అమరాపురం రాజావారికి లేకలేక ఒక వారసురాలు పుట్టింది. సుజాత అనే ఆ పాపను ఆయన తన ప్రాణంకంటే ఎక్కువగా ప్రేమించాడు. చాలా గారాబంగా పెంచాడు. ఆ పాపకు మూడేళ్ళ వయసున్నప్పుడు అనుకోకుండా ఒక దుర్ఘటన జరిగింది. ఆమెను ఎత్తుకొని పిల్లలు కొందరు దగ్గర్లో ఉన్న అడవికి వెళ్ళారు, వన భోజనాలకోసమని-
పిల్లలందరూ కలిసి ఆడుకుంటూ ఆడుకుంటూండగా కారు మబ్బులు క్రమ్ముకొని, అకస్మాత్తుగా పెద్ద వర్షం మొదలైంది. పిల్లలందరూ ఎవరికివాళ్ళు హడావిడిగా వెనక్కి పరుగెత్తారు- సుజాత మాత్రం అడవిలోనే మిగిలిపోయింది!
మెరుపులకు, ఉరుములకు భయపడి, ఆ పాప ఏడవటం మొదలుపెట్టింది. అదే సమయానికి గబగబా పోతున్న ఒక ముసలాయన ఆ పాప ఏడుపును విని అటు వెళ్ళి చూశాడు. అతను ఏమంత మంచివాడు కాదు. ఎవరో డబ్బున్న పాప, ఒంటరిగా అలా అడవిలోఉండటం చూసి, అతని మెదడులో ఏవేవో ఆలోచనలు మెరిసాయి: 'ఆ పాపను అడ్డం పెట్టుకొని తను చాలా డబ్బులు సంపాదించవచ్చు! ఇంతకీ ఈ పాప ఎవరో కనుక్కోవాలి'- అని అతను ఆ పాపతో ప్రేమగా మాట్లాడి, ఆమెను పొరుగూరులో ఉన్న తన ఇంటికి తీసుకెళ్ళిపోయాడు.
"నీ పేరేంటమ్మా" అంటే 'సుజాత' అని చెబుతున్నది తప్ప, ఆ పాప ఇంకే వివరాలూ చెప్పలేకపోతున్నది. "మీ అమ్మ ఎవరు?" అని అడిగితే "అమ్మ" అంటున్నది. "మీ నాన్న ఎవరు?" అంటే "నాన్న " అంటున్నది! కొన్ని రోజులవరకూ ముసలివాడు ఆ పాప తల్లిదండ్రులకోసం వెతికాడు- వాళ్ళెవరో తెలిస్తే వాళ్లను డబ్బులు అడగచ్చని ఆశపడ్డాడు. రాను రాను అతనికి ఆ ఆశా అడుగంటింది. దగ్గర్లోఎవరి పాప పోయిందో అతనికి తెలియనేలేదు, ఎంతకీ. చివరికి అతను నిరాశపడి, 'కానీలే, నేను పెద్దవుతున్నాను. ఏపనీ చేయలేక పోతున్నాను. ఈ పాపను రెండేళ్ళు సాకితే సరి, అన్ని పనులూ ఈమెతో చేయించచ్చు!' అని సర్దుకున్నాడు.
ఆలోగా అక్కడ, రాజావారు తన మనుషుల్ని అన్ని వైపులా పంపి వెతికించారు. వాళ్ళు అన్నిఊళ్లూ వెతికారుగానీ, ఈ తాత ఉంటున్న మామిడి తోటను మాత్రం వెతకటం మరచారు! ఇక ఆ పాప ఎక్కడ దొరుకుతుంది? రాజావారు రాణిగారు విచారంతో చిక్కి శల్యమైపోయారు.
కొన్నాళ్ళకు ఆ తాతకు తెలిసింది, సుజాత ఎవరి బిడ్డో. కానీ ఆ సరికి అతనికి ఆ పాప అంటే ఇష్టం ఏర్పడింది. తనకు పనులు చేసిపెట్టేందుకు, ముసలితనంలో తనను చూసుకునేందుకు ఈ పాప ఉంటే మేలనిపించింది అతనికి. అందుకని అతను తనకు ఇక నిజం తెలిసినా తెలియనట్లుగా ఉండిపోయాడు.
సుజాతకేం తెలుసు, ఇవన్నీ? అతనే తన తాత అనుకున్నది. తాత తన స్వార్థం కొద్దీ సుజాతకు తిండి పెట్టాడు; పనులన్నీ నేర్పించాడు. పాప కొంచెం పెద్దదయ్యేసరికి, తోటలో కాసిన మామిడికాయలు అమ్ముకొని రమ్మని ఆ పాపను దగ్గరి ఊళ్ళకు పంపించటం కూడా మొదలు పెట్టాడు. ఆ పాపకు అతను ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు- "ఏ దిక్కుకైనా పో- కానీ ఉత్తర దిక్కుకు మాత్రం పోవద్దు" అని. ఎందుకంటే ఉత్తర దిక్కుననే ఉంది మరి, రాజావారి పరగణా!
చాలా సంవత్సరాల పాటు తాత మాట జవదాటలేదు, సుజాత కాయలమ్మేందుకు ఎప్పుడు వెళ్ళినా మూడు దిక్కులకే వెళ్తుండేది. అయితే ఒక రోజున మూడు దిక్కుల్లోనూ ఎంత తిరిగినా ఆమె తట్టలో ఉన్న కాయలు అమ్ముడు పోలేదు. "ఈ కాయల్ని ఇంటికి తీసుకొని పోతే తాత తిడతాడే, ఎలాగ?" అని విచారం వేసింది ఆమెకు. "సరే, ఎలాగైతే అలాగ కానీ, అటువైపుకూ వెళ్ళి చూస్తాను" అని ఉత్తరం దిక్కుకు పోయింది.
అక్కడ రాణిగారు సుజాతను చూడగానే ముచ్చటపడింది. ఆమెను వాళ్ళ ఇంటికి పిలిచి కాయలు తీసుకుంటూ "పాపా, మీ అమ్మానాన్నలు ఎవరు?" అని అడిగింది- "నాకూ ఒక పాప ఉండేదమ్మా, సరిగ్గా నీ అంతే ఉంటుందా ఆ పాప ఇప్పుడు!" అని చెబుతుంటే ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగాయి. "నువ్వు ఇవాళ్ళ మాతోబాటే ఉండిపోరాదూ, రేపు తిరిగి వెళ్దువు" అంటే, సుజాత 'సరే' అని అక్కడే ఉండిపోయింది.
చీకటి పడ్డా సుజాత ఇంటికి రాకపోయేసరికి, ముసలాయన కంగారు పడి, అందరినీ అడిగాడు. చివరికి అతనికి సుజాత ఉత్తరం దిక్కుకు వెళ్ళిందని తెలిసింది- వెంటనే అటువైపుకు బయలుదేరి వెళ్ళి. తెల్లవారే సరికి అమరాపురం చేరుకొన్నాడతను. అంతలోనే మిద్దెపైనుండి అతన్ని చూసింది. సుజాత తాతను కూడా లోనికి రమ్మని పిలిచింది. తాత ససేమిరా రానన్నాడుగానీ, చివరికి రాజావారి మనుషులు అతన్ని బలవంతం చేసేసరికి లోపలికి రాక తప్పలేదు. రాజావారినీ,రాణిగారినీ, సుజాతనూ చూడగానే 'వీళ్ళకు అంతా తెలిసిపోయినట్లుంది' అనుకున్నాడతను. వెంటనే రాజావారి కాళ్ళమీదపడి నిజం ఒప్పేసుకున్నాడు.
జమీందారు గారు మొదట ఒకింత నిర్ఘాంతపోయారు- ఆపైన అతను చేసిన పనిని తలచుకొని ఆయనకు విపరీతమైన కోపం వచ్చింది.
ఇప్పుడు మీరే చెప్పండి- ముసలివాడికి ఆయన ఏమి శిక్ష విధించాలి?