ఒక ఊళ్ళో రంగయ్య అనే రైతు ఉండేవాడు. చాలా కష్టపడి పొలంపని చేసేవాడు అతను. అతని భార్య సుభద్రమ్మ కూడా అతనికి బాగా సాయం చేసేది. నాట్లు వేయడం, కలుపు తీయడం, పైరు కోసుకొని ఇంటికి మోసుకొని రావడం- అన్ని పనులూ ఇద్దరే చేసుకునేవారు.
'ఎలాగో ఒకలాగా కష్టపడి డబ్బు సమకూర్చుకొని, మంచి కాడెద్దులు కొనుక్కోవాలి' అని కలగనేవాళ్ళు వాళ్ళు. కొన్నాళ్ళకు తగినంత డబ్బు సమకూరింది. "ఇక ఎద్దులు కొనుక్కుందాం" అని రంగయ్య సంతకు బయలుదేరాడు.
మంచి ఎద్దుల జత కోసం సంతంతా కలయ తిరుగుతుండగా ఒక చోట మంచి బలమైన ఎద్దులు కనిపించాయి. వాటి యజమాని సోమయ్య పచ్చి మోసగాడు. అది తెలీదు కదా, రంగయ్యకు? ఆ ఎద్దులనే బేరం చేసి కొనుక్కున్నాడు. ఎద్దులను తోలుకొని మెల్లగా ఊరు చేరుకున్నాడు.
రంగయ్య ఎద్దుల్ని చూసి ఆ ఊరి జనం అంతా "బాగున్నాయి" అని మెచ్చుకున్నారు. సుభద్రమ్మ ఎదురు వచ్చి, ఎద్దులకు హారతి ఇచ్చింది. వాటికి దిష్టి తగలకుండా ఉండేందుకుగాను తన చీర కొంగును సన్నగా చించి, రెండు ఎద్దుల ఎడమ కాళ్ళకూ కట్టింది.
"వాటికి బలమైన తిండి పెట్టాలి- అందుకోసం ఇద్దరం ఇంకా బాగా కష్టపడాలి" అనుకుంటూ సంతోషంగా ఆ రాత్రి నిద్రపోయారు ఇద్దరూ. ఉదయాన్నే లేచి రంగయ్య కొట్టంలోకి వెళ్ళి చూస్తే ఏముంది? అక్కడ ఎద్దులు లేవు! కట్టుత్రాళ్ళను తెంపుకొని ఎద్దులు రెండూ పారిపోయాయి!
రంగయ్యకు గుండె ఆగినంత పని అయ్యింది. భార్యాభర్తలు ఇద్దరూ చుట్టు ప్రక్కల వాళ్లను అడిగారు; ఊరి పొలాల్లో వెతికారు- లాభం లేదు- ఎద్దులు దొరకనే లేదు! ఆ సరికి బాగా పొద్దెక్కింది. ఏం చేయాలో పాలు పోలేదు ఇద్దరికీ. "అమ్మిన వాడి దగ్గరికే వెళ్ళి ఉంటాయి చూడండి" అన్నారు అందరూ.
అయితే సోమయ్య ఏ ఊరి వాడో రంగయ్యకు గుర్తురాలేదు! 'సంత దగ్గర విచారిస్తే ఏమైనా తెలుస్తుందేమో' అని రంగయ్య, సుభద్రమ్మ ఇద్దరూ సంతకి బయలుదేరారు. సంతలో ఎవరిని అడిగినా 'తెలియదు' అనే అన్నారు!
దిగులుతో బిక్క చచ్చిపోయి సంతంతా కలయ తిరుగుతున్న రంగయ్య- సుభద్రమ్మలకు ఒకచోట ఎద్దులతోపాటు నిలబడి కనబడ్డాడు, సోమయ్య! ఇప్పుడు ఆ ఎద్దుల కొమ్ములకు వేరే రంగు వేసి ఉంది- అయితే వాటి కాళ్ళకు తాము కట్టిన దిష్టి దారాలు ఇంకా అలానే ఉన్నై!
ఇద్దరూ పరుగున అక్కడికి చేరి సోమయ్యను నిలదీశారు. విషయం ఇంకా చెప్పకనే సోమయ్య – "భలేవాళ్ళే! ఇవి వేరే ఎద్దులు! మీరు కొనుక్కున్నవి నా దగ్గరెందుకు ఉంటాయి? పారిపోయి ఏ చేలల్లో పడి మేస్తున్నాయో వెతుక్కోండి!" అని దబాయించాడు.
జనం గుమిగూడారు. రంగయ్య, సుభద్రమ్మ అందరితోటీ మొరపెట్టు-కుంటున్నారు. కొంతమంది అటువైపు, కొంతమంది ఇటువైపు మాట్లాడుతు-న్నారు. రంగయ్య సుభద్రమ్మ చెవిలో చెప్పాడు- గ్రామాధికారిని పిలుచుకు రమ్మని. ఆమె గుంపులో నుంచి బయటపడి పరుగున గ్రామాధికారి దగ్గరకు వెళ్ళి ఫిర్యాదు చేసింది. ఆయనను వెంట-బెట్టుకొని వచ్చింది. సంతలోని జనం ముందు ఆయన విచారణ మొదలు పెట్టాడు. సోమయ్య బుకాయిస్తూనే ఉన్నాడు; రంగయ్య-సుభద్రమ్మల దగ్గరేమో సరైన సాక్ష్యం లేదు!
"నా చీర కొంగును చింపి, పీలికలు ఎద్దుల కాళ్ళకు కట్టాను- కావాలంటే ఆ చీరను తెచ్చి చూపిస్తాను. మా ఊళ్ళో ఈ ఎద్దుల్ని చూసిన వాళ్ళను కొందరిని సాక్ష్యానికి తీసుకు వస్తాను. ఈ ఎద్దులు మావే, నమ్మండి" అని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నది సుభద్రమ్మ. గ్రామాధికారికీ అది సరయిన పని అనిపించింది. “ఈరోజు చీకటి పడింది కనుక ఎద్దులను మా కొట్టంలో కట్టేసి అందరూ ఇళ్ళకు పోండి. విచారణను రేపు కొనసాగిస్తాం" అన్నాడాయన.
రంగయ్యకు ఆ సరికి అర్థం అయిపోయింది- "ఆ ఎద్దులు దొంగవి! ఎక్కడ వదిలినా సరే, రాత్రిపూట కట్టుత్రాళ్ళు తెంపుకొని అవి సోమయ్య ఇంటికి చేరుతాయి! అలా వాటికి శిక్షణ ఇచ్చి ఉంచాడు సోమయ్య!” అందుకని సాక్ష్యాలకోసం సుభద్రమ్మని ఇంటికి పంపి, తను మాత్రం ఆ రాత్రంతా గ్రామాధికారి కొట్టం ముందే కాపలా కాశాడు, రంగయ్య.
అర్థరాత్రి అయింది- ఎద్దులు తమ అలవాటు ప్రకారం తాళ్ళు ఊడబెరుక్కుని సోమయ్య ఊరి దారి పట్టాయి. రంగయ్య వాటిని ఏమీ అనలేదు- ఊరికే అనుసరిస్తూ వెళ్ళాడు. అవి నేరుగా సోమయ్య కొట్టం ముందుకు చేరాయి. అక్కడ వాటి కోసమే ఎదురు చూస్తున్నాడు, సోమయ్య. వాటిని పట్టుకొని కొట్టంలోకి తీసుకెళ్ళాడు. గుడ్డి దీపం వెలుగులో అప్పటికప్పుడే వాటి కొమ్ములను సగానికి కోసి పడేశాడు. ప్రక్కనే ఉన్న రంగు డబ్బాలని తీసి కొమ్ములకు కొత్తగా వేరే రంగు వేశాడు. వాటి కాళ్ళకు సుభద్రమ్మ కట్టిన పీలికలను విప్పేసాడు. ఇప్పుడు గిట్టలకు కూడా రంగు వేశాడు; తోకలకున్న వెంట్రుకలను పూర్తిగా గొరిగేశాడు.
చాటుగా నక్కి ఇదంతా చూశాడు రంగయ్య. నిశ్శబ్దంగా వెనక్కు తిరిగి వెళ్ళాడు. గ్రామాధికారిని నిద్రలేపి, తను చూసిందంతా వివరించాడు.
గ్రామాధికారి వెంటనే తన మనుష్యులతో పాటు బయలుదేరి వెళ్ళాడు. సోమయ్యను బంధించి న్యాయస్థానానికి అప్పగించాడు. మోసకారి సోమయ్యను పట్టించినందుకు రంగయ్య దంపతులను అభినందించాడు.
గ్రామాధికారికి ధన్యవాదాలు తెలుపుకుని తన ఎద్దులను తన ఇంటికి తెచ్చుకున్నాడు రంగయ్య! తెలివిగాను, ఓపికతోటీ గొడవ చెయ్యకపోతే అతని ఎద్దులు అతనికి దొరికేవి కావు!