అనగా అనగా చంద్రపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామం ప్రక్కన ఒక అడవిలో పెద్ద పెద్ద కొమ్మలు, ఊడలతో విశాలంగా విస్తరించిన ఓ మర్రిచెట్టు ఉండేది. ఆ చెట్టు క్రింద పెద్ద పుట్టలో ఓ నాగుపాము నివసిస్తుండేది.
ఒక రోజు సూరయ్య అనే కట్టెలు కొట్టుకొని జీవించే కూలివాడు గొడ్డలితో వచ్చి ఆ మర్రిచెట్టును కొట్టనారంభించాడు. ఇంతలో పుట్టలో నుండి ఒక నాగుపాము బయటకు వచ్చి- "ఓసూరయ్యా! ఈ చెట్టును కొట్టకు. ఇది మా ఇంటి చెట్టు, దీనిని ఆశ్రయించుకొని నేను, అనేక రకాల పక్షులు చాలా సంవత్సరాలుగా సుఖంగా జీవిస్తున్నాం. దీనికి ప్రతిఫలంగా నేను నీకో మణిని ఇస్తాను. తీసుకొని వెళ్ళి హాయిగా జీవించు" అన్నది.
సూరయ్య చాలా సంతోష పడ్డాడు. చెట్టును కొట్టడం మాని, ఆ మణిని తీసుకొని వచ్చాడు. మణిని అమ్మేసరికి సూరయ్యకు ఎక్కడలేని వసతులూ సవకూరాయి. అతనిప్పుడు గొప్ప ధనవంతుడు. అయితేనేమి? కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. సూరయ్య చేతిలో డబ్బంతా కొన్నాళ్లకు ఖర్చయిపోయింది. మళ్ళీ కట్టెలు కొట్టుకుంటూ అదే చెట్టు దగ్గరికి వెళ్ళాడు.
పాము మళ్ళీ బయటకు వచ్చి, సూరయ్యను పలకరించింది- "ఏం సూరయ్యా! మళ్ళీ వచ్చావా!? ఎందుకు?! నువ్విక్కడికి రావద్దని అప్పుడే నీకో మణినిచ్చానుగా?" అన్నది .
"నువ్విచ్చిన మణి ఎన్ని రోజులు ఉంటుంది, వెంటనే అయిపోయింది! ఇల్లుగడవాలి గదా, కట్టెలు కొట్టకపోతే ఎలాగ?" అన్నాడు సూరయ్య, గొడ్డలికి పదును పెడుతూ .
"ఆగాగు! నీకు ఈసారి రెండు మణులిస్తాను. వాటితో నువ్వు జీవితాంతం సంతోషంగా బ్రతికేయచ్చు" అని, పాము లోపలికి వెళ్ళి, ఈసారి రెండు మణుల్ని తెచ్చి సూరయ్యకిచ్చింది.
సూరయ్య సంతోషంగా ఆ మణుల్ని తీసుకొనివచ్చి, మరికొంతకాలం ఎలాంటి చీకూ చింతా లేకుండా హాయిగా బ్రతికాడు. ఆ తరువాత అతనిలో దురాలోచన మొదలైంది. "ఆ పుట్టలో ఎన్ని మణులుండచ్చు?" అని. "పామును చంపేసి, మణులన్నిటినీ ఒకేసారి తెచ్చుకుంటే జీవితాంతం రాజాలాగా బ్రతకచ్చు కదా!" అనుకున్నాడు అతను.
వెంటనే అతను ఇద్దరు మనుషులను వెంటబెట్టుకొని వచ్చి, గడ్డపారలతో పుట్టనంతా త్రవ్వాడు. అడ్డం వచ్చిన పామును చంపేసి పుట్టనంతా వెతికాడు. కానీ పుట్టలో ఒక్క మణి కూడా లేదు!
సూరయ్యకు, ఏడుపొచ్చింది- "అయ్యో! మణులనిచ్చి ఆదుకునే నాగ దేవతను చేతులారా చంపుకున్నానే! దురాశ ఎంతపని చేసింది!" అని ఏడుస్తూ వెళ్ళిపోయాడు.