ఒక ఊరిలో ఒక తల్లి, తండ్రి, కొడుకు ఉండేవాళ్ళు . వాళ్ళకు గొర్రెలు, ఎద్దులు, బండి, బావి, తోట ఉండేటివి.

ఒక రోజు వాళ్ల నాన్నకు పక్క ఊరిలో కొంచెం పని పడింది. ఆయన అప్పుడు కొడుకును పిలిచి "నాయనా! నాకు ప్రక్క ఊరిలో కొంచెం పని ఉంది. నేను వెళ్తున్నాను; ఈ రోజు నువ్వు బడికి పోకుండా గొర్రెలు తోలుకపో. మళ్ళీ నేను తొందరగా వచ్చేస్తాను - కొద్ది సేపు పోయిరా నాయనా దయచేసి!" అని చెప్తాడు.

వాడు 'సరే' అంటే, అప్పుడు వాళ్ళ అమ్మ ఆ పిల్లవాడికి పెసల్లు వేయించి ఇచ్చి గొర్రెలలోకి పంపించింది.

ఆ‌పిల్లవాడు గొర్రెలను ఒక చెట్టు కిందికి తోలి, తను ఒక గుండు మీద కూర్చొని ఆ పెసల్లు తినటం మొదలుపెట్టాడు. "కరమ్.., కరమ్.." అని నములుతున్నాడు పెసల్ని- గొర్రెలు కూడా అలాగే నములుతున్నాయి తుమ్మకాయల్ని. అది వినగానే ఆ పిల్లవాడికి కోపం వచ్చేసింది- "ఆఁ, ఎంత పొగరు! నేను ఎట్లా తింటే మీరూ అలా తింటారా?! నన్ను ఎగతాళి చేయటం తప్ప మీకు వేరే పనేమీ‌ లేదా?" అని చిలుకకొడవలితో గొర్రెలను అన్నింటిని నరికేశాడు.

వాళ్ళ నాన్న వచ్చి అదంతా చూసి నెత్తీ నోరూ బాదుకున్నాడు- "ఎందుకురా, ఇట్లా చేశావు? నీకు ఏమన్నా తిన్నది అరగలేదా, ఈ పని చేశావు? గొర్రెలన్నీ పోగొట్టుకొని ఇంక ఎట్లారా బ్రతికేది? ఇకమీద నువ్వు ఎక్కడికీ పోనక్కర్లేదు. ఇంటి దగ్గర ఉండు!" అని బాగా తిట్టాడు. అప్పటినుండీ వాడికి ఒక్కడికే ఏ పనీ చెప్పటం మానుకున్నారు వాళ్ళు.

ఇలా ఉండగా, ఒకరోజున ఆ పిల్లవాడిని ఒక్కడినే ఇంటి దగ్గర వదిలి , బావి దగ్గరకు వెళ్ళారు వాళ్ళ అమ్మానాన్నలు. వాడు కులాసాగా కొంచెంసేపు పడుకుందామనుకున్నాడు. వాళ్ళ ఇంటికి, పక్క ఇంటికి మధ్య ఖాళీ స్థలం ఉంది. ఆ స్థలంలో మంచం వేసుకొని పడుకున్నాడు.

అంతలో పక్క ఇంటి నుండి ఒక ఎలుక బయటికి వచ్చింది- వీడు పడుకొని దాన్నే చూస్తూ- "నువ్వు మాయింట్లోకి రా, నీ పని చెబుతాను!" అని బెదిరించాడు దాన్ని. అంతలోనే అది పరుగెత్తి వాళ్ళ ఇంటిలోకే దూరింది!

అప్పుడు ఆ పిల్లవాడు "ఆఁ! ఎంత ధైర్యం నీకు!? నేను ఇక్కడ ఉండగానే మా ఇంటిలో దూరతావా?" అని అరుస్తూ దాని వెంట పడ్డాడు. ఇల్లంతా గాలించైనా సరే, ఆ ఎలుకను పట్టుకొని చంపాలనుకున్నాడు. కానీ ఎటు పోయిందో, ఏమో- ఎంత వెతికినా ఆ ఎలుక మాత్రం కనబడలేదు.

వాడికి చాలా కోపం వచ్చింది. "నిన్ను ఎట్లా బయటికి రప్పించాలో నాకూ‌తెలుసు-" అని, ఒక అగ్గిపెట్టెను తీసుకొచ్చి తమ ఇంటికి తనే నిప్పు అంటించాడు.

ఆ సమయానికి గాలి బాగా వీస్తూండటంతో పక్క వాళ్ళ ఇల్లుకూడా అంటుకున్నది. వీధిలోని జనాలంతా అరుస్తూ ఆ మంటల్ని ఆపటానికి విశ్వప్రయత్నం చేస్తుంటే వీడు మాత్రం భయపడి, ముడుచుకొని పడుకుండిపోతాడు. సంగతి తెలిసి హడావిడిగా పరుగెత్తుకొచ్చారు వాళ్ల అమ్మ-నాన్న. ఆసరికి ఇల్లంతా బాగానే కాలి బూడిదైంది. "ఎందుకైందిరా ఇట్లాగ? నువ్వేమైనా చేశావా?" అని అడిగితే "నేనే అంటించాను- లేకపోతే పక్కింటి వాళ్ళ ఎలుక మనింట్లోకి ఎందుకట, వచ్చేది?" అన్నాడు వాడు. తల్లీ తండ్రీ నెత్తీ నోరూ కొట్టుకున్నారు. తండ్రి "వీడిని ఇంట్లోంచి పంపించేద్దాం" అన్నాడు, గానీ తల్లి ఒప్పుకోలేదు. "మరొక్క అవకాశం ఇచ్చి చూద్దాం" అని నచ్చ చెప్పింది.

తరువాత కొన్ని రోజులకు ఎప్పటిలాగానే తల్లి, తండ్రి ఇంట్లో‌ అన్నం వండిపెట్టి, చేనుకు వెళ్ళారు. పని చేస్తూ ఉంటే మధ్యాహ్నం అయ్యింది. మూడు ముద్దలు అన్నం తీసుకురమ్మని కబురు పంపారు కొడుక్కు. అప్పుడు ఆ పిల్లవాడు బువ్వ తీసుకొని, ఎద్దుల బండి కట్టుకొని బయలు దేరాడు.

ఆ బండి బాగా పాతది. అది నడుస్తుంటే "కిర్..,కిర్.." అని శబ్దం వస్తున్నది. పిల్లవాడు కొంచెం సేపటికి గానీ ఆ శబ్దాన్ని గమనించలేదు. ఆ తర్వాత "పాపం! ఈ బండికి చాలా ఆకలిగా వున్నది- అందుకనే కిర్..కిర్ అని మొత్తుకుంటున్నది" అని బండి చక్రం ఇరుసులో ఒక ముద్దను వేసి నడుపుకుంటూ‌ పోయాడు. కొంచెం సేపు ఊరుకున్న బండి, మళ్ళీ "కిర్..కిర్.."మనటం మొదలు పెట్టింది. "ఇంకా ఆకలి అవుతున్నట్లుంది" అని మరో ముద్ద కూడా వేశాడు పిల్లవాడు. కొంచెం సేపు ఊరికే ఉందిగానీ, బండి మళ్ళీ "కిర్..కిర్..కిర్" మనటం మొదలు పెట్టింది.

"పాపం ఈ బండికి దాహం అవుతున్నట్లుంది. నీళ్ళు కావాలేమో!" అనుకొని, పశువుల్ని విప్పి, బండిని చెరువులోకి తోశాడు పిల్లవాడు. "దప్పికతీరాక బండి వెనక్కి వస్తుందిలే" అని వాడు పశువులతోబాటు ఒక చెట్టు క్రింద కూర్చున్నాడు.

అంతలో ఆ చెట్టు మీద వాడికొక చక్కని పిట్ట కనబడింది. దానిని పట్టుకుందామనుకున్నాడు వాడు. కానీ చేతిలో‌ పశువుల ముకుత్రాళ్ళు ఉన్నవాయె! మరెలాగ? అందుకని వాటిని పట్టుకొనే చెట్టెక్కటం మొదలు పెట్టాడు వాడు. క్రిందనున్న పశువులు పైకి ఎలా వస్తాయి? అవి వాడిని వెనక్కి లాగటం మొదలు పెట్టాయి. వాడికి కోపం వచ్చి మరింత గట్టిగా లాగాడు త్రాళ్ళను. చివరికి ఆ పెనుగులాటలో త్రాళ్ళు కాస్తా తెగిపోయాయి: పశువులూ పారిపోయాయి; బండి కాస్తా చెరువు పాలైంది.

ఇక తట్టుకోలేకపోయాడు, వాళ్ళ నాన్న. "నువ్వు ముందు ఈ ఇల్లు వదిలి పెట్టి పో! సొంతగా ఏమైనా సంపాదించేంత వరకూ‌ఇంటికి రాకు! బాధ్యత తెలియని వాడు పెద్దవాడెట్లా అవుతాడు?" అని వాడిని ఇంట్లోంచి బయటికి పంపించేశాడు.

వాడి ప్రార్థన అయ్యాక పిల్లవాడు దిగులుగా ఏడుస్తూ పోతూంటే పాడుబడ్డ గుడి ఒకటి కనబడింది. ఆ గుడిలో విగ్రహం ముందు చేతులు కట్టుకొని నిలబడి ఉన్నాడు- ఒక దొంగ. వాడు భక్తితో కళ్ళు మూసుకొని దేవతకు చెబుతున్నాడు- "తల్లీ! నీ దయవల్లనే నాకు ప్రతిరోజూ నాకు డబ్బులు , నగలు, బంగారం , వెండి అన్నీ దొరుకుతున్నాయి" అని.

పిల్లవాడు ఆ దొంగ దగ్గరకు వెళ్ళి, "అన్నా! మా అమ్మ-నాన్న నన్ను ఇంట్లోంచి పంపించేసారు. నాకు ఇప్పుడు తినేందుకు కూడా ఏమీ లేదు. నేను కూడా నీతోనే ఉంటూ అవీ ఇవీ చేసి పెడతాను- నాకు కడుపునిండా అన్నం‌ పెట్టు, చాలు" అని ప్రాధేయపడ్డాడు. దొంగ కొంచెం సేపు ఆలోచించాడు- 'తనతోబాటు ఒక పిల్లవాడిని ఉంచుకుంటే అనుకూలంగా ఉంటుందిగదా' అని, సరేనన్నాడు. ఇక ఆ పిల్లవాడు దొంగతో కలిసి ఒక ఇంట్లో‌ దొంగతనం చేసేందుకు పోయాడు.

దొంగ తనకు కావలసిన బంగారంకోసమూ, డబ్బులకోసమూ వెతుక్కుంటూంటే, పిల్లవాడు 'తనకు పనికొచ్చేవి ఏమున్నాయా' అన్నట్లు అటూ ఇటూ చూడసాగాడు. అంతలో అతని చూపు గోడకు తగిలించిన తప్పెటమీద పడింది. దొంగను అడిగాడు- "అన్నా, అన్నా, ఇది చాలా బాగుంది. దీన్ని వాయించనా?" అని. "నీకేమీ పనిలేదా? ఊరుకో" అని కసిరాడు వాడు. దాంతో‌ పిల్లవాడికి కోపం వచ్చింది. "నన్నే కసరుతావా, నీపని చెబుతాను చూడు" అని వాడు వెళ్ళి తప్పెటనందుకొని, ఢమఢమలాడించాడు. ఇంకేముంది? ఇంట్లోవాళ్ళు, బయటివాళ్ళూ అందరూ లేచి, దొంగ తేరుకునేలోపల వాడిని పట్టుకొని కట్టేసి, గదిలో పడేశారు. ఆ తర్వాత పోలీసులు రావటమూ, దొంగను పట్టుకు పోవటమూ, వాడిని పట్టించిన పిల్లవాడికి అనేక బహుమతులివ్వటమూ జరిగిపోయాయి.

ఆలోగా వాడిని గుర్తుపట్టిన వాళ్ళెవరో ఆ కబురు వాళ్ళ అమ్మానాన్నలకు చేరవేశారు. వాడు ఏమైనాడో అని కలవరపడుతున్న తల్లి పరుగున వచ్చి, వాడిని వెంటబెట్టుకెళ్ళింది- "ఇప్పుడు ఇన్ని బహుమతులు వచ్చాయి గద నాయనా, ఇకమీద నైనా బాధ్యతగా ఉండు!" అని చెబుతూ.