ఒకసారి ఒక తల్లి కోడి గింజలు ఏరుకుంటూ ఉంది. దాని పిల్లలు దాని వెంటే తిరుగుతున్నై , అది ఏ పని చేస్తే ఇవి కూడా అదే పని చేస్తున్నై.

తల్లి కోడి కాళ్లతో నేలను గీరి, పిల్లలకు చూపించింది. అవి కూడా తమ సన్న సన్న కాళ్లతో నేలను గీరి, తల్లి గీరిన చోటికి పరుగెత్తి మూగి చూశాయి. తల్లి గీరిన చోట వాటన్నిటికీ తలా ఒక చిట్టి పురుగు దొకింది.

పిల్లల్లో తెలివైన దొకటి ఉంది. అది అడిగింది - "అమ్మా, మనం యీ పురుగుల్ని దాచుకుంటే నేమి? అవి పిల్లల్ని పెడతాయి కదా, ఎక్కువౌతాయి! అప్పుడు మనం వాటిని తింటూ ఉండచ్చు ఎంచక్కా!" అని.

తల్లి నవ్వింది, "పోయిన జన్మలో నువ్వు మనిషివి అయి ఉంటావు. ఊరుకో! మనం ఎక్కడన్నా అట్లా పెంచుకొని తినేసే రకాల లాగా కనిపిస్తున్నామా?" అంది.

చిట్టిపిల్ల ముక్కు ముడుచుకున్నది. అటూ - ఇటూ చూసింది. అక్కడే దగ్గర్లో దానికి ఒక అట్టపెట్టె కనబడింది. అది పోయి అట్టపెట్టెని జాగ్రత్తగా చూసింది. ఆ పెట్టెను తెరవచ్చు; మూయచ్చు!

చిట్టికోడిపిల్లకు చాలా సంతోషం వేసింది. ఆ సరికి తల్లికోడి ఓ పేడకుప్ప నీడకు చేరుకొని నేలను గీరుతోంది, "ఇక్కడ చాలా పురుగులున్నైయ్యో.....చ్" అని అరిచింది గట్టిగా.

కోడిపిల్లలన్నిటితో బాటు మన చిట్టికోడి కూడా, గబగబా అక్కడికి పరుగుపెట్టింది. అట్టపెట్టెను ప్రక్కిన పడేసి తనూ మూగి చూసింది. అక్కడ నిజంగానే చాలా‌ పురుగులున్నై.

చిట్టికోడి పిల్ల గబగబా కొన్ని పురుగుల్ని పట్టుకొని అట్టపెట్టెలోకి తీసుకున్నది. ఆ రోజంతా దానికి అదే పని! తినటం మానేసి పురుగుల్ని సేకరిస్తూ గడిపిందది. తల్లి కోడి దాని చేష్ఠల్ని చూసి నవ్వుకున్నది మురిపెంగా - "నిజంగానే ఇదొక తిక్కపిల్ల .." అనుకున్నది.

ఆ రోజునించీ చిట్టికోడి పురుగుల గురించే చాలా ఆలోచించటం మొదలు పెట్టింది. "పురుగులు ఏం తింటాయి? ఎట్లా ఉంటాయి? ఏం చేస్తాయి? ఎక్కడ పడుకుంటాయి?" -శ్రద్ధగా అట్టపెట్టెనంతా పురుగులకు అనుకూలంగా చేసిందది.

కొన్ని రోజులకి నిజంగానే, పురుగులు గుడ్లుపెట్టాయి! వాటిలోంచి చిట్టి చిట్టి పురుగులు బయటి కొచ్చి, అట్టపెట్టె లో పారాడాయి.

వాటిని చూసి చిట్టికోడిపిల్ల ఎంత సంతోషపడ్డదో! అది వాటిని కదిల్చింది, వాటిపైన అన్నం మెతుకులూ, గింజలూ వేసింది. వాటితో మాట్లాడింది. వాటితో ఆడుకున్నది.

చూస్తుండగానే ఆ పురుగులన్నీ పెద్దవైనాయి.

తల్లికోడి అన్నది పిల్లకోడితో - "ఊఁ.. ఇప్పుడు తినచ్చు వీటిని! నిజంగా బలేపని చేశావు - అచ్చం మనిషిలాగానే!" అన్నది.

తల్లి అట్లా అనగానే, అంత వరకూ హుషారుగా‌ ఆడుకుంటున్న చిన్నకోడి ఒక్కసారిగా చిన్నబోయింది. "చిట్టి చిట్టి యీ పురుగుల్ని తను తినెయ్యాలా?! ఎంత మోసం!" అనిపించింది దానికి. తర్వాతి రోజంతా అది పురుగుల్నే చూస్తూ గడిపింది. రాత్రంతా నీరసంగా ఒక్కతే పడుకొని ఏడ్చింది.

తెల్లారి తల్లికోడి లేచి చూస్తే అట్టపెట్టె అంతా ఖాళీ - చిట్టికోడిపిల్ల పురుగులన్నిటినీ తీసుకెళ్లి ఎక్కడో వదిలేసి వచ్చింది!

తల్లికోడి చిట్టిపిల్లను దగ్గరకు తీసుకొని అన్నది - "నేను ముందే చెప్పలేదూ- మనం మనుషులం కాము తల్లీ; అట్లా పెంచుకొని పెంచుకొని చివరికి తినెయ్యటానికి! మనం కోళ్లం! నిజంగానే నువ్వు మన పేరు నిలబెట్టావు!" అని మెచ్చుకున్నది.

చిట్టికోడికి మటుకు ఏమీ అర్థం‌ కాలేదు- అట్టపెట్టెలో హడావిడిగా అటూ ఇటూ తిరిగి అల్లరి చేస్తున్న చిట్టిపురుగులే తిరుగు-తున్నాయి దాని ఆలోచనలనిండా.