కమల, విమల అక్కచెల్లెళ్ళు.

ఒకరోజున అమ్మ వాళ్ళిద్దరినీ పిలిచి, వాళ్ళు రాసిన నోటు పుస్తకాలను చూపించమన్నది. "అయ్యో! మీ చేతి రాత కొంచెం గందరగోళంగానే ఉందే! చూచి రాత రాయండి, ఓ ఇరవై ఐదు వాక్యాలు. దస్తూరీ బాగవుతుంది" అన్నది.

వాళ్ళిద్దరూ రాసి చూపించారు. అమ్మ వాళ్లను మెచ్చుకుని, “రోజూ ఇట్లాగే శ్రద్ధగా రాశారంటే, ఒక్క నెల రోజుల్లో మీ చేతివ్రాత చాలా అందంగా తయారవుతుంది. రాస్తారుగా?!" అని అడిగింది.

"ఓ! తప్పకుండా రాస్తాం అమ్మా!" అన్నారు కమలా, విమలా.

"అయితే ప్రతిరోజూ ఇంటికి రాగానే మీరిద్దరూ హోంవర్క్ పూర్తి చేసుకుని, చూచివ్రాత వ్రాసి, రాత్రి అన్నం తినే ముందుగా నాకు చూపించాలి. ఇట్లా ఒక నెల రోజులు చేయాలి- సరేనా?" అన్నది అమ్మ. ఇద్దరూ తల ఊపారు.

అటుపైన ఇద్దరూ ప్రతిరోజూ వాళ్ళ అమ్మ చెప్పినట్లుగానే ఇరవై అయిదు వాక్యాలు రాసి, ఆమెకు చూపించేవాళ్ళు. మొదట్లో ఒక నాలుగు రోజులపాటు ఆమె వాటిని శ్రద్ధగా చూసింది; తప్పులుంటే సరి చేసింది; బాగా రాస్తే మెచ్చుకున్నది- తర్వాత, అయిదో రోజున కమల, విమల పుస్తకాలు తీసుకుని వెళ్ళేసరికి ఆవిడ ఏదో చదువుకుంటూ ఉంది: "ఓహో, తెచ్చారా! సరే- అక్కడ పెట్టండి- తర్వాత చూస్తాను" అన్నది. వాళ్ళిద్దరూ పుస్తకాలని అమ్మ దగ్గర- బల్ల మీద పెట్టి, వచ్చేశారు.

అయితే మరునాడు వాళ్ళు బడినుంచి వచ్చేంతవరకూ ఆవిడ ఆ పుస్తకాలని అసలు చూడనేలేదు.

పుస్తకాలు తీసుకుని, ఆరోజు కూడా ఇరవై అయిదు వాక్యాలు రాశారు వాళ్ళు. ఆ తర్వాత ఎప్పటి లాగానే వాళ్ళు పుస్తకాలు తీసుకువెళ్ళి అమ్మకి చూపిస్తే, ఆమె ఏదో వ్రాసుకుంటూ- "అక్కడ పెట్టి వెళ్ళండి" అని చెప్పింది.

ఇట్లా మరో నాలుగు రోజులు గడిచాయి ఆరోజున ఇద్దరూ కూర్చుని రాయడం మొదలు పెట్టారు: కమల అందంగా, శ్రద్ధగా రాస్తూంటే, విమల మటుకు హడావుడిగా రాసేసి, 'టి.వి' చూసేందుకు వెళ్ళిపోయింది. 'అదేమిటి?' అని కమల అడిగితే- "అమ్మ చూడటమే లేదు కదా!" అంది విమల.

"ఒకవేళ చూస్తే?" అంది కమల.

"చూడదు. ఒకవేళ చూస్తే, 'ఇవాళ వేలు బాగాలేదు' అని చెప్తాను- 'రేపట్నుంచీ బాగా రాస్తాను' అని చెప్తాను" అంది విమల.

విమల చెప్పిందే నిజమయింది. వాళ్ళ అమ్మ ఆరోజు కూడా పుస్తకాలు చూడనేలేదు.

అయినా కమల మాత్రం శ్రద్ధగా రాస్తూనే ఉంది రోజూ. విమల మాత్రం ప్రతిరోజూ ఎలాగో ఒకలా పేజీ నింపేసి, పుస్తకాన్ని ప్రక్కన పడేసి వెళ్ళి పోతోంది. పదిహేను రోజుల తర్వాత ఒకరోజున… అమ్మ వాళ్ళిద్దరినీ పిలిచి, ఆరోజు రాసిన వాక్యాలు చూపించమంది. కమల-విమల ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు.

రెండు పుస్తకాలనూ ప్రక్క ప్రక్కన పెట్టి, "మొదటి రోజు రాసిన వాక్యాలనీ, చివరి రోజు రాసిన వాక్యాలనీ పరీక్షగా చూడండి" చెప్పింది అమ్మ ఇద్దరికీ.

పుస్తకాల మొదటి పేజీని, చివరి పేజీని చూసిన కమల, విమల ఇద్దరూ ఆశ్చర్యపోయారు: కమల మొహం ఆనందంతో వెలిగిపోతే, విమల మొహం వాడిపోయింది.

కమల పుస్తకంలోని వాక్యాలు మొదటిరోజున రాసిన వాటికన్నా ఎంతో అందంగా- చక్కని ముత్యాల్లాగా ఉన్నాయి.

ఇక విమల పుస్తకంలోని వ్రాత మొదటిరోజుకంటే అందంగా లేదు సరికదా, అసహ్యంగా- అసలు చదవడానికే అర్ధం కాకుండా ఉంది.

'ఎవరూ చూడనప్పుడు, ఎలా రాస్తే మటుకు ఏముంది?" అన్న విమల నిర్లక్ష్యమే అందుకు కారణం.

అమ్మ ఏమైనా అనటానికి ముందే తను చేసిన తప్పు అర్ధమయింది విమలకు.

“రోజూ ఇరవై అయిదు వాక్యాలు రాయాలని నేను మీకు చెప్పిందీ, మీరు ఒప్పుకున్నదీ ఎందుకోసం? మీ చేతివ్రాత బాగవడం కోసం. నేను ప్రతిరోజూ 'చూడటం-చూడకపోవడం' తో దానికి సంబంధం ఉండనక్కర్లేదు. ఒకరు పరీక్షించినా-పరీక్షించకపోయినా, మనం చేయవలసిన పనిని- మనం చేస్తామని ఒప్పుకున్న పనిని- శ్రద్ధగా చేస్తూనే పోవాలి. తెలిసిందా?!" ఆడిగింది అమ్మ.

"తెలిసిందమ్మా, అలా చేయకపోతే నష్టం మనకేనని కూడా అర్ధమయింది" అంది విమల.

“పరీక్ష చేయనట్టు కనిపించినా అమ్మ పరీక్ష చేస్తూనే ఉంటుందనీ, 'అసలు అదే ఒక పరీక్ష' అని కూడా అర్ధమయింది” అంది కమల.

వాళ్ళ అమ్మ నవ్వి "ఇద్దరూ గుర్తుపెట్టుకోండి ఈ రెండు పాఠాలనీ" అంటూ చెరొక పెన్నూ బహుమతిగా యిచ్చింది.