ఒక అడవిలో‌ ఒక కుందేలు నివసిస్తూ ఉండేది. అదే అడవిలో‌ క సింహం కూడా నివసించేది. ఆ సింహం చాలా చెడ్డది. అది రోజుకి మూడు జింకలనూ, ఒక కుందేలు గుంపునూ తినేస్తూ‌ వచ్చింది. దానికి భయపడి అనేక జంతువులు అడవిని విడిచిపెట్టి పారిపోయాయి. అలా అడవిలోని జంతువులు చాలా తగ్గి పోయాయి.

కుందేలుకి ఈ విషయం తెలిసి ఒక ఉపాయం ఆలోచించింది. వెంటనే సింహం ఉన్న గుహకు వెళ్ళి, ఆ గుహముందే ఆడుకోవటం మొదలు పెట్టింది.

సింహానికి కుందేలును చూడగానే నోట్లో నీళ్ళూరాయి . కుందేలు దగ్గరికి మెల్ల మెల్లగా నడవటం మొదలు పెట్టింది.

కుందేలు సింహం రాకను గమనించి అటువైపు తిరిగింది- "సింహంగారూ! ఇప్పుడు మీరు నన్ను చంపుతారని నాకు తెలుసు. కానీ‌ మీరు కూడా ఎప్పుడో‌ ఒకప్పుడు చావటం ఖాయం- మిమ్మల్ని చాలా జంతువులు చంపగలవు- ఏనుగు చంపగలదు; దున్నపోతు చంపగలదు; అలా కాకపోతే మీరు మనిషి చేతుల్లోనే పడచ్చు- వాళ్ళు మిమ్మల్ని ఈ అడవినుండి బందీగా తీసుకెళ్ళి ఏ జూలో పెట్టి మేపటమో, లేకపోతే ఏ సర్కస్‌లోలోనో పెట్టి, హింసించి ఆటలాడించటమో చేస్తారు! ఏదో ఒకలాగా మీరూ కష్టపడి చావాల్సిందే!" అన్నది.

"ఓసోస్! ఆ ఆపదలన్నీ వచ్చినప్పుడు చూసుకుందాంలే. ఈరోజున మాత్రం నేను నిన్ను తినటం ఖాయం" అని సింహం‌ గర్జించింది.

కుందేలు ఏమీ భయపడలేదు- "సరే, సింహం! నువ్వు ఇప్పుడు నన్ను చంపు. భవిష్యత్తులో‌ నేను సింహంగానూ, నువ్వు కుందేలుగానూ పుడతాం గదా, అప్పుడు నా పగ నేను తీర్చుకుంటాను!" అని తనే సింహాన్ని భయపెట్టింది.

సింహం కొద్దిగా వెనకంజ వేసింది- వెంటనే ఆ కుందేలు "చంపూ! నన్ను చంపూ!" అని దాని మీదికే వెళ్ళటం‌ మొదలు పెట్టింది. ఆరోజున అక్కడినుండి పారిపోయిన సింహం మళ్ళీ‌ఆ అడవికి తిరిగి రాలేదు!

అడవిని వదిలిపెట్టి పోయిన జంతువులన్నీ‌ మెల్లగా తిరిగి వచ్చాయి. సింహాన్ని పారద్రోలినందుకు కుందేలుకు కృతజ్ఞతలు చెప్పాయి.