అవంతీ రాజ్యాన్ని విక్రమదేవ వర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. చుట్టూ బలమైన శత్రుదేశాలు ఉన్నప్పటికీ, మంచి సైనిక శక్తి, తగిన సైన్యాధ్యక్షుడు ఉండటంతో ప్రజల్లో‌అభద్రతా భావం లేకుండా ఉండేది.

అయితే అకస్మాత్తుగా సైన్యాధ్యక్షుడు మరణించాడు; వెనువెంటనే పొరుగు దేశాలు కయ్యానికి కాలు దువ్వే పరిస్థితి వచ్చింది. వెంటనే సమర్థుడైన సైన్యాధ్యక్షుడిని ఎన్నుకోవాలి- అందుకని రాజుగారు మంత్రి సుబుద్ధి సూచన మేరకు దండోరా వేయించాడు. రాజ్యంలోని యువకులు వేలాదిగా వచ్చి తమ విద్యా పాటవాలను ప్రదర్శించారు. అందరిలోనూ సమఉజ్జీలుగా నిలిచిన రాజేంద్రుడు, అమరేంద్రుడు అనే ఇద్దరు యువకులను సుబుద్ధి తుది పరీక్షకు ఎంపిక చేసాడు. మరుసటిరోజే తుది పరీక్ష.

మైదానంలో పెద్ద వేదికను తయారు చేశారు. ప్రజలందరూ వచ్చి చేరారు. మంత్రి సుబుద్ధి వచ్చి చివరి పరీక్ష నియమాలను వివరించాడు: ముందు ఇద్దరి కళ్ళకూ గంతలు కట్టి ఉంచుతారు. ఇద్దరికీ చెరొక విల్లు, మూడు బాణాలు ఇస్తారు. దూరంగా ఒక పెద్ద గంటను పెడతారు. ఒక సైనికుడు వచ్చి గంటను మ్రోగిస్తాడు. ఇద్దరూ చెరో మూడు బాణాలతో ఆ గంటను కొట్టాలి. ఎవరి మూడు బాణాలూ ఖచ్చితంగా గంటకు తగుల్తాయో, వాళ్ళకే సైన్యాధ్యక్ష పదవి లభిస్తుంది. దీనికి ఒప్పుకొన్నారు ఇద్దరూ. పరీక్షకు సన్నద్ధులై నిలబడ్డారు.

ముందుగా రాజేంద్రుడు వచ్చి నిల్చున్నాడు. గంట మ్రోగగానే మూడు బాణాలనూ వరసగా వదిలాడు. ఆశ్చర్యం, ఆ మూడు బాణాలూ వెళ్ళి, ఒకదాని తర్వాత ఒకటి లక్ష్యానికి తగిలాయి! గంట మూడు సార్లు గణగణలాడింది! ప్రజలందరూ హర్షధ్వానాలు చేశారు. రాజేంద్రుడికే ఆ పదవి లభిస్తుందని చెప్పుకోసాగారు.

తరువాత అమరేంద్రుడు ముందుకు వచ్చాడు. మొదటి బాణం వెళ్ళి సూటిగా గంటకు తగిలింది. రెండవసారీ గురి తప్పలేదు. దీంతో‌ ప్రజల్లో‌ ఉత్కంఠ పెరిగింది- అంతలో అమరేంద్రుడు వదిలిన మూడవబాణం దారి తప్పింది! అది సూటిగా రాజుగారు కూర్చున్న చెట్టువైపుకే వెళ్ళింది! ప్రజలకు ఏం జరుగుతోందో‌ అర్థం‌ కాలేదు. అందరూ ఒక్క పెట్టున అరిచారు.

అమరేంద్రుడు వదిలిన మూడవ బాణం‌ రాజుగారి తలమీదుగా పోయి, ఆయన వెనక ఉన్న చెట్టు మొదలుకు గుచ్చుకున్నది. అటువైపుకు పరుగెత్తిన భటుడొకడు ఆ బాణాన్నీ, దానికి గుచ్చుకొని ఉన్న త్రాచుపామునీ తీసుకొని వచ్చి రాజుగారి చేతిలో పెట్టాడు, "గొప్ప ప్రమాదమే తప్పింది మహారాజా!" అంటూ.

'మూడు బాణాలనూ సరిగా వదిలిన రాజేంద్రుడిదే గెలుపు' అనుకున్నారు దూరంగా ఉన్న ప్రజలందరూ.
రాజుగారు మాత్రం ఆశ్చర్యపోయారు- అమరేంద్రుడిని దగ్గరకు రావించి, అతని కళ్ళకున్న పట్టీలు విప్పించి, "అపాయాన్ని ఎట్లా కనిపెట్టావు?" అని అడిగాడు.

"మహారాజా! నేను మూడో బాణాన్ని వదిలేటప్పుడు మీ వెనకనున్న చెట్టు కొమ్మల్లోంచి ''బుస్!బుస్!" అని చప్పుడొచ్చింది. "అది పాము!" అని నాకు అర్థమైంది. అంతలోనే 'మహారాజుగారు అక్కడే కూర్చున్నారుగదా!? మరెలాగ?' అని నాకు ఆందోళన కలిగింది. వెంటనే 'ఏదైతే అదవుతుంది' అని, నా బాణాన్ని అటువైపుకు మళ్లించాను" అన్నాడు అమరేంద్రుడు, వినమ్రంగా.

రాజుగారు "భళా! సైనికుడన్నవాడికి సునిశితమైన గ్రాహ్య శక్తి అవసరం- సుశిక్షితుడైన సైన్యాధికారి శబ్దాన్ని బట్టి శత్రువు ఎవరన్నది అంచనా వేయగలిగి ఉండాలి. ఈ రెండు శక్తులే కాక, నీలో గొప్ప రాజభక్తి కూడా ఉన్నదని నిరూపించుకున్నావు. అమరేంద్రా, ఇప్పుడు నా ప్రాణాలు కాపాడావు- రేపు మన రాజ్యాన్నీ కాపాడగలవు- సందేహంలేదు" అని పూలహారాన్ని అమరేంద్రుడి మెడలో వేశారు.

ప్రజలందరూ ఆయన నిర్ణయాన్ని ఆమోదిస్తూ హర్షధ్వానాలు చేశారు.