మార్కులు, మార్కులు, మార్కులు- ఏంటి, ఈ మార్కులు? వీటితోనే ఎంతోమంది జీవితాలు నాశనం ఐపోతున్నాయి. పరీక్షలలో మార్కులు రాకపోతే తల్లిదండ్రుల తిట్లు తినటం; టీచర్ల ఒత్తిడిని తట్టుకోలేక, ఆరోగ్యాలు పాడుచేసుకోవటం- ఇదేనా, మార్కులు అంటే?
మన జీవితాలో మార్కులు చాలా చిన్నవి. వాటికే అతిగా ప్రాధాన్యత నిచ్చి కష్టాలలో కూరుకుపోతున్నాం, మనం. ఈ మార్కుల పరుగుపందెంలోనే ఓడిపోయి చాలా మంది వాళ్ల బంగారు జీవితాన్ని కోల్పోతున్నారు.
నేను మార్కుల గురించి మీకు చెప్పేది ఒక్కటే: విషయాలను బట్టీ పట్టి, అతి తెలివిని వాడి- కేవలం ఏవో ఎంపిక చేసిన వాటిని మాత్రం చదివి- సంపాదించుకొనేవి మార్కులు.
నిజంగా ఏమీ నేర్చుకోకనే వస్తాయవి. వాటి వల్ల ఏమీ ప్రయోజనం లేదు.
అంతే కాదు- మనం చదివేదాన్ని బాగా అర్థం చేసుకుంటూ చదివితే, మనకు నిజమైన లాభం చేకూరుతుంది. దానితోబాటు మార్కులు వస్తే వస్తాయి కూడా.
కానీ మార్కులు రాకపోతే జీవితంలోనే ఫెయిలు అయినట్లు తిడతారు టీచర్లు, తల్లిదండ్రులు. ఇందుకు ఉదాహరణగా ప్రదీప్ గురించి చెబుతాను మీకు-
ప్రదీప్ ఒక తెలివైన కుర్రవాడు. చాలా బాగా చదువుతాడు. కానీ ఏం ప్రయోజనం? ఆ మార్కులన్నీ బట్టీ పట్టి తెచ్చుకున్నవే. మంచి మార్కులు వస్తున్నాయి; కానీ వాడు దేన్నీ నిజంగా అర్థం అయితే చేసుకోవడం లేదు. ఎంత గొప్ప ర్యాంకర్ అయినా సరే, అర్థం చేసుకోకపోతే చివరకు ఎందుకూ పనికిరాడు. అలాగే ప్రదీప్ కూడా పెరిగి పెద్దవాడైపోయాడు; ఉద్యోగం కోసం వెతకడం మొదలు పెట్టాడు. ఒక కంపెనీ ఇంటర్వ్యూకి ఛాన్స్ ఇచ్చింది.
ప్రదీప్‌కి వచ్చిన మార్కులు వాళ్లకు నచ్చాయి- కానీ ఏం లాభం? వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయాడు ప్రదీప్.
ఎందుకంటే - మనం దేన్నయినా బట్టీ కొట్టామనుకోండి, అట్లా బట్టీ కొట్టిన విషయం మహా ఉంటే రెండు రోజులు- లేదా మూడు రోజులు- మాత్రమే ఉంటుంది మన మెదడులో. ఆ తరువాత అది మనకు ఇక జ్ఞాపకం ఉండదు. కానీ అర్థం చేసుకుంటే మటుకు అలా కాదు: మార్కులు వస్తే వచ్చె;రాకపోతే పోయె, కనీసం జ్ఞానం మటుకు వస్తుంది. వస్తే గిస్తే ఏదో ఒక ఉద్యోగం కూడా సంపాదించుకోవచ్చు. కాబట్టి మార్కులు ముఖ్యం కాదు.
మన జీవితం ఒక ఆట. అందులో మార్కులు ఒక అయిదు శాతం మాత్రమే. మిగతా తొంభై ఐదు శాతం 'చదువు, తల్లిదండ్రులు, టీచర్లు, మంచి భావ వ్యక్తీకరణ, సమాజంలో గౌరవం, మనలోని ప్రత్యేకత' ఇలాంటివి ఎన్నో ఉంటాయి. అయినా కేవలం ఐదు శాతం ఉండే ఈ మార్కులు మనల్ని ప్రతిక్షణం నరకంలోకి నెడుతుంటాయి.
ఉదాహరణకు- ఇప్పుడు మీరు పదవ తరగతి చదువుతున్నారు. మీ తల్లిదండ్రులు, టీచర్లు "మంచి మార్కులు తెప్పించుకో, తెప్పించుకో " అని మీ పై చాలా ఒత్తిడి తెచ్చి పెట్టారు. అట్లాంటప్పుడు మీరు ఎంత బట్టీ పట్టి చదివినా ప్రయోజనం ఉండదు. అయినా అట్లా చదివి, పరీక్షలు రాసి, చాలీ చాలని మార్కులతో మీ తల్లిదండ్రుల ముందర, టీచర్ల ముందర నిలుచుంటారు. వాళ్ళు అనే మాటలకు మీకు ఒక ఫీలింగ్ కలుగుతుంది- మార్కులు పోయినందుకు మీ జీవితమే పోయినట్లు అనిపిస్తుంది: అంతే, ఇంక మీరు ఖచ్చితంగా అస్సలు చదవనే చదవరు.
నేను మీకందరికీ చెప్పేదేంటంటే, ఒక ఆశయం తీసుకొని, ఆ ఆశయాన్ని చేరేవరకు పట్టుదల వీడకుండా కృషి చేయాలి మనం. ఎప్పటికప్పుడు విషయాల్ని అర్థం చేసుకోవాలి తప్ప, ఊరికే బట్టీ కొట్టకూడదు.
మార్కుల జోలికి అస్సలు వెళ్ళకండి- ఎందుకంటే అవి మన ఏకాగ్రతను పోగొడతాయి. ఒక్కసారి మార్కుల గురించి పట్టించుకున్నావంటే చాలు- అంతే, ఇంక నువ్వు బాగా రాయలేవు. మొదట నువ్వు మంచిగా చదువు- ఆ తరువాత నువ్వు వద్దన్నా మార్కులు నీ వెంట వస్తాయి.
ఇప్పుడు ఉన్న పరిస్థితులలో విద్య అనేది ఒక వ్యాపారం అయి కూర్చున్నది. ఉదాహరణకు, అన్ని బడులలోను ఏడవతరగతి పరీక్షలకోసం విద్యార్థులను చదివిస్తారు. ప్రతి ఒక్కరి దగ్గరా "ఆల్ ఇన్ వన్" గైడ్ ఉంటుంది. అది చూడడం-బట్టీకొట్టడం; చూడటం -బట్టీకొట్టడం; అంతే. చివరికి ఇంగ్లీషు, తెలుగు, హిందీ, సైన్స్ అన్నీ బట్టీ కొట్టటమే. భాషలన్నీ చక్కగా చదివి అర్థం చేసుకుంటే వచ్చేస్తాయి. కానీ భాషలను కూడా బట్టీ కొట్టేస్తారు. పరీక్షలు పూర్తి అయిపోయాక, బడులన్నీ ఇంక వాళ్ళ ఆయుధాల- (అంటే టి.వి!)- దగ్గరికి వెళ్తాయి. వెళ్ళి, సిగ్గు లేకుండా "మాకు మార్కులు ఇన్ని వచ్చాయి; ఫలానా స్కూల్లో చేరకండి; మా స్కూల్‌లో చేరండి" అని ప్రచారం చేసుకుంటాయి. పాపం అమాయక తల్లిదండ్రులు- వాళ్ల పిల్లలను ఆ స్కూళ్ళలోనే చేర్పించి వాళ్ళ జీవితాలను 'మార్కులు' అనే దుష్ట శక్తితో నింపుతున్నారు.
తల్లిదండ్రులారా, ఏ స్కూల్ గురించయినా సరిగ్గా తెలుసుకోకుండా మీ పిల్లలను ఆ బడిలో చేర్చకండి. మీ బంగారు పిల్లల జీవితాల గురించి కూడా ఆలోచించండి: ఏదైనా ఒక కొత్త వంటకం తయారు చేస్తున్నారంటేనే మీరు చాలా జాగ్రత్తగా ఉంటారే, మరి మీ పిల్లలను ఏదైనా బడిలో చేర్చాలన్నప్పుడు మీరు ఒకటికి పది సార్లు ఆలోచించి మరీ నిర్ణయం తీసుకోవాలి. మన పసిపిల్లలను 'మార్కులు' అనే దెయ్యం బారి నుండి మనమే విడిపించుకోవాలి.
'వీడెవడో మార్కుల గురించి ఇలా రాశాడు; వీడు వాడి క్లాసులో ఒక చదువురాని వాడు అయి ఉంటాడు" అని మాత్రం అనుకోకండి. నేనూ చదువుతాను; కానీ నాకు మార్కులు మాత్రం అంతగా నచ్చవు. అర్థం చేసుకోకుండా మార్కుల కోసమని చదివే చదువు నాకు అస్సలు నచ్చదు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే ఓ తల్లిదండ్రులారా, మీరు దయచేసి పిల్లల పై 'మార్కులు'అనే ఒత్తిడిని తీసుకురాకండి.
చివరగా టీచర్లకు నా విన్నపం- మార్కులను పిల్లలకు దూరంగా ఉంచండి. వాళ్ళకి నిజంగా ఎంత అర్థమైందో తెలుసుకొనేందుకు ప్రయత్నం చేయండి. పిల్లల్ని మార్కులతో కొలవకండి.