అనగనగా ఒక రాజ్యంలో చాలామంది సోమరిపోతులు ఉండేవాళ్ళు. ఆ రాజ్యపు రాజధానిలో గొప్ప రాచబాట ఒకటి ఉండేది. ప్రజలందరూ కలుసుకునేది ఆ బజారులోనే. సోమరిపోతులందరూ ఒక ప్రక్కన గుంపులు గుంపులుగా నిలబడి చోద్యం చూస్తుంటే, మిగతా వాళ్ళు కొందరు హడావిడిగా నడుస్తూంటే, అందరూ నవ్వుకుంటూ, మాట్లాడుకుంటూ సమయాన్ని వృధా చేస్తుండేవాళ్ళు.
ఆ రాజ్యపు రాజు, పాపం చాలా మంచివాడు- తన ప్రజలు ఇట్లా సోమరిపోతులుగా ఉండటం అతనికి నచ్చేది కాదు. వాళ్ళని ఎలాగైనా సరే, సరైన దారికి తేవాలని తపించేవాడు. ఒకరోజు రాత్రి, మారువేషం వేసుకొని, ఒక చెట్టు నీడన ఊరికే కూర్చున్నాడు, తన ప్రజల్ని గమనిస్తూ. అర్థరాత్రి దాటిన తర్వాత, ఎవరూ లేని సమయం చూసుకొని, రహదారి మధ్యలో ఒక పెద్ద గుంత త్రవ్వాడు. ఆ గుంతలో బంగారం, వజ్రాలు, వైఢూర్యాలు వేసాడు. దగ్గరలోనే ఉన్న ఒక పెద్ద బండరాయిని మోసుకొచ్చి, ఆ గుంతను కప్పిపెట్టి, నేరుగా తన భవనానికి వెళ్ళిపోయాడు.
తెల్లవారు జామున ఆ ప్రదేశాన్ని గమనించటం కోసం కొందరు సైనికులను నియోగించాడు. మెల్లగా తెల్లవారింది.
రాయి రోడ్డు మధ్యలో అందరికీ అడ్డంగా ఉంది. ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది కూడాను. అందరూ ఇబ్బంది పడుతున్నారు గాని, ఒక్కరు కూడా ఆ రాయిని ప్రక్కకు తొలగించటం లేదు. కొందరు సోమరిపోతులైతే, ఏకంగా ఆ రాయి మీదే కూర్చొని ముచ్చట్లు చెప్పుకోవటం మొదలు పెట్టారు. వాహనాల వాళ్ళు దాన్ని తప్పించుకొని అటూ ఇటూ తిరుక్కుంటూ పోసాగారు.
సాయంత్రం కావస్తున్నది- రోడ్డు మీద జనాల గుంపులు మెల్లగా ఇళ్ళకు కదులుతున్నాయి. రాయికి దగ్గర్లోనే గుగ్గిళ్ళు అమ్ముకునే ఒక ముసలితాత ముందుకు వచ్చాడు. ప్రజలందరికీ ఇబ్బందికరంగా మారిన ఆ రాతిని తొలగించేందుకు పూనుకున్నాడు. రాయి చాలా బరువుగా ఉన్నది. దాన్ని ఎత్తటం చాలా కష్టం అయ్యింది. కానీ తాత చాలా శ్రమపడి, రాతిని ప్రక్కకు జరిపి చూస్తే ఏముంది?!- వజ్రాలు, బంగారం దొరికాయి. అతని సంతోషం అంతా ఇంతా కాదు.
దీన్నంతా గమనిస్తున్న రాజభటులు ఆ సమాచారాన్ని వెంటనే రాజుకు చేరవేశారు. రాజుగారు స్వయంగా వచ్చి, ముసలి తాతను అభినందించారు. "పదిమందికీ పనికొచ్చే పనుల్లో కష్టం ఉంటుంది. ఆ కష్టానికి వెరవకుండాపనిచేస్తే ఆనందం మన సొంతం అవుతుంది. ఈ తాత చేసిన పనిని మనం అందరం చేయచ్చు. మన సోమరి తనాన్ని వదిలించుకుంటే, సమయాన్ని సద్వినియోగం చేస్తే అందరికీ మేలు జరుగుతుంది" అని రాజుగారు చెప్పిన మాటలు సోమరిపోతుల కళ్ళు తెరిపించాయి. నిజంగానే కష్టానికి ఫలితం ఆనందం.