అనగా అనగా కోతిపిల్ల ఒకటి ఉండేది.

చక్కగా పళ్ళు ఇకిలించి నవ్వుతూ ఉండేదది.

పళ్ళతో పళ్ళనూ, కాయలనూ కరకర నమిలి తినేస్తూ సంతోషంగా ఉండేది.

ఒకరోజున అది దానిమ్మకాయను ఒకదాన్ని కొరికింది. పెళుసైన దానిమ్మతొక్కు కొంచెం విరిగి, దాని పళ్ళ సందుల్లో ఇరుక్కుపోయింది.

అది నోట్లో వేళ్ళు పెట్టి పీకినా, పుల్ల పెట్టుకొని శ్రమపడినా ఆ తొక్కు మాత్రం ఊడి రావట్లేదు.

నాలుకను ఎటు త్రిప్పినా చివరికి దానిమ్మ తొక్కే తగుల్తోంది.

కోతిపిల్లకు చాలా గందరగోళంగా అనిపించింది. దాని కాలు ఇప్పుడు ఒక చోట నిలవటం లేదు. అది ఎగిరింది; దూకింది; ఇకిలించింది; పళ్ళు నూరింది; నవ్వింది; ఏడ్చింది- ఏం చేసినా ఉహుఁ- ప్రయోజనం లేదు.

"పంట్లో‌దూరిన దానిమ్మ తొక్కు ఉబ్బి, వేర్లు బయటికొచ్చి, చివరికి ఆ వేర్లతో నోరంతా నిండిపోతుంది- ఇంక అసలు నోరు తెరిచేందుకు వీలుండదు; మూసేందుకు వీలుండదు" అనిపించింది దానికి. 'నోరు తెరిస్తే దానిమ్మ వేర్లు ఎక్కడ నోట్లోంచి బయటికి వచ్చేస్తాయో' అన్నట్లు, అది ఇక నోరు తెరవకుండా మూసుకొనే ఉండిపోయింది. నాలుకతో దానిమ్మ తొక్కును నెట్టీ నెట్టీ అలిసిపోయిందది- కానీ దానిమ్మ తొక్కు మాత్రం కొంచెం కూడా కదల్లేదు.

కొంచెం సేపు కష్టపడ్డాక, ఇంక లాభం లేదని, అది వడ్రంగి పిట్ట దగ్గరికి వెళ్ళింది- "ప్లీజ్! నా నోట్లోంచి దానిమ్మ తొక్కును పీకెయ్యవా? నీ ముక్కు పొడిచేందుకు, పురుగుల్ని పట్టుకునేందుకు చాలా అనువుగా ఉంటుంది కదా, ప్లీజ్!" అన్నది.

వడ్రంగిపిట్ట దాన్ని నోరు తెరవమని, తన ముక్కుతో దానిమ్మ తొక్కును పొడిచి, లాగేసేందుకు ప్రయత్నించింది. కానీ అది చినిగి ముక్కలైంది తప్పిస్తే, పూర్తిగా బయటికి రాలేదు. చివరికి అది రెక్కలెత్తేసింది- "నావల్ల కాదు బాబూ" అనేసింది. "దానిమ్మ తొక్కేగా! రేపో మాపో దానంతట అదే పోతుందిలే" అన్నది.

"రెండు రోజులా! నోరును ఇట్లా పెట్టుకొని రెండురోజులు ఎట్లా బ్రతికేది?" అని ఏడ్చింది కోతిపిల్ల. ఏడ్చీ ఏడ్చీ దాని చెంపల మీద కన్నీళ్ళు చారికలు కట్టాయి. కానీ దానిమ్మ తొక్కు మాత్రం నాలుకకు తగుల్తూనే ఉంది.

ఆరోజంతా అది ఇక ఆడుకోలేదు; గెంతలేదు; దూకలేదు; చెట్ల కొమ్మలు పట్టుకొని ఊగలేదు; ఏమీ తినలేదు; దానికసలు ఆకలే వేయలేదు ఆరోజు.

సాయంత్రం అది ఇంటికి చేరుకునేసరికి, వాళ్ల తాత దాన్ని పిలిచింది ఉత్సాహంగా. తను ఎత్తుకొచ్చిన అరటిపళ్ళ గెల చూపించింది దానికి. నాలుగైదు అరటిపళ్ళూ తెచ్చి చేతిలో పెట్టింది కూడా. కోతిపిల్లకు మామూలుగా అరటిపళ్లంటే ప్రాణం. కానీ ఇప్పుడు దానికి అవి ఏమాత్రం‌సంతోషాన్నివ్వలేదు.

"నాకొద్దు! నేను తినలేను! నా పళ్ళసందుల్లో దానిమ్మ చెక్కు ఇరుక్కున్నది!" అని కోపంగా అరిచింది అది. "ఫరవాలేదులే, తిను! అరటిపళ్ళు బాగుంటై!" అన్నది తాతకోతి. అయితే తాత చెప్పిన కొద్దీ కోతిపిల్ల మరింత చెట్టెక్కి కూర్చున్నది. "దానిమ్మ తొక్కు పోతేనే, నేను ఏమైనా తినేది!" అని భీష్మించుకు కూర్చున్నది.

చివరికి తాతకోతి, తనే ఒక్కో పండును తినటం మొదలు పెట్టేసరికి, కోతిపిల్ల అయిష్టంగానే దాని దగ్గరికెళ్ళి కూర్చున్నది. మెల్లగా ఒక పండును తీసుకొని తిన్నది- బాగుందని, ఇంకోటి తిన్నది- ఆపైన మరొకటి- ఇక తింటూ‌ పోయింది-

కొంచెం సేపటికి చూస్తే, దాని పళ్ల సందుల్లో దానిమ్మ తొక్కు లేదు! ఎప్పుడు పోయిందో, ఏమో, మరి!

మనల్ని పట్టి పీడించే సమస్యలు అనేకం, నిజానికి చిన్నవే- అయితే వాటిని పోగొట్టుకునేందుకు మనం ఎంత శ్రమ పడతామంటే, ఆ అలసటలో మనకు చాలా ఇష్టమైనవికూడా నిస్సారంగా తోస్తాయి. అలాంటప్పుడు ఊరికే అధైర్యపడి కూర్చోకుండా, తెలిసినవాళ్ళు చెప్పిన మంచిపనుల్లో దేన్నో ఒకదాన్ని, కొంచెం కొంచెంగా చేస్తూ పోవాలి. మెల్లగా ఆ సమస్యలూ సర్దుకుంటాయి; సంతోషమూ మన సొంతం అవుతుంది! ఏమంటారు?

మీకందరికీ చాలా అభినందనల అరటిపళ్ళు!

కొత్తపల్లి బృందం