విదేశాల్లో ఉంటున్న మనవడు వివేక్ తాతగారిని చూడాలని భారతదేశానికి వచ్చాడు. తాత సదానందంలో ఉత్సాహం ఉరకలు వేస్తున్నది. సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు.
మనవడు వివేక్కి పదమూడేళ్ళు. విదేశంలోనే పుట్టినా తెలుగుదనాన్ని పుణికి పుచ్చుకున్నాడు వాడు. దేశమంటే ప్రేమ, పెద్దలంటే గౌరవం, తాత అంటే అభిమానం, చక్కని చదువు- ఏ తాతకైనా అంతకంటే ఏం కావాలి? అందుకే, మనవడి పుట్టిన రోజునాడు వాడి పేరిట తమ ఊర్లో ఉన్న అన్నిఆలయాల్లోనూ పూజలు చేయించాలని సంకల్పించాడు సదానందం. వంటవాళ్ళనుపిలిపించి పది రకాల ’తీపులు‘ చేయించాడు; పదిరకాల పండ్లు తెప్పించాడు; కంచినుండి పట్టుచీరలు, పట్టుపంచెలు తెప్పించి, అన్ని ఆలయాల్లోనూ దేవుళ్ళకు సమర్పించాలని నిశ్చయించాడు.
అన్నీ కార్లో సర్దుకుని బయల్దేరాడు మనవడితోకల్సి. "నాయనా! వివేక్ ! ఎంతో కాలంగా అనుకుంటూ ఉన్నానురా, నీ పుట్టినరోజునాడు మన ఊర్లో ఉన్న అన్ని దేవాలయాల్లోను అర్చన చేయించాలని. కానీ మీరేమో అక్కడెక్కడో ఉంటిరి! ఇన్నాళ్లకు నా కోరిక తీరుస్తున్నావు- సంతోషంగాఉందిరా ! ముందుగా మనం వెంకటరమణుని ఆలయానికి వెళ్ళి అర్చన చేయిద్దాం. ఆ తర్వాత మిగిలిన ఆలయాలకు వెళదాం.." అంటూ తమ ఊళ్ళో ఉన్న గుడుల విశేషాలు చెప్పసాగాడు సదానందం.
ఊళ్ళో జనాలందరూ రోడ్డుమీదే ఉన్నట్లున్నారు; కారు మెల్ల మెల్లగా పోతున్నది. చలి వణికిస్తూన్నది. ఉదయం పదిగంటలైనా ఇంకా మంచు పూర్తిగా వదలనే లేదు. అంతలో ఒక ముసలివాడెవరో కారుకు అడ్డం వచ్చినట్లుంది, డ్రైవరు అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. ముసలాయనకి చొక్కా లేదు.
చినిగిపోయిన పాత పంచె ఒకటి కట్టుకొని ఉన్నాడు. చలికి వణుకుతున్నాడు. "క్షమించండి బాబూ, చూసుకోలేదు" అంటూ రోడ్డు ఆవలికి నడిచి పోతున్నాడు.
అప్పుడు చూశాడు వివేక్. చాలా మంది ముసలివాళ్ళు, ముతకవాళ్ళు రోడ్డుమీద అక్కడక్కడా కూర్చొని ఉన్నారు- కొందరు ఏవేవో చిన్న చిన్న సామాన్లు అమ్ముతున్నారు. కొందరు ఊరికే అడుక్కుంటున్నారు. ఎవ్వరికీ ఒంటిమీద సరైన బట్టలు లేవు. చలికి అందరూ వణుకుతున్నారు.
అయినా ఎవరి పనిలో వాళ్ళున్నారు.
"తాతయ్యా, ఇక్కడ చాలామంది తాతలు ఉన్నట్లున్నారే, కానీ ఎవ్వరికీ చలి పుడుతున్నట్లు లేదు?" అడిగాడు వాడు, తాతయ్యని.
సదానందం అన్నాడు- "కాదురా, వాళ్లని చూసుకునేందుకు ఎవ్వరూ లేరు. అందునా ముసలివాళ్ళు కదా, బరువు పనులేవీ చేయలేరు. ఏదో ఇట్లా బ్రతుకుతున్నారంతే. వాళ్లకున్న కష్టాలముందు ఈ చలి ఏపాటి?" అని.
వివేక్ ఏమీ అనలేదు. కొద్దిసేపటికి "తాతగారూ! కారు ఆపించండి, ఓసారి" అని చెప్పడంతో డ్రైవర్ కారు ఆపాడు. వివేక్ గబగబా కారుదిగి, డిక్కీలో ఉన్న పండ్ల బుట్ట , కొత్త బట్టలు ఉంచిన సంచీ చేతపట్టుకొని వెనక్కి నడవటం మొదలు పెట్టాడు. వీధి ప్రక్కన ఉన్న ముసలి వాళ్లందరికీ ఆ కొత్తచీరలు, పంచెలు, బుట్టలోఉన్న పండ్లు పంచి ఇవ్వటం మొదలు పెట్టాడు!
సదానందం కారులోనే కూర్చొని మనవడిని చూస్తూ ఉండిపోయాడు.
అక్కడి ముసలివాళ్లంతా విస్తుపోతున్నారు; కంగారు పడుతున్నారు- "బాబూ ! తమరెవరు? ఇంత ఖరీదైన బట్టలు మాకు ఇస్తున్నారే, మీ పెద్దవాళ్లు కోపగించు-కుంటారేమో! మాతో పోట్లాడతారేమో! ఇంతకీ తమరెవరు బాబూ?" అని భయం భయంగా అడుగుతున్నారు వాళ్ళు.
"నేను సదానందంగారి మనవడిని. మా తాతగారు చాలా మంచివారు. మీకు ఇవన్నీ ఇచ్చినందుకు ఏమీ కోపగించుకోరు. దేవునికి చాలా బట్టలుంటాయి. ఆయనకు కావాలన-గానే ఇచ్చేవాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. 'అయినా వీళ్లంతా ఇక్కడ చలికి వణుకుతూ ఉంటే, నాకు మాత్రం కొత్త బట్టలు తెచ్చావేంటి?' అని దేవుడు నన్ను తిడతాడు- ఎందుకు, అట్లా అవ్వటం? ఇంద తీసుకోండి, ఈ తీపులన్నీ తినండి చక్కగా" అంటూ తను తెచ్చిన తీపులన్నిటినీ పూర్తిగా ముసలి-ముతకలకు పంచేశాడు వివేక్ .
అన్నీ పంచాక, ఖాళీ బుట్టలు-సంచులతో వచ్చి కార్లో కూర్చుని "తాతగారూ ! మీకు కోపం రాలేదు కదా, నన్ను క్షమిస్తారా ? మిమ్మల్ని అడక్కుండానే అన్నీ ఇట్లా పంచేశాను- పాపం వాళ్లని చూస్తే జాలి వేసింది మరి " అని అడిగాడు వివేక్.
అప్పటివరకూ మనవడు చేసిన పని గురించే ఆలోచిస్తున్న సదానందం సంతోషంగా నవ్వాడు- "నువ్వు చేసిన పని చాలా గొప్పదిరా! నాకు కోపం ఎందుకు వస్తుంది?! సంపదలు ఉన్నా, లేకున్నా మనం అందరం ఆ భగవంతుని బిడ్డలమే. అవసరంలో ఉన్న తన బిడ్డలకు సాయంగా ఇవన్నీ అందించినందుకు కరుణా-మయుడైన ఆ భగవంతుడు చాలా సంతోషించి ఉంటాడు; మనల్ని దీవిస్తాడు. నిజం! అయితే నాకు కాస్త చిన్నతనంగా ఉందిరా- '13 ఏళ్ళున్న నీకు తట్టిందే, ఈ విషయం- అది ఇన్నేళ్ళుగా నాకెందుకు తట్టలేదు?' అని సిగ్గుగా ఉంది.
పద, ఇక ఆ భగవంతుడిని దర్శిద్దాం. నీ మంచి మనసు ఇప్పుడు చేసిందే, అర్చన- అది ఈ మధ్యకాలంలో ఆయనకు చాలా సంతోషాన్నిచ్చిన కానుక అయి ఉంటుంది!" అంటూ కారును ముందుకు పోనిమ్మని చెప్పాడు సదానందం.