మొన్నొక రోజున ఓ స్నేహితురాలు పంపిన ఈ-మెయిల్‌తో కెంట్ మెల్విల్ గురించి తెలిసింది. అతని కథ చాలా స్పూర్తివంతంగా అనిపించింది.
అందువల్ల అతన్ని మీకు కూడా పరిచయం చేస్తున్నాను.
కెంట్ మెల్విల్ తొమ్మిదేళ్ళ అబ్బాయి. ఆ అబ్బాయికి ఈ వయసులోనే సొంతంగా ఒక వ్యాపారం ఉంది. తన పేరుతోనే "కెంట్స్" అన్న బ్రాండు కూల్ డ్రింకులు అమ్ముతూ ఉన్నాడు ఇప్పుడు. ఈ అబ్బాయి కథలో విశేషం, ఇలా ఇంత చిన్న వయసులో సొంత వ్యాపారం పెట్టడం ఒక్కటే కాదు: అతనికి ఆటిజం అన్న మానసిక రుగ్మత ఉంది. ఈ సమస్య ఉన్నపిల్లలకు వాళ్ళ ఊహల్ని ఇతరులతో చెప్పటం, బాంధవ్యాల్ని ఏర్పరచుకోవటం కష్టం అవుతుంటుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, కెంట్ మెల్విల్ ఈ వ్యాపారం ద్వారా వచ్చే సంపాదనని అంతా కూడా తనలా మానసిక వ్యాధులు ఉన్న పిల్లల కోసమే ఖర్చు చేస్తున్నాడు!
కెంట్ వాళ్ళ నాన్న వాళ్ళ ఊళ్ళోనే ఒక కాలేజీలో బిజినెస్ పాఠాలు చెప్పే లెక్చరర్. ఒక వేసవిలో కెంట్ ఒక "సమ్మర్ లేమనేడ్ స్టాండ్" పెట్టాడు. అంటే, వేసవికాలంలో నిమ్మరసం అమ్మి కొంచెం డబ్బులు సంపాదించటం అన్నమాట. అమెరికాలో కొంతమంది పిల్లలు వేసవిలో ఈ పని చేస్తూ ఉంటారు.
నిజానికి అలా అమ్మడానికి ఒక లైసెన్స్ ఏదో కావాలి- కానీ, ఏదో మన వీథిలో మనం ఒక చిన్న బండి పెట్టుకుంటే, ఎవరూ పట్టించుకోరు కదా.. అట్లా కెంట్ పెట్టుకున్న లేమనేడ్ స్టాండ్‌కి ఒక ఏడాది లాభం వచ్చింది. దాంతో "నేను సొంతంగా సోడా కంపెనీ పెడతాను" అన్నాడు అతను వాళ్ళ నాన్నతో . వాళ్ళ నాన్న ఒక పట్టాన ఒప్పుకోలేకపోయాడు. ఆటిజం ఉన్న తన తొమ్మిదేళ్ళ కొడుకు సొంతంగా వ్యాపారం చేస్తాను అంటే ఎలా ఒప్పుకోగలడు? కానీ, కెంట్ ఆయనతో అన్నాడట- "నాన్నా, నాకు అన్నీ అమర్చి పెట్టడానికి నువ్వున్నావు. కానీ, నాలా ఆటిజం ఉన్న మిగతా పిల్లల మాటేమిటి? వాళ్ళకోసం నేనూ ఏదయినా చేస్తాను. నా వ్యాపారంలోంచి వచ్చే డబ్బుతో వాళ్లకి ఏమన్నా ఇస్తాను" అని. దాంతో వాళ్ళ నాన్న ఇక కాదనలేకపోయాడు. అలా, ఎనిమిదేళ్ల వయస్సులో కెంట్ వ్యాపారం మొదలయ్యింది.
తరువాత కుటుంబ సభ్యులు, తన తండ్రి చదువు చెప్పే కాలేజీలో విద్యార్థులు, ఇతర సలహాదార్లు అందరి సహకారంతో "Kent's bottled classics soda pop" అన్న కంపెనీ 2011లో మొదలైంది. ప్రస్తుతం వివిధ రకాల సువాసనలతో కూడిన కూల్ డ్రింకులు అమ్ముతున్నారు ఆ కంపెనీ వాళ్ళు. వ్యాపారం మొత్తాన్నీ కెంట్ స్వయంగా పర్యవేక్షిస్తాడు. తనకి నచ్చిన రుచులతో కొత్త ఫ్లేవర్స్ రూపొందిస్తున్నాడు కూడా. అమ్మిన ప్రతి బాటిల్ వెలలోనూ కొంత భాగం ఆటిజం ఉన్న పిల్లల సంక్షేమం కోసం ఏర్పడ్డ ఒక చిన్న సంఘానికి చేరుతుంది. ఈ డబ్బుతో అలాంటి పిల్లలకోసం గెట్-టుగెదర్లు, కలిసి సినిమాలు చూడ్డం, ఆడుకోవడంలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. అలా, ఆటిజం కారణంగా ఇతరులతో కలువలేక పోయే వాళ్లను అందరినీ కెంట్ ఒక చోట కలుపుతున్నాడు అన్నమాట. ప్రస్తుతానికి కెంట్ వ్యాపారం విజయవంతంగా నడుస్తోంది!
'కలర్ సోడా తాగడం ఆరోగ్యానికి మంచిదేనా?' లాంటి ప్రశ్నల్ని ప్రక్కనపెట్టి ఈ పిల్లాడి కథని చదవండి. అంత చిన్న పిల్లాడొకడు తన మానసిక సమస్యను ఎదుర్కొంటూ ముందుకు సాగడమే కాకుండా, 'తనలాంటి వాళ్ల కోసం ఏదన్నా చేయాలి' అనుకోగలగటం, నిజంగా గొప్ప విషయమే, కదూ?