తెల్లవారు జామున, తూరుపు ఆకాశం అప్పుడప్పుడే, అక్కడక్కడా ఎర్రబారుతున్న వేళ, పడమటి దిక్కున మెరుస్తున్న చందమామకు వేసిన నిచ్చెన ఒకటి కనబడింది, ఒక పిల్లవాడికి.

వాడు, వాళ్ళ చెల్లి, పోటీ‌ పడ్డారు- "ఎవరు ముందు పైకెక్కాలి?" అని.

"ఇద్దరం కలిసి ఎక్కుదాం" అనుకునేసరికి రాజీ కుదిరింది.

మొదటి మెట్టు ఎక్కేసరికి చాలా సంతోషం వేసింది వాళ్ళిద్దరికీ. ఏమంటే, పొట్టిగా- రాజు అంత- ఉండే పిల్లలు, ఇప్పుడు సురేష్ అంత పెద్దగా అయ్యారు! కుండీల్లో ఏపుగా పెరిగిన మొక్కలు కూడా ఇప్పుడు వాళ్ళ కాళ్ళకంటే తక్కువ ఎత్తులో ఉన్నాయి! అట్లా మెట్టెక్కి చూస్తూంటే "మేం చాలా గొప్పవాళ్ళం!" అనిపించింది వాళ్ళకు. ఆ సంతోషంలో‌ అటూ‌ ఇటూ చూస్తూ మురిసిపోయారు.

వాళ్ళు రెండో మెట్టు ఎక్కేసరికి ఇంకొంచెం‌ తెల్లవారింది- పొద్దు పొడుపులో చందమామ తెలవెలపోవటం మొదలుపెట్టాడు. మొదటి మెట్టు కంటే రెండో‌మెట్టు చాలా బాగుంది. "మేం చూడండి- ఎంత ఎత్తులో ఉన్నామో!" అరిచాడు పిల్లవాడు. "అప్పుడే రెండో‌ మెట్టు ఎక్కేశాం!" ఉత్సాహపడింది చెల్లి. వాళ్ల అమ్మా-నాన్న, అక్కలు, అన్నలు వచ్చి చూశారు- చుట్టూ‌ చేరారు. "బలే ఎక్కారు, ఇంకో మెట్టు ఎక్కండి, ఇంకా పైకి!" అన్నారు ప్రోత్సహిస్తూ.

అక్కడ నిలబడి చూస్తుంటే భలే ఉంది. పిల్లలిద్దరి కాళ్ళూ క్రింద నిలబడ్డ వాళ్ళ భుజాలంత ఎత్తులో ఉన్నై. వాళ్ళ తలలైతే పెద్దల్ని మించిపోయినై! "చూశావామ్మా, మేం‌ ఎంత పెద్ద నిచ్చెన వేశామో, ఆకాశానికి!?" అన్నాడు పిల్లవాడు. "తప్పు నాన్నా! ఇది మీరు వేసిన నిచ్చెన కాదు. చందమామ తనంతట తాను, 'రండి, రండి- చేరుకోండి' అని ఏనాడో వేసిపెట్టిన నిచ్చెన అది. మీకంటే ముందు చాలామంది వెంకట్రావులూ, మంగాదేవులూ, శివరాములూ, బాపూ-రమణలూ, జేజిమామయ్యలూ, నామినులూ ఎక్కేశారు దాన్ని. ఇప్పుడు మీవంతు. ఇట్లా చెబుతున్నానని చిన్నబుచ్చుకోకండి- మీరు పైకి చూశారంటే దూరంగా ఎక్కడో వాళ్ళలో కొందరి పాదాలు కనబడతై, నిజంగానే. వీలైతే వెళ్ళి వాళ్లని పట్టుకొని నమస్కారాలు పెట్టుకోండి. ప్రయాణంలో వాళ్ళకి ఏమేం కనబడ్డాయో తెలుసుకోండి" చెప్పింది అమ్మ.

పిల్లలిద్దరూ పైకి చూస్తే నిజంగానే చాలా పాదాలు కనబడ్డాయి. "వీళ్ళంతా ఇంతసేపూ ఎందుకు కనబడలేదు?" ఆశ్చర్యపోయాడు పిల్లవాడు. "నీకే, కనబడనిది! నేనైతే వాళ్ళందర్నీ ముందే చూసేశాను" గర్వంగా చెప్పింది చెల్లి.

మెల్లిగా ఇద్దరూ మూడో మెట్టు ఎక్కారు. ఎక్కింది మూడు మెట్లే, ఇంకా నిచ్చెన చాలా చాలా ఎత్తుగా, అనంత ఆకాశంలోకి పోతున్నది. "నిజమే! ఈ దారంతా వేరేవాళ్ళు చాలా మంది తయారు చేసి పెట్టారు. ఇంత మంచి నిచ్చెనను మనంతట మనం వేయగలిగే వాళ్ళం కాదు" అన్నాడు పిల్లవాడు, పైకి చూస్తూ.

"ఇటు చూడు, ఎంతమంది పిల్లలు వచ్చారో!" అన్నది చెల్లి, చుట్టూ చూస్తూ. నిజంగానే నిచ్చెన చుట్టూ ఒక ఐదారు వందలమంది పిల్లలూ, వాళ్ల అమ్మా నాన్నలూ, టీచర్లూ గుమిగూడి ఉన్నారు. అందరూ ఉత్సాహంగా చేతులు ఊపారు. "ఇంకా పైకి పోండి, పైకెక్కండి. ఏమైనా సాయం కావాలంటే అడగండి" అని అరిచారు.

"పైన ఎవరెవరో కనబడుతున్నారు గానీ, నిచ్చెనకు మొదట్లో ఎవరూ ఉన్నట్లు లేరు. మీరూ వచ్చెయ్యండి, మూడు మెట్లేగా!? త్వరత్వరగా వచ్చి చేరుకోవచ్చు- ఆపైన అందరం‌కలిసి ఎక్కుదాం!" అని క్రిందికి చేతులు చాపారు పిల్లలిద్దరూ.

చాలామంది పిల్లలు "మేం వస్తున్నాం, ఆగండి! మేమొస్తున్నాం!" అని అరుస్తూ గందరగోళంగా నిచ్చెననెక్కటం మొదలుపెట్టారు.

వాళ్ళందరి బరువునూ‌మోస్తున్న నిచ్చెన సంతోషంగా ఊగింది. ముందే పైకెక్కేసినవాళ్ళు ఓసారి క్రిందికి చూసి నవ్వారు మురిపెంగా.

కొత్తపల్లి పత్రిక ఇప్పుడు నాలుగో‌ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. మూడేళ్ళుగా దీన్ని ఆదరించి, ప్రోత్సహించి, వెంటనడుస్తున్నవాళ్లకూ, దారి చూపిస్తున్న పెద్దలకూ అందరికీ కృతజ్ఞతాభివందనాలు.

-కొత్తపల్లి బృందం.