దండను తుంచి ఒకొక్క పూసనే దారంట వేసుకుంటా వచ్చింది- 'ఎప్పటికైనా మాయమ్మ వచ్చి వీటిని గుర్తు పట్టకుండా ఉంటుందా ' అని.

ఇంకో వారం అయినాక తిరిగి వచ్చింది కోడి. వచ్చి చూసే సరికి ఏముంది? -ముగ్గురు పిల్లలూ లేరు! కోడి ఇల్లంతా వెతికింది. ఎక్కడా కనబడలేదు. అయితే మల్లెల మహరాణి వేసిన పూసల జాడ పట్టుకొని, వాటిని ఏరుకుంటూ అది వీళ్ళు ఉంటున్న నగరానికి చేరుకున్నది.

అక్కడికి వెళ్ళాక అది ముందు తన పెద్ద బిడ్డ కదా అని ఇటుకల ఈరమ్మ దగ్గరికి వెళ్లింది. ఇటుకల ఈరమ్మ దూరం నుండే చూసి- "అయ్యో!‌ ఇది ఇక్కడికి వచ్చేస్తున్నది! 'మా అమ్మ ఒక కోడి' అని తెలిస్తే నన్ను రాజు తరిమేయకుండా ఉంచుకుంటాడా?” అని కోడి ఇంకా‌ లోపలికి రాకనే దాని నడుము విరగ కొట్టింది.

అక్కడినుండి కోడి నీళ్ళలో పడి ఈదుకొంటూ చెరుకుల చామంతి దగ్గరకు వెళ్లింది. చెరుకుల చామంతి కూడా దాన్ని దూరం నుండే చూసింది- "అయ్యో! ఇక్కడికే వచ్చేస్తున్నదే! 'మా అమ్మ ఒక కోడి' అని తెలిస్తే రాజు నన్నిక్కడ ఉండనివ్వడు- తరిమేస్తాడు" అని కోడి ఇంకా లోపలికి రాకనే దాని కాళ్ళు రెండూ విరగగొట్టింది.

ఇంక అప్పుడు కోడి కుంటుకుంటూ కుంటుకుంటూ మల్లెల మహరాణి దగ్గరికి వెళ్ళిందిగాని, ఇంకా ఆ మెట్లు ఎక్కకనే క్రింద పడి చనిపోయింది. అంతలో బయటికి వచ్చి చూసిన మల్లెల మహరాణి దాన్ని చూసి ఏడుస్తూ "అయ్యో! నీకెంత కష్టం వచ్చింది" అని దాన్ని ఒక పెట్టెలో వేసి, పైన వ్రేల కట్టింది.

ఆరోజు మధ్యాహ్నం భోజనానికి వచ్చాడు మల్లెల మహారాణి వాళ్ళ భర్త. కానీ దు:ఖంలో ఉన్న మల్లెల మహరాణి భర్తకు తల్లి గురించి ఏమీ చెప్పలేదు. ఆయన నీళ్ళు తాగుతూ పైకి చూశాడు. "ఆ పెట్టె ఏంటి" అని ఆయన మల్లెల మహరాణిని అడిగాడు. ఆమె ఏడుస్తూనే "అవి నేను చిన్నప్పుడు ఆడుకున్న బుడిగీలు" అని చెప్పింది. "ఆ పెట్టెను దించి చూపియ్యి" అన్నాడు రాజు. ఆమె మనసులో "దేవుడా! ఈ పెట్టెలో ఉన్నవి అన్నీ బొమ్మలు అయిపోవాలి" అని కోరుకొంటూ పెట్టెను దించి భర్తకు చూపించింది. చూడగా ఆ పెట్టెలో అన్నీ బుడిగీలు, బొమ్మలూ ఉన్నాయి!

అప్పుడు ఆ రాజు అన్నాడు- "చూశావా, ఈ బొమ్మలే ఇంత బాగుంటే, ఇంక మీ ఇల్లు ఎంత బాగుంటుందో, మీ అమ్మ ఎంత మంచిదో! పద, వెళ్ళి మీ ఇల్లు చూసి వద్దాం. మీ అమ్మను పలకరించి వద్దాం" అని.

"ఏం వద్దు ఏంవద్దు" అని మల్లెల మహారాణి అన్నాకూడా ఆయన వినలేదు. సరేనని ఇద్దరూ కలసి మళ్లీ అడవిలోకి వెళ్తుండగా చీకటి పడింది.

ఇద్దరూ అక్కడే ఒక మర్రిచెట్టు కింద పడుకొన్నారు- ప్రొద్దున్నే వెళ్దామని. ఆ ప్రక్కనే ఒక పెద్ద పాము పుట్ట ఉంది. భర్త బాగా నిద్రపోగానే ఆ రాత్రి మల్లెల మహారాణి లేచి, పుట్టలో చెయ్యిపెట్టింది.

"నన్ను కరిచెయ్యి పామూ! మా అమ్మ లేదు; మా భర్తకి నిజం తెలిస్తే ఉండలేడు" అంటూ. ఆ పుట్టలో ఉండే నాగుపాముకు కొంతకాలంగా ఆరోగ్యం సరిగ్గా లేదు. తల పైన గడ్డలు లేచి చాలా బాధపడుతూ ఉన్నది. మల్లెల మహారాణి చెయ్యి తాకగానే ఆ గడ్డలన్నీ పగిలి పోయాయి. నొప్పి కాస్తా తగ్గిపోయింది.

అప్పుడు పాము పైకి వచ్చి "ఎందుకో బాధ పడుతున్నట్లున్నావు- ఏమిటి, నీ బాధ?" అని అడిగింది. మల్లెల మహారాణి ఆ పాముకు జరిగినది అంతా చెప్పింది. "ఎవ్వరూ తొక్కని ఇసుక మూడు పిడికెలు తీసుకురా" అన్నది పాము. సరేనని, మల్లెల మహరాణి పోయి దగ్గర్లో ఉన్న నదిలోంచి మూడు పిడికెళ్ళ ఇసుక తెచ్చింది.

పాము అన్నది- "వెళ్ళిన వెంటనే ఒక పిడికెడు ఇసుకను మీ ఇంటి మీద చల్లు. అప్పుడు అది ఒక పెద్ద భవనం మాదిరి అవుతుంది. మళ్ళీ రెండో పిడికెడు చల్లు. మీ అమ్మ తిరిగి వస్తుంది. ఇక మీరు తిరిగి వచ్చేటప్పుడు ఆ భవనం మీద మూడవ పిడికెడు ఇసుక చల్లు- ఆ భవనం ఇంతకు ముందు ఎలా ఉంటే అట్లా మారుతుంది" అని. సరే అని మల్లెల-మహారాణి మూడు పిడికెళ్ళ ఇసుకనూ తీసుకున్నది.

తెల్లవారి భర్తతో కలసి తల్లిగారి ఇంటికి వెళ్లినప్పుడు, మల్లెల మహారాణి ముందుగా వెళ్ళి పిడికెడు ఇసుకను ఇంటిమీద చల్లింది. వెంటనే ఆ ఇల్లు పెద్ద భవనంలా మారిపోయింది. రెండవ పిడికెడు చల్లగానే వాళ్ళ అమ్మ తిరిగి వచ్చింది. మల్లెల మహారాణి, ఆమె భర్త అక్కడ సంతోషంగా ఒక వారం రోజులు గడిపారు. తిరిగి వెళ్ళేటప్పుడు మల్లెల మహారాణి వెనక్కి వచ్చి మూడవ పిడికెడు ఇసుకను ఇంటిమీద చల్లింది. ఇల్లుకాస్తా మునుపటిలాగా మారిపోయింది.

ఇది తెలిసిన ఇటుకల ఈరమ్మ, చెరుకుల చామంతి కూడా వాళ్ళ భర్తలను పిల్చుకు పోయి, ఆ మర్రిచెట్టు క్రిందనే పడుకున్నారు. రాత్రయ్యాక వాళ్ళిద్దరూ పుట్టలో చెయ్యి పెట్టి "మమ్మల్ని కరిచెయ్యి పామూ!" అనగానే, పాము వాళ్ళిద్దరినీ కరిచేసింది!