సీతమ్మధారలో ఉండే సుభద్రమ్మకు యాభైఏళ్ళు. రిటైర్డు భర్త క్రిష్ణయ్య, కొడుకు సుభాష్, కోడలు రమ్య, మనవడు "టబా"- వీళ్ళు, ఆమె ప్రపంచం.
సుభద్రమ్మకు దైవభక్తి, నమ్మకాలు ఎక్కువ. అందరు దేవుళ్ళనూ కొలుస్తుంది; సాయిబాబా గుళ్ళో భజనలు చేస్తుంది.
ఓ గురువారం నాడు క్రిష్ణయ్యగారు బజారుకు వెళ్ళారు. కొడుకు-కోడలు ఆఫీసుకు, మనవడు బడికి వెళ్ళారు. సుభద్రమ్మ ఒక్కతే కూర్చొని "శిరిడి సాయి" సీరియల్ చూస్తున్నది.
అంతలో వ్యాపార ప్రకటనలకోసం ఓ 'బ్రేక్' వచ్చింది. ఎప్పటి మాదిరే , సుభద్రమ్మ ఛానెల్ మార్చింది-
న్యూస్ ఛానెల్లో కూడా బాబాగారు కనబడ్డారు. జగదాంబ సర్కిల్లో "డాక్టర్ గాంగేయ"గారి ఇంట్లో- బాబాగారి ఫొటో నుండి విభూది రాలుతున్నదట! ఛానెల్ వాళ్ళు ఆ చూపిన దృశ్యాన్నే మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నారు. చూసిన కొద్దీ సుభద్రమ్మకు ఒళ్ళు పులకరిస్తున్నది.
సీతమ్మధార నుండి జగదాంబ సర్కిల్ ఏమంత పెద్ద దూరం లేదు- అరగంట ప్రయాణం. ఇక వెనుకా ముందు ఆలోచన చేయలేదు సుభద్రమ్మ. ఇంటికి గొళ్ళెం వేసింది; తాళం వేయ మరచింది; గబగబా టౌన్సర్వీస్ ఎక్కింది; డాక్టర్ గాంగేయ గారి ఇల్లు చేరింది.
అప్పటికే చాలా మంది గుమిగూడి వున్నారు అక్కడ. భజనలు మొదలు పెట్టారు. సుభద్రమ్మ కూడా ఆ భజన బృందంలో చేరి పోయింది.
అన్ని టీవీ ఛానెళ్ళూ విభూది వార్తను ప్రముఖంగా- మళ్ళీ మళ్ళీ ప్రసారం చేసాయి . రాను రాను ఇంకా ఎక్కువ మంది భక్తులు వచ్చి చేరుకున్నారు
అక్కడికి.
బారులు తీరిన భక్తుల సౌకర్యం కోసం బారికేడ్లు, ముడుపులు చెల్లించుకునేందుకు పెద్ద హుండీ ఒకటి ఏర్పాటు చేసాడు గాంగేయ. ఇప్పుడక్కడ జనం జాతరను తలపిస్తున్నారు.
అంతలో బజారు కెళ్ళిన క్రిష్ణయ్య తిరిగి వచ్చి చూసాడు- సుభద్రమ్మ కనబడలేదు ఇంట్లో. "గుడికి వెళ్ళిందేమో!" అనుకున్నాడు. భోజనం వడ్డించుకుని తిని పడుకున్నాడు. సాయంత్రం పిల్లలు, కొడుకు, కోడలు ఇంటికి వచ్చారు. "అమ్మ ఎటు వెళ్ళింది నాన్నా?" క్రిష్ణయ్యను నిద్ర లేపి అడిగాడు సుభాష్.
"నేను బజారునుండి వచ్చేటప్పటికే మీ అమ్మ ఇంట్లో లేదురా" సమాధానం ఇచ్చాడు క్రిష్ణయ్య- "కొంచెం సేపు వేచి చూశాను- మళ్లీ- 'గురువారం కదా! బాబా గుడికి వెళ్ళిందేమో!' అనుకుని అన్నం తినేసి పడుకున్నాను. ఇంత వరకూ రాలేదా? ఏమైందో- ఎక్కడుందో?!" కంగారుగా అన్నాడు.
ఊర్లో వున్న బంధుమిత్రులందరికీ ఫోన్ చేసి విచారించారు- సుభద్రమ్మ జాడలేదు.
రాత్రి పది అయింది- "ఇంక వేచి చూడకూడదు- పోలీసులకు కంప్లయింట్ ఇవ్వాల్సిందే!" అన్నది రమ్య. "సరే!" అని అందరూ స్టేషన్కు బయలు దేరుతున్నారు- అంతలోనే- టి.వీ చూస్తూన్న చిన్నోడు టబా "అదిగో, నానమ్మ! నానమ్మ అదిగో!" అని కేకలు వేశాడు.
అందరు ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూశారు- "అదిగో, చూడండి! నానమ్మ!" అని టివికేసి చూపిస్తున్నాడు టబా.
ఫొటో నుండి విభూది రాలటం చూపిస్తున్నారు టివిలో ఇంకా. అక్కడికి చేరుకున్న భక్తుల్ని, భజనలు చేసే వాళ్ళని పదేపదే చూపిస్తున్నారు.
భజన బృందంలో కూర్చొని ఉన్నది, సుభద్రమ్మ! పరవశత్వంలో ఒళ్ళు మరచి ఉన్నది. కళ్ళు మూసుకొని, సంతోషంగా పాటలు పాడుతున్నది.
విషయం అర్థమైంది అందరికీ. గబగబా ఓ ట్యాక్సీ ఎక్కి గాంగేయ గారి ఇల్లు చేరారు అందరూ.
అక్కడ ఇసుక వేస్తే రాలనంత జనం! జనాలని నెట్టుకుంటూ, తోసుకుంటూ ముందుకి చేరుకున్నారంతా. అక్కడ భజన చేస్తూ కూర్చొని ఉన్నది సుభద్రమ్మ!
"అమ్మా!" పిలిచాడు సుభాష్. సుభద్రమ్మ కళ్ళు తెరచి చూసింది- "రా నాయనా, రా! మీరు అందరూ వచ్చారూ?! చాలా సంతోషం. అంతా భగవంతుడి లీల, ఫోటో నుండి విభూది రాలడం అంతా దైవలీల! చూశారుగా?" అంది సుభద్రమ్మ ఇంకా పరవశంలోనే.
"దైవలీల లేదు, చింతకాయ లేదు- అంతా మోసం! అమాయక భక్తులను మోసం చేసే పద్ధతుల్లో ఇదొకటి. హుండీ పెట్టారు చూడూ?! ఇదే, వాళ్ల మోసానికి నిదర్శనం. నీ కోసం వెతకని చోటు లేదు- తెలుసామ్మా? నీకు చాదస్తం, మూఢనమ్మకాలు మరీ ఎక్కువ అయ్యాయి- నిజం! 'అదిగో పులి' అంటే, 'ఇదిగో తోక' అంటావు. ఇట్లా అయితే ఎట్లా?" మందలించాడు సుభాష్.
చుట్టూ చేరిన భక్తులు వింతగా చూడటం మొదలు పెట్టారు వీళ్ళవైపు.
పరిస్థితిని చక్క దిద్దటం కోసం అన్నాడు క్రిష్ణయ్య- "చూడు సుభద్రా, మన ఇంట్లో ఫోటో కూడా విభూతి రాలుస్తుంది- తెలుసా?" అని. "అదెట్ల?" అడిగింది సుభద్రమ్మ.
"ఇంటికి పద, చూపిస్తాను" అని ఆమెను కూడా ఇంటికి బయలు దేరదీశారు అందరూ.
మధ్యదారిలో టాక్సీని ఆపి, సైన్సు రసాయనాలు అమ్మే ఓ దుకాణంలోకి వెళ్ళి, ఏదో ఓ సీసా కొనుక్కొచ్చాడు క్రిష్ణయ్య.
ఇల్లు చేరీ చేరగానే మొదలు పెట్టింది సుభద్రమ్మ- "ఏదీ, మన ఇంట్లో కూడా విభూది రాలుతుందన్నారుగా?! రాల్చండి చూద్దాం!" అని.
"కొంచెం ఆగు, రాలుస్తుంది నిజంగానే- చూద్దువు; కొంచెం ఓపిక పట్టు-" అంటూ లోపలి గదిలోంచి బాబాగారి పటాన్ని తెచ్చాడు క్రిష్ణయ్య.
బాబాగారి పటానికి చక్కని అల్యూమినియం ఫ్రేం ఉంది- తెల్లగా మెరుస్తున్నది.
"ఇదిగో, దీన్ని గుర్తు పట్టావుగా, మన ఇంట్లో ఫొటోనేగా? ఇక ఇప్పుడు దీన్ని తీసుకో. బాబాగారి ఫొటో ఫ్రేముకు ఈ ద్రావణాన్ని పట్టించు, బాగా" తను తెచ్చిన సీసాని సుభద్రమ్మకు అందిస్తూ చెప్పాడు క్రిష్ణయ్య.
"ఏమిటిది?- మెర్క్యురిక్ క్లోరైడ్"- సీసా మీద లేబుల్ చదివింది సుభద్రమ్మ.
"ఏదో ఓ రసాయనం! చెబుతాగా, ముందు నేను చెప్పినట్లు చెయ్యి- ఫ్రేముకు దీన్ని పట్టించు" గట్టిగా చెప్పాడు క్రిష్ణయ్య .
ఆమె సీసాలోని రసాయనాన్ని ఫొటో ఫ్రేముకు పట్టించింది. బాబాగారి ఫొటోని అక్కడ పెట్టి, వెళ్ళి చెయ్యి కడుక్కొని వచ్చింది.
"చూడు, విభూతి రాలుస్తోంది!" అందరూ అరిచారు.
'నిజంగానే ఫొటో నుండి విభూతి రాలుతున్నది!' నిర్ఘాంతపోయింది సుభద్రమ్మ.
"చూడండి, అందరూ- మెర్క్యురిక్ క్లోరైడు ద్రావణం అల్యూమినియంతో కలవగానే ఒక రసాయనిక చర్య మొదలవుతుంది. ఫలితంగా 'అల్యూమినియం క్లోరైడు' అనే పొడి ఒకటి తయారవుతుంది. అది ఫొటో ఫ్రేమునుండి రాలుతున్నప్పుడు, చూసేందుకు అచ్చం విభూతిలాగానే ఉంటుంది. మనం ఏం చేయాలంటే, బజార్లో దొరికే విభూతి ఒకటి రెండు కిలోలు కొనుక్కొచ్చి, ముందుగానే ఆ ఫొటో ముందు పోసి ఉంచాలి- ఇప్పుడు ఫొటో ఫ్రేం లోంచి కొద్ది కొద్దిగా అల్యూమినియం క్లోరైడు రాలుతుంటే, చూసేవాళ్లకు మటుకు "అక్కడున్న బూడిద మొత్తం ఫొటోలోంచే రాలిందేమో" అనిపిస్తుంది!"
సుభద్రమ్మ మారు మాట్లాడలేదు. ఫొటోకి మరికొంత మెర్క్యూరిక్ క్లోరైడు పూసి, దండ వేసి బల్లమీద నిలబెట్టింది. కొంతసేపటికి మళ్ళీ బూడిద రాలడం మొదలయ్యింది. "ఈ విషయం మనం టీవీ వాళ్ళకు చెబుదామా?" అడిగాడు క్రిష్ణయ్య , సుభద్రమ్మను వెక్కిరిస్తూ.
"మనకేం ఖర్మ?! మోసం చెయ్యటం మన ఇంటా వంటా లేదు. భక్తులను దోపిడీ చేస్తే వచ్చేది నరకమే. ఇంతలా దగా చేస్తే ఇంక పుణ్యం ఎక్కడినుండి వస్తుంది?!" అంది సుభద్రమ్మ కోపంగా.
"మరి ఆ డాక్టర్ గాంగేయగారి ఇంట్లో జరిగింది ఇదేగా?!" అన్నాడు క్రిష్ణయ్య, తాపీగా.
"అవునమ్మా! వినాయకుడు పాలు తాగడం, బ్రహ్మంగారి కంటి నుండి నీళ్ళురావడం, మేరీ మాత ఏడ్వడం, విగ్రహాలు వింతగా ప్రవర్తించడం- ఇవన్నీ రసాయన శాస్త్ర ప్రయోగాలే! శాస్త్రీయంగా పరిశోధిస్తే, 'వీటన్నిటి వెనకా ఉన్నది ఆ దేవుళ్ళు మటుకు కాదు' అని స్పష్టం అవుతుంది" అన్నాడు
సుభాష్.
సుభ్రద్రమ్మకు కళ్ళు తెరచుకున్నాయి. "ఇంకెప్పుడూ ఇలాంటివి నమ్మనులెండి. మోసం చేసే వాళ్లకి శిక్ష పడేట్లు చేస్తాను- చూస్తుండండి" అంది ఆవేశంగా.