ఒక ఊరిలో అన్నదమ్ములిద్దరు ఉండేవాళ్ళు. పెద్దవాడి పేరు సీను; చిన్నవాడి పేరు రాము. రాము చాలా అమాయకుడు. సీను మాత్రం తెలివిమంతుడు. వాళ్ల నాన్న చిన్న ఉద్యోగస్తుడు. వయసు ఐపోయింది.

చనిపోయే ముందు ఇద్దరినీ పిలిచి "నా తావ ఉండేది ఈ ఇల్లు, ఈ గొడ్డలి- వీటిని రెండింటినీ‌ పంచుకొని ఇద్దరూ మంచిగా బ్రతకండి" అని చెబుతూ కన్ను మూశాడు.

సీను తెలివిమంతుడు కదా, తమ్ముడిని పిలిచి " ఒరే తమ్ముడూ! నాన్న చెప్పాడు కదా, ఇల్లును-గొడ్డలిని పంచుకొమ్మని?" అన్నాడు.

తమ్ముడు "ఔను అన్నా!" అన్నాడు. అప్పుడు సీను "రామూ, నువ్వు గొడ్డలిని తీసుకో, నేను ఇల్లు తీసుకుంటాను. అలా ఇద్దరమూ చక్కగా బ్రతుకుదాం!" అన్నాడు.

అదివిని, రాము "మా అన్నకు నేనంటే ఎంత ఇష్టమో!" అనుకొని, సరే అన్నాడు.

రాము ఆ గొడ్డలిని తీసుకొని కట్టెలు కొట్టుకుంటూ జీవనం సాగించుకొనేవాడు. ఇద్దరికీ భార్యా పిల్లలు ఉన్నారు. ఒకరోజు రాము భార్య నాలుగు రొట్టెలు చేసి పంపించింది. రాము మామూలుగానే కట్టెలు కొట్టుతున్నాడు. అన్నం ఆకలి అవుతుంటే తిందామని రొట్టెలమూట విప్పాడు.

రెండు రొట్టెలు తిన్నాడో లేదో- పరుగెత్తుకుంటూ ఒక ముసలాయప్ప అక్కడికి వచ్చి "నాయనా, నాకు చాలా ఆకలి అవుతున్నది. ఒక రొట్టె పెట్టవూ!" అన్నాడు.

"సరే తాతా! ఇక్కడ కూర్చో, పెడతాను" అన్నాడు రాము. తన దగ్గర మిగిలిన రెండు రొట్టెలనూ అతనికి పెట్టాడు; ప్రక్కన ఉన్న చెంబు తీసుకొని చెరువుకు వెళ్ళి నీళ్లు తెచ్చి ఇచ్చాడు. ఆ తాత కడుపునిండా తిని, నీళ్ళు త్రాగి "చల్లగా ఉండు నాయనా" అని దీవించి పోయాడు. రాము కూడా కడుపునిండా‌ నీళ్ళు త్రాగి, కట్టెలు కొట్టుకొని ఇంటికి పోయాడు.

రెండోరోజు కూడా ముసలాయప్ప అలాగే వచ్చాడు. ఆ రోజు కూడా రాము అతనికి అన్నం పెట్టాడు. "తాతా, నీది ఏ ఊరు?" అని అడిగాడు. "నాది చాలా దూరపు ఊరు నాయనా!" అన్నాడు ఆయన. "మరి ఇటు వైపుకు ఎందుకు వచ్చావు?" అని అడిగాడు రాము. "నేను శిల్పాలు చెక్కుతుంటాను నాయనా!" అన్నాడు తాత. "మరైతే నాకు ఒక విసర్రాయిని తెచ్చి ఇస్తావా, రోజూ నీకు రొట్టెలు తెచ్చి ఇస్తాను?" అడిగాడు రాము. "దానిదేముంది? రేపు నీకో విసర్రాయిని తెచ్చి ఇస్తానులే" అన్నాడు తాత. అన్నమాట ప్రకారం మరునాడు ఒక విసర్రాయిని తెచ్చి ఇచ్చాడు రాముకు.

దాన్ని ఇంటికి తెచ్చి, భార్యకు ఇచ్చాడు రాము. రాము భార్య దానిలో కొన్ని రాగులు పోసి విసిరింది- ఆశ్చర్యం! ఆ‌ విసర్రాయి కుప్పలు కుప్పల రాగిపిండిని బయటికి పోసింది! ఆమె ఆశ్చర్యపడి, రాముని పిల్చింది, చూడమని.

రాము వచ్చి చూసే సరికి, రాగి పిండి కుప్ప పెద్దదైపోతోంది, ఇంకా! రాము "ఇంత రాగిపిండి ఏమి చేసుకోను, చాలు చాలు" అన్నాడు. విసర్రాయి ఆగిపోయింది! ఇంక ఆ రోజునుండి రాము ఇంట్లో తిండికి కొరత లేకుండా అయ్యింది.

ఒకసారి వాళ్ల నాన్న చనిపోయిన రోజు వచ్చింది. "ఆ రోజున అందరికీ భోజనాలు పెట్టాలి" అనుకున్నాడు రాము.

ఊరంతటినీ పిలిచి భోజనాలు పెట్టాడు. ఊరంతా రాము గురించి చాలా గొప్పగా చెప్పుకున్నది.

అది విన్నాడు, వాళ్ల అన్న సీను. "ఎట్లా చేశాడు వీడు? ఏదో మంత్రం ఉంది!"అని భార్యను కూడా వెంట బెట్టుకొని వచ్చాడు. వాళ్లను చూడగానే రాము లేచి వెళ్ళి, వాళ్లను ఇంట్లో‌ లోపల కూర్చో బెట్టుకొని, మర్యాద చేశాడు. అట్లా వాళ్లకు ఇసర్రాయి ఉన్న రహస్యం తెలిసింది.

అప్పడు సీను తమ్ముడిని "రామూ! నాకు ఈ విసర్రాయి ఇవ్వు బుజ్జీ!” అని అడిగాడు.

“నువ్వు ఏదైనా అడుగు ఇస్తాను, కానీ‌ఈ విసర్రాయి మాత్రం అడగొద్దన్నా!” అన్నాడు రాము.

"సరేలేరా, నీ యిష్టం" అని, అన్న వదిన ఆరోజు రాత్రికి అక్కడే పడుకున్నారు.

అయితే రాత్రి వాళ్లకి నిద్ర పట్టలేదు- "ఎలాగైనా విసర్రాయిని ఎత్తుకుపోవాల్సిందే" అని, అర్థరాత్రి లేచి, అక్కడ నాలుగు రొట్టెలుంటే వాటిని మూట కట్టుకొని, విసర్రాయిని ఎత్తుకొని అన్న, వదిన ఇద్దరూ ఉడాయించారు. ఒకసారి సముద్రం ఒడ్డుకు చేరుకున్నాక, వాళ్ళిద్దరూ పడవ ఎక్కి చాలా దూరం పోయారు.

మధ్యలో వాళ్ళిద్దరికీ‌ చాలా ఆకలైంది. "రొట్టెలున్నాయికదా, తిందాం" అని, వాళ్ళిద్దరూ రొట్టెలు తినబోయారు. చూస్తే ఆ రొట్టెల్లో‌ఉప్పులేదు! అప్పుడు వదిన అన్నది "విసర్రాయి ఉంది కదా, ఎంత ఉప్పు ఇమ్మంటే అంత ఇస్తుంది!" అని, విసర్రాయిని తిప్పి, ఉప్పు ఇమ్మన్నది. వెంటనే విసర్రాయి మూటలు మూటల ఉప్పు ఇవ్వటం మొదలు పెట్టింది. అన్న, వదిన ఆశ్చర్యంగా చూస్తూ పోయారు.. చూస్తూండగానే పడవంతా ఉప్పుతో నిండిపోయింది!

"ఇదేంటి, ఇదేంటి" అంటున్నారుగానీ, అన్న వదినలకు విసర్రాయిని ఎలా ఆపాలో తెలీలేదు. ఉప్పు బరువుకి వాళ్ళిద్దరూ ఎక్కిన పడవ కాస్తా మునిగిపోయింది. అన్న వదిన ఇద్దరూ‌ ఏమయ్యారో తెలీదుగానీ, విసర్రాయి మాత్రం సముద్రం అడుగుకి చేరుకున్నదట. అక్కడే అది మూటలు మూటల ఉప్పు తయారు చేస్తున్నదట ఇంకా- అందుకనే సముద్రపు నీళ్ళు ఉప్పగా ఉంటాయట!