అప్పుడు దమనకుడు సంజీవకునితో "ఏమీ తెలియని వాడి లాగా మాట్లాడుతున్నావు. కాటకపాటకులు 'రాజద్రోహులు' అని తెలిసీ వాళ్ళతో స్నేహం చేస్తున్నావే!? రాజుగారికే కాదు; ఎవ్వరికైనా ఇది 'తప్పు' అని అనిపించకుండా ఉంటుందా? నువ్వు చేస్తున్న ఈ పని తెలుసుకొని, రాజుగారు ఎక్కడలేని కోపంతో మండి పడుతున్నారు. గతంలో నువ్వు నా మాటకొద్దీ రాజుగారి పంచన చేరావు: కాబట్టి ఉన్న మాట చెబుతాను, విను. 'సంజీవకుడి పక్షాన చేరిన వాళ్ళు ఎవరు ఎదురుపడ్డా వాళ్ళను ఆ క్షణంలోనే యమపురికి పంపిస్తాను' అని సింహరాజు పరమ గంభీరంగా ప్రతిజ్ఞ చేశాడు. 'ఇప్పటికిప్పుడే సంజీవకుడిని వెంటబెట్టుకు రా!' అని నన్ను పంపాడు. ఆపైన నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి-”
"ఇంతటి చెడు ఊరికే పుట్టదు- దగ్గర చేరినవాళ్ళే ఎవరో నీపైన చాడీలు చెప్పి ఉంటారు. ఇంకా ఇలాంటివి ఏమేమి పుట్టనున్నాయో తెలియదు. ఇవాళ్ల నీకైంది, రేపు మాకు కావచ్చు! జరిగినదానికి విచారపడి ఫలితం ఏమున్నది? ఏనాడైతే రాజుగారిని సేవించేందుకు బానిస మాదిరి ఒప్పుకున్నామో, ఆనాడే మనం అందరం మృత్యువు నోట్లో పడ్డాం. అందువల్ల దేన్నో తలచుకొని ఏడవకూడదు. అది 'సముద్రాన్ని దాటేశాక వంతెన కట్టటం' అవుతుంది తప్ప, తెలివైన పని కాదు" అని నిట్టూర్చి, దు:ఖాన్నీ, బాధనీ అభినయిస్తూ, తలవంచుకొని క్రిందివైపుకు చూస్తూ, ఊరుకున్నది.
వజ్రాయుధం కొండను ఛేదించినట్లు, దమనకుడి ఆ మాటలు సంజీవకుడి ధైర్యాన్ని బ్రద్దలు చేశాయి. భయం క్రమ్ముకొనగా, అది కొంత సేపు నిశ్చేష్టమై ఉండిపోయింది. చివరికి అది మనసును గట్టి చేసుకొని, దమనకుడిని చూస్తూ "ప్రతి క్షణమూ రాజుగారి మేలునే కోరాను తప్పిస్తే, కీడును కలనైనా తలపలేదే? శతృవులకైనా కీడు తలపెట్టాలని నా మనస్సు కోరుకుంటుందా? కారణం ఏమీ లేకుండానే ప్రభువుకు ఇలాంటి పంతపు కోపం తెప్పించి, మంచివాళ్లను చెరిపేందుకు ఒడికట్టిన ఆ పుణ్యాత్ములు ఎవరోగాని, వాళ్లు బ్రహ్మకల్పం ముగిసేంతవరకూ నిలచి ఉంటారు కాబోలు! పాములకు విషం సహజం- అదే విధంగా దుర్మార్గులకు చెడు బుద్ధి సహజం. అసలు వాళ్ళను ఏమనాలి, రాజుగారి అవివేకమే అన్ని అనర్థాలకూ మూలం. 'ఎద్దు ఈనింది' అనగానే 'కొట్టంలో కట్టెయ్' అనేవాడు రాజైతే ఏముంది? ఇక సేవకులు భయం వదిలి పెడతారు; తమ ఇష్టం వచ్చినట్లు ప్రభువును అకార్యాలకు ప్రేరేపించి, కీర్తి ప్రతిష్ఠలు నాశనం చేస్తారు; చివరికి మంచితనం అనేదే మిగలకుండా చేస్తారు.
ఇంతకాలమూ రాజుగారి అనుగ్రహం సంపాదించేందుకు నేను పడిన పాట్లన్నీ వృధా అయ్యాయి. వివేకం లేని యజమానిని సేవించటం కేవలం వృధా మాత్రమే కాదు- ప్రాణాంతకం కూడా అవుతుంది.
నా మనస్సులోగాని, మాటలోగాని, చేతల్లోగాని, ఏ నాడూ ఏ చిన్న తప్పూ చేసి ఎరుగను. అనుక్షణం ప్రభువు క్షేమాన్నే కోరుకున్నాను. అలాంటి నేను ఇప్పుడు 'మృత్యువు నోరు' అనే గుహలోకి దూరవలసి వస్తున్నది గదా!
చూడు, 'ఇతరులకు నేను ఏ కొంచెం చెడూ చేయలేదు; కనుక నాకు వేరెవరు కీడు తలపెడతారు?' అనుకోకూడదు. కోరికతోటీ ద్వేషంతోటీ కుళ్ళిపోయినవారి మనస్సులు మంచివారి మీద కూడా విషాన్నే క్రక్కుతాయి. ఇదివరకు కాకి, పులి, నక్క కలిసి, తమ ప్రభువైన సింహాన్ని ప్రేరేపించి, పరమ సాధువైన ఒంటెనుకూడా కపటోపాయంతో చంపించలేదా?” అన్నది.
"ఏమాకధ, వివరంగా చెప్పు" అని దమనకం అడిగితే సంజీవకం ఆ కథను చెప్పసాగింది-
సింహం-ఒంటె కథ
మలయ పర్వతాల దగ్గర, 'దర్పసారం' అనే సింహం ఒకటి ఉండేది. ఒక కాకి, ఒక పులి, ఒక నక్క దానికి మంత్రులు. ఒకసారి ఆ మంత్రులు మూడూ అడవిలో తిరుగుతూండగా వాటికి ఒక ఒంటె కనబడ్డది. అవి దాని దగ్గరికి పోయి "నువ్వెవ్వరు? ఎక్కడినుండి వచ్చావు? నీ పేరేమిటి?" అని అడిగాయి.
అప్పుడు ఆ ఒంటె వాటికి తన కథను చెప్పుకున్నది- "వర్తకుడొకడు నామీద ఎప్పుడూ ఎక్కడలేని బరువునూ ఎక్కించి మోయిస్తుండేవాడు. ఇట్లా చాలా కాలం పాటు అతనికి ఊడిగం చేశాను గానీ, ఆ బాధను ఇక భరించలేకపోయాను. ఒక రోజున అతన్ని ఏమార్చి, ఇదిగో- ఇట్లా ఈ అడవిలోకి వచ్చి, దాక్కున్నాను. ఈ పులి రాజును చూస్తే లోక భీకరుడిగా కనబడుతున్నాడు. ఇక మీరేమో, గొప్ప విజ్ఞానులుగా తోస్తున్నారు. ఎలాగో ఒకలాగ మీ అనుగ్రహం పొందానంటే, నా భయం పోగొట్టుకొని బ్రతుక్కుంటాను. మీరు తప్ప నాకు వేరే గతి లేదు. 'శరణు జొచ్చినవాళ్ళను కాపాడటం అన్ని ధర్మాలలోకీ గొప్పది' అని ధర్మశాస్త్రం తెలిసినవాళ్ళు చెబుతుంటారు. నన్ను కాపాడండి" అన్నది అది.
అప్పుడు ఆ నక్క దానితో "ఈ అరణ్యంలో ఒక గొప్ప మృగరాజు ఉన్నాడు. శత్రువుల శౌర్యం అనే దీపాన్ని తుపుక్కున ఆర్పే సుడిగాలి లాంటి మహాబలుడు, అయన. మేము ఆ సింహరాజు సేవకులం మాత్రమే. నువ్వు ఆయన్ని తప్పక దర్శించాలి. నీకు మావల్ల అయ్యే మేలు మేము చేస్తాము. అంతా మేలే జరుగుతుందిలే; భయపడకు- మావెంట రా!" అని దాన్ని వెంటపెట్టుకొని సింహం దగ్గరికి తీసుకెళ్ళాయి. ఆ ఒంటెకు వాటి మాటలు విని ధైర్యం వచ్చింది. మనస్సులో పొంగిపోతూ వాటి వెంట నడిచి పోయింది.
అప్పుడా కాకి, నక్క, పులి సింహరాజు దగ్గరికి వెళ్ళి, దాని ముందు నిలబడి, ఒంటె కథను తాము విన్నది విన్నట్లుగా చెప్పాయి. అటుపైన ఒంటెను ముందుకు నెట్టి సింహరాజుకు మ్రొక్కమన్నాయి. ఆ ఒంటె వినయంగా సింహ రాజుకు నమస్కరించి ఒక ప్రక్కగా నిలబడింది. సింహం దాన్ని దయతో చూసి, దానికి అభయం ఇచ్చి, కొంచెంసేపు ఆ సంగతీ ఈ సంగతీ మాట్లాడి- "నీకు మంత్రి పదవిని ఇస్తున్నాం. మా పాత మంత్రులతో కలిసి నువ్వు కూడా రాచ-కార్యాలను నెరపుతూ సుఖంగా ఉండు" అన్నది. "మహా ప్రసాదం" అని ఊపిరి పీల్చుకున్న ఒంటె ఆనాటినుండీ అణకువతో సింహరాజు చెప్పిన పనులన్నీ చేస్తూ ఉన్నది.
ఇట్లా చాలాకాలం గడిచింది. ఒకరోజున సింహం తన మంత్రులను పిలిచి "మంత్రులారా! నా శరీరం ఇప్పుడు వ్యాధి పీడితమైంది. నా ఒంట్లో ఇదివరకటంత సత్తువ ఉండటం లేదు- ఇప్పుడు అడవిలో తిరగలేను. నా ఆరోగ్యం బాగై, శరీరంలోకి కొంత శక్తి వచ్చి చేరేంతవరకూ నాకు మీరే ఆహారం సంపాదించి తెచ్చి ఇవ్వాలి" అన్నది.
అది విని మంత్రులన్నీ "ప్రభూ! మేం చిన్నవాళ్ళం. బలహీనులం. మీకు ఒక్క పూటకు సరిపోయేంత ఆహారాన్ని కూడా తెచ్చి ఇచ్చేంత సమర్థత లేదు, మాకు! ఏదో, మీ పాదాల చెంతన పడి ఉండి, మీరు తినగా మిగిలిన దాన్ని తింటూ బ్రతుకుతున్నవాళ్ళం. మా శక్తి ఎంత పరిమితమైనదో దేవరవారికి తెలీనిది కాదు" అన్నాయి.
అప్పుడా సింహం వాటిని చూసి "దొరికినంతనే కానివ్వండి- కొంచెంతోటే సర్దుకుంటాను! అదికాక ఇప్పుడు నేనేం చేసేది? గతంలో చేసిన పనుల వల్ల నాకు ఇప్పుడు ఈ వ్యాధి ఒకటి, దాపురించింది. నడిచేందుకు ఏ కొంచెం శక్తి ఉన్నా మిమ్మల్ని కష్టపెట్టేవాడిని కాదు. అందువల్ల, భయపడకండి- అడవిలోకి వెళ్ళి, ఏలాంటి మాంసం అయినా పరవాలేదు- ఎంత దొరికితే అంత- తీసుకొని రండి. పోండి!" అని ఆజ్ఞాపించింది.
ఆ నాలుగు జంతువులూ సింహానికి ఎదురు చెప్పేంత ధైర్యం లేక, అడవిలోకి పోయి, అన్ని వైపులా వెతకటం మొదలు- పెట్టాయి. అయినా వాటికి సరైన ఆహారం ఏదీ దొరకనే లేదు. మధ్యాహ్నం అవుతుండే సరికి వాటి బాధ మరింత ఎక్కువైంది. నాలుగూ వేటికవి, వేరు వేరు దిక్కుల్లో పోయి, మాంసం కోసం వెతికాయి. అట్లా వెతుకుతూ వెతుకుతూ చివరికి కాకి, పులి, నక్క మాత్రం ఒక చోట కలుసు-కున్నాయి. చూడగా ఆ మూడింటిలో దేని దగ్గరా ఒక్క మాంసపు ముక్క కూడా లేదు!
అప్పుడు కాకి మిగిలిన రెండింటితో అన్నది- "మీరు ఏ కొంచెం మాంసాన్ని కూడా సేకరించినట్లు అనిపించటం లేదు. మీ అంతటి వాళ్ల చేత కాని పని, అల్పజీవిని- పక్షిని- నాకు ఎట్లా సాధ్యం? మధ్యాహ్నం అయ్యింది- ఇంకా తిరిగితే దానివల్ల పనికిమాలిన ఆయాసమే తప్ప, ప్రయోజనం ఏమాత్రం ఉండేటట్లు లేదు. మృగరాజు మన రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయన దగ్గరికి ఉత్త చేతులతో వెళ్ళటం కుదరదు-
ఇంతకాలమూ మనం ఆయన తెచ్చి ఇచ్చిన మాంసాన్ని పొట్టనిండా తిని, కాలు బయట పెట్టకుండా నిశ్చింతగా బ్రతికాం. ఆయనకు ఇప్పుడొక కష్టం వస్తే, ఒక్క పూటకు సరిపడేంత భోజనం అయినా తెచ్చి ఇవ్వలేని మనలాంటి సేవకులు ఎందుకు?" ఇప్పుడు నా మనస్సుకు ఒకే మార్గం కనబడుతున్నది- దాన్ని విని, మీకు తోచిన విధంగా చేయండి-" అన్నది వాటితో.
ఆపైన అది నలువైపులా కలయజూసి, మిగిలిన వాటికి దగ్గరగా జరిగి, గొంతు తగ్గించి, మెల్లగా "మనం ఈ ఒంటెను సరిపెట్టి- ఇవాళ్టికి ఎలాగో ఒకలాగ రాజుగారి పనిని నెరవేర్చామంటే, రేపటి సంగతి రేపు చూసుకోవచ్చు. రాజుగారు తిని వదిలిపెట్టిన మాంసాన్ని మనం మరికొన్ని రోజులపాటు కడుపారా తినచ్చు కూడాను- ఆలోచించండి" అన్నది.
"మన రాజుగారు ఆ ఒంటెకు మంత్రి పదవిని ఇచ్చి చాలా గౌరవిస్తూ వస్తున్నాడు. అందువల్ల అంత త్వరగా దాన్ని చంపి తినడు. మనకై మనం అట్లాంటి పని ఏమైనా చేశామంటే ఆయన మనసుకు నొప్పి కలుగుతుంది- మనమే ఆయనకు దూరం అయిపోతాం. అందువల్ల నువ్వు చెప్పిన మార్గం మనకు సరిపోదు" అన్నది నక్క.
"ఆకలిగొన్నవాడికి తను చేసే పనుల్లో మంచి-చెడులేవీ పట్టవు. సొంతవాళ్లని చంపేందుకైనా పాల్పడతాడు గానీ, 'ఇది తప్పు పని కదా' అనుకోడు. ఆకలి బాధ వల్ల కాకపోతే- పాము తన గ్రుడ్లను, ఆడపులి తన పిల్లలను- ఎందుకు తింటాయి?" అన్నది కాకి మళ్ళీ ఆందుకొని.
అది విని పులి ఇట్లా అన్నది- "మన రాజుగారు ఆకలికి తట్టుకోలేక ఒంటెను చంపితే చంపనివ్వండి- దాంతో మనకు సంబంధం లేదు. మనం ఆయన దగ్గరికి వెళ్ళి, భయపడకుండా, మనం పడిన కష్టాలన్నీ వివరిద్దాం. 'అటుపైన ఏం చేయాలి' అనేది మనమూ, ఆయనా- కలిసి ఆలోచిద్దాం" అన్నది.
"సరే" అన్నాయి మిగిలిన రెండూ. అప్పుడు, ఒంటె ఇంకా తిరిగి రాకనే ఈ మూడూ వెళ్ళి, సింహం ముందు నిలబడ్డాయి.
"ప్రభూ! ఏం చెయ్యాలి? తిరగరాని చోట్లన్నిటా తిరిగాం; పడరాని పాట్లన్నీ పడ్డాం. ఇంత శ్రమ పడీ ఏం ప్రయోజనం? ఎంతో కరుణతో- మా రక్షణను, పోషణను సొంత పనుల మాదిరి బాధ్యతతో నిర్వర్తించే మా ప్రభువులవారికి- మా వల్ల ఆవగింజంత ఉపయోగమూ కలగలేదు! అయినా మా విన్నపం ఒకటి- కాదనకుండా వినండి. ప్రభువులవారు ఆకలి బాధ వల్ల చాలా డస్సిపోయి ఉన్నారు. మాలో ఒకడిని తిని, మీ ఆకలిని తీర్చుకోండి! మా యీ ప్రార్థనను మన్నించండి!" అన్నాయి.
(మిగతాది మళ్ళీ వచ్చేసారి...)