కోణాపురంలో తరుణ్, తనూజ్‌ల ఇళ్ళు ప్రక్క ప్రక్కనే ఉండేవి. ఇద్దరి అమ్మానాన్నలూ కూలి పనికి పోయేవాళ్ళు. అంతా కలిసి మెలిసి ఉండేవాళ్ళు. పిల్లలిద్దరిదీ‌, ఒకే స్కూలు, ఒకే తరగతి- తరుణ్‌కు బడికి వెళ్ళటం అంటే ఇష్టం- కానీ తనూజ్‌కు మాత్రం బడి అంటే అస్సలు ఇష్టం లేదు.

వాడు అసలు సరిగ్గా బడికే వెళ్ళేవాడు కాదు. అయిష్టంగా పాఠాలు విని, అస్సలు చదవకుండా, రోజూ తిట్లు తినేవాడు. ఎప్పుడూ తక్కువ మార్కులే వచ్చేవి వాడికి.

కానీ వాడికి పాటలంటే మాత్రం చాలా ఇష్టం. ఎప్పుడూ ఏవో‌ కూనిరాగాలు తీస్తూ ఉండేవాడు. 'ఈ పాటల పిచ్చిలో నీ చదువులన్నీ‌ చట్టు బండలౌతున్నాయి చూడు" అని వాళ్ళ అమ్మానాన్నలు అరిచేవాళ్ళు. అయినా వాడు పట్టించు-కునేవాడు కాదు.

ఒకసారి పాటలు పాడే కళాకారుల బృందం ఒకటి కోణాపురం వచ్చింది. ఊళ్ళోని యువకులు చాలామంది ఆ పాటలు వినటానికి వెళ్ళారు. వాళ్లందరితో పాటూ తనూజ్ కూడా వెళ్ళాడు. అటు తర్వాత ఆ బృందం వాళ్ళు కోణాపురంలో కార్యక్రమం ముగించుకొని వేరే ఊరికి బయలుదేరేటప్పుడు, తనూజ్ కూడా వాళ్ళతోపాటు బయలుదేరి వెళ్ళి-పోయాడు- ఇంట్లో ఎవ్వరికీ ఏమీ చెప్పకుండానే!

తనూజ్ అమ్మానాన్నలు వాడికోసం ఊరంతా వెతికారు; కనబడినా వాళ్లనల్లా అడిగారు- చివరికి వాడిని గాయకుల బృందంతో‌ చూసిన వాళ్ళెవరో చెబితే, పొరుగూరు వెళ్ళి తనూజ్‌ను వెంటబెట్టుకొని వచ్చారు. వాడిని బాగా చీవాట్లు పెట్టారు- ఎంత తిట్టినా వాడు వెక్కి- వెక్కి ఏడ్చాడు తప్పితే, తన తప్పును మాత్రం ఒప్పుకోలేదు.

చివరికి వాళ్ల నాన్న వాడిని దగ్గరకు తీసుకొని, "ఒరే! నీ సమస్య ఏమిటిరా? నీకు బడి అంటే ఇష్టం‌ ఉన్నట్లు లేదే? మార్కులు కూడా తక్కువ వస్తుంటాయి- ఎందుకు? చెప్పు" అని నెమ్మదిగా, ప్రేమగా అడిగాడు.

"నాకు బడికి పోవటం ఇష్టం లేదు- పాటలంటేనే ఇష్టం" అన్నాడు తనూజ్, ఏడుస్తూ.

అప్పుడు వాళ్ల నాన్న వాడిని బుజ్జగిస్తూ "బాబూ! నువ్వు బడికి వెళ్ళు; ప్రతిరోజూ సాయంత్రంపూట నీకు ఇష్టమైన సంగీతాన్ని నేర్పించే బాధ్యత నాది- సరేనా?" అన్నాడు.

ఆరోజే ఆయన తనూజ్‌ను సంగీతం నేర్పే గురువుగారి దగ్గరికి తీసుకెళ్ళాడు. తనూజ్‌కు పాటలంటే ఉన్న ఇష్టాన్ని గుర్తించి ఆయన వాడిని శిష్యుడిగా చేర్చుకున్నారు. ఆనాటినుండీ ప్రతిరోజూ తనూజ్ ఉదయం బడికి; సాయంత్రం బడి నుండి రాగానే సంగీతం నేర్చుకోటానికి- వెళ్ళటం మొదలు పెట్టాడు.

ఆశ్చర్యం! ఒకసారి సంగీతానికి వెళ్ళటం మొదలు పెట్టాడో, లేదో, వాడు చదువుల్లోనూ రాణించటం మొదలు పెట్టాడు! ఇప్పుడు వాడికీ బడి అంటే ఇష్టం ఏర్పడింది. తరుణ్‌తో సమానంగా మార్కులు తెచ్చుకోసాగాడు!

కాలక్రమంలో తరుణ్, తనూజ్ ఇద్దరూ ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. ఇప్పుడు తనూజ్ పిల్లలకు చదువులతోపాటు సంగీతాన్నీ‌ నేర్పిస్తున్నాడు. పాటలు మాధ్యమాలుగా తనూజ్ నేర్పే విషయాలు అందరు పిల్లలకూ సులభంగా అర్థమౌతున్నాయి. "పాట-ఆట చదువులకు ఆటంకాలు కావు- వాటివల్ల చదువులూ సుసంపన్నం అవుతాయి. దానికి నేనే మంచి ఉదాహరణ" అని అందరికీ చెబుతుంటాడు తనూజ్!