ఎంత చిత్రం ఎంత చిత్రం
చూడగా ఈ వసంతం (2)
కనుల ముందే కాలచక్రం
కదలిపోవుట-
"ఎంత చిత్రం ఎంత చిత్రం"
చినుకు ఒక్కటి పడకనే
చివురు తొడిగే మ్రోడులు
మంత్ర జలములు చల్లినటుల
మారె పచ్చగ ప్రకృతంతా-
"ఎంత చిత్రం ఎంత చిత్రం"
నెలలుగా బోసిపోయిన
గున్నమావులు కొమ్మ కొమ్మకు
కోసుకోమని మాయగా
వేల కాయలు వ్రేలాడుట-
"ఎంత చిత్రం ఎంత చిత్రం"
గొంగళీలే రంగురంగుల
సీతాకోక చిలుకలై
తీరినటుల శాపకాలం
తిరుగుతూ కనువిందు చేయుట-
"ఎంత చిత్రం ఎంత చిత్రం"