అప్పుడు కుందేలు వినయంగా తలవంచి- "ప్రభూ! అడవిలోని జంతువులందరూ మీవారే తప్ప, వేరు కాదు. అలాంటి మీ సేవకుల తప్పు ఇందులో వెంట్రుకవాసంతైనా లేదు. నేను ఈరోజు ఉదయాన్నే మావాళ్ళ శాసనానికి తలఒగ్గి, తమ దగ్గరికి వద్దామని త్వర త్వరగా బయలుదేరాను. ఇంకా దారి మధ్యలో ఉండగానే నాకొక సింహం ఎదురైంది!

అది నన్ను చూసి- "ఒసీ! కుందేలు కూనా! నాముందు ఎంతలేసి జంతువూ భయంతో వణికిపోవలసిందే- నన్ను చూసికూడా నిర్భయంగా పోగలిగే జంతువు ఒక్కటీ ఈనాటివరకూ నా కంట పడలేదు. నీ గర్వం చూస్తే నాకు విపరీతమైన కంపరం పుడుతున్నది. నీకు ఎదురుగా నిలుచున్న నన్ను లక్ష్యపెట్టకుండా, నన్నే రాసుకొని పోయేంత పొగరు నీకు ఎట్లా వచ్చింది? నిలు, నిలు! ఎక్కడికి పోతావు!?" అని గర్జిస్తూ నిలువరించింది.

నేను ఆ సింహాన్ని చూసి, ఏమాత్రం భయపడకనే, "మమ్మల్ని అందరినీ కాపాడేవాడు, చిన్నప్రాణుల పట్ల దయగలవాడు అయిన సింహరాజు ఉన్నాడు. ఆ మహామహుని సన్నిధికి పోతున్నాను. నన్ను ఆపకు- ఆ రాజుకు కొంచెం‌ కోపం వచ్చిందంటే చాలు- లోకం అంతా అతలా కుతలం అయిపోతుంది!" అన్నాను.

అప్పుడు ఆ సింహానికి చాలా కోపం వచ్చేసింది- మిట్టమధ్యాహ్నం వేళ ప్రకాశిస్తున్న సూర్యబింబం మాదిరిగా మండుతూ- అది "అహహా! ఇంత కాలానికి గానీ ఇట్లాంటి వింత మాట వినబడలేదే! ఈ అడవిలోని జంతు సమూహాలన్నిటికీ నేనొక్కడినే ప్రభువును- మరి నాకు ప్రభువు ఎవ్వరబ్బా?! ఎవరైనా ఒళ్ళుమరచి, అందని ఆ పదవికోసం గంతులు వేసేందుకు సిద్ధపడితే నేను వాళ్ళను 'నా బలం' అనే అగ్నికి ఆహుతి చేస్తాను. నువ్వు ఇంతకుముందు ఎవరో నీ ప్రభువన్నావే, వాడిని చూపెట్టు- ఇప్పుడే వాడి మీద యుద్ధానికి పోతాను. వాడిని చూపకపోతే నిన్నే తినేస్తాను" అని బెదిరించింది.

"దాని బారి నుండి తప్పించుకునే మార్గం లేక, నేను చివరికి దానితో "సరేలెండి!‌అట్లాగే వెంటబెట్టుకొని వస్తాను" అని నమ్మబలికి, చివరికి మీ దగ్గరికి రాగలిగాను- అందుకే ఇంత ఆలస్యం అయింది" అన్నది.

కుందేలు మాటలు విన్న ఆ సింహరాజుకు అంతులేని కోపం వచ్చింది. "తక్షణమే ఆ దుష్ట జంతువును చూపెట్టు. దాన్ని యమపురికి సాగనంపనిదే ఊరుకోను. నాకు దారి చూపిస్తూ ముందు నడువు" అని ఆజ్ఞాపించింది. కుందేలు వినయం, ఆశ్చర్యం కలగలసినట్లు ముఖం పెట్టి "సరే, సరే, రండి-ఇటు రండి" అని వేగంగా ముందు నడుస్తూ దాన్ని తీసుకు పోయింది. దూరంగా ఉన్న ఒక బావి దగ్గరికి ఆ సింహాన్ని తీసుకొని పోయి, "ఓ జంతు కుల సార్వభౌమా! నీ శత్రువు ఇదిగో, ఈ బావిలో ఉన్నాడు- తొంగిచూడు" అన్నదది.

సింహం బావిలోకి తొంగిచూసింది. బావిలోని నీళ్ళలో దానికి తన ప్రతిబింబమే దర్శనమిచ్చింది. ఆ ప్రతిబింబాన్ని వేరే సింహం‌ అనుకున్నదది! పెచ్చుమీరిన కోపంతో తొట్రుపడుతూ అది దిక్కులు ప్రతిధ్వనించేట్లు భయంకరంగా గర్జించి, ఇక ఆగలేక, 'గుభిల్లు'మని బావిలోకి దూకి దుర్మరణం పాలైంది. కాబట్టి ఎంతటి బలవంతుడినైనా బుద్ధిబలంతో గెలువవచ్చు" అని ముగించింది దమనకం.
పింగళకుడికి సంజీవకుడిపై అనుమానం పుట్టించటం:

అట్లా తన అన్నకు 'సింహం కుందేలు' కథ చెప్పి అది, "కాటకము, పాటకము అనే రెండు నక్కలు గతంలో పింగళకుడిని సేవించుకుంటూ ఉండేవి. తప్పు పనులు చేసిన కారణంగా వాటిని రాజుగారు వెళ్ళగొట్టారు. ఇప్పుడు అవి మళ్ళీ రాజానుగ్రహం పొందటంకోసం సంజీవకుడి వెంట తిరుగుతున్నాయి. నా ప్రయత్నానికి ఇదేదో అనుకూలంగా తోస్తున్నది. ఇక సెలవియ్యి- పోయి వస్తాను" అన్నది.

అప్పుడు కరటకుడు "చెట్టు వేరులో చేరిన పురుగును తెలివి తేటలతో బయటికి రప్పించి, వేరుకు దెబ్బతగలకుండా నాశనం చేయటమే నేర్పరితనం. నీకు తెలీనిదేమున్నది? నీ పని నెరవేరుతుంది వెంటనే పోయిరా!" అని దాన్ని సాగనంపింది.

అప్పుడు దమనకం పింగళకుడి దగ్గరికి పోయి, ముఖం వ్రేలాడవేసుకొని, ఏడుపు తెచ్చుకొని నిలబడ్డది. కొద్ది సేపటికి పింగళకుడు దాన్ని చూసి- "దమనకా! ఎందుకు, ఇట్లా స్తబ్ధంగా నిల్చున్నావు? మాకు అతి సన్నిహితుడివి నువ్వు. 'ఈ లోకంలో‌ బ్రతికి ఉందాం' అనుకునే వాడెవ్వడూ నీకు కీడు తలపెట్టేంత సాహసం చెయ్యడు. నీ‌ దు:ఖానికి కారణం తెలిసేంతవరకు మా మనసుకు విచారం కలుగుతుంటుంది. అందుకని, సందేహించక చెప్పు" అన్నది.

అప్పుడు దమనకుడు దానితో "ప్రభూ! తెలివి తక్కువై ఘోరమైన తప్పు ఒకటి చేశాను. నన్ను కరుణించి, క్షమించండి. సేవకుడు తను చేసిన తప్పుల్ని యజమానితో చెప్పకుండా దాచి మోసగించకూడదు. అట్లా మోసం చేసినవాడు అటూ ఇటూ కాకుండా పోతాడు. అది అట్లా ఉండనివ్వండి- అనేకమంది సుఖంగా బ్రతికేందుకు ఆధారమైన పుణ్య పురుషుడికి ఏమైనా కీడు జరిగితే అది ఆలోచించవలసిన సంగతి కాని, మా వంటి అల్పప్రాణి ఒకదానికి కష్టం వచ్చినా సమస్య లేదు. దానివల్ల ఆకాశం ఏమీ కూలిపోదు. ప్రభువులవారి ఎదురుగా నిలబడిన సేవకుల ప్రవర్తన ఎల్లప్పుడూ అద్భుతంగానే ఉంటుంది- అందువల్ల, ప్రభువన్నవాడు గూఢచారులను నియోగించి, తన సేవకులు తనచాటున ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అన్నది తెలుసుకుంటూ, ఆ నివేదికల ఆధారంగా మిత్రులను, శత్రువులను వేరుపరచి, వారిపట్ల కృపను, లేదా వైరాన్నీ‌ ప్రదర్శిస్తూ 'ప్రజలు అనే వృక్షానికి తల్లివేరు' అయిన తనను ఎల్లప్పుడూ కాపాడుకోవాలి.

ప్రభూ! సేవకుడు ఏదేదో చెబుతున్నాడని ఉపేక్షించక, వినండి- సంజీవకుడి ప్రవర్తన, చూస్తే, ఇదివరకటిలాగా లేదు. అన్యాయంగా మాట్లాడకూడదు- మొదట్లో సంజీవకుడి ప్రవర్తన అనన్య సామాన్యంగా ఉండేది. అతని మంచితనాన్ని చూసి మేమందరం చాలా ఆశ్చర్యపడేవాళ్ళం. ఆ రోజుల్లో ఇతడు మిమ్మల్ని కల్మషం లేని ప్రేమ భావంతో గొలిచేవాడు. ఆకలి దప్పులనిగాని, నిద్ర అని గాని చూడక ఎల్ల వేళలా మీ సేవలోనే మునిగి ఉండేవాడు. చక్కెరను తిని చేదు అనకూడదు- ఆనాటి ప్రవర్తనను బట్టి చూస్తే, 'సంజీవకుడు అసలు ఈ లోకపువాడు కాడేమో' అనిపిస్తుంది. మరి ఏ కాలదోషమో గాని, 'ఆనాటి సంజీవకుడు ఈనాటి సంజీవకుడు కాదు' అనిపిస్తున్నది.

ఆ రోజుల్లో ఇతను మీ మంచితనాన్ని వేనోళ్ళ కొనియాడుతూ ఉండేవాడు. ఆ సమయంలో అతనిలో కనబడే సంపూర్ణ ఆనంద పరవశత్వానికి హద్దులు ఉండేవికావు. రాను రాను మాలాంటి వాళ్ళం ఎవరమైనా మిమ్మల్ని మెచ్చుకుంటే "నిజం, నిజం- ఔను, ఔను" అని పొడిపొడి మాటలతోటే చాలిస్తూ వచ్చాడు. ఆ తర్వాత దేవరవారి గొప్పతనాన్ని చిరునవ్వుతో వినటమేగాని, "అవునని-కాదని" అనటం కూడా కరువైంది. ఈమధ్యకాలంలో- మరి ఏమి కథో గాని, ప్రభువుల ప్రస్తావన వచ్చినప్పుడు అతనిలో తెచ్చిపెట్టుకున్న సంతోషమే తప్ప, నిజమైన చిరునవ్వు చివురంతైనా కనబడటంలేదు.
ఈమధ్య ఇతని అభిప్రాయాలను తెలిపే ముఖకవళికలు కొంచెం వింతగా కనబడుతున్నై. 'దీనికి కారణం ఏమిటా' అని నా మనస్సులోనే ఏడ్చుకుంటూ ఉన్నాను. ఈరోజున నా మిత్రులు కొందరు మాటల సందర్భంలో "ప్రభువుచేత వెళ్ళగొట్టబడిన కొందరితో సంజీవకుడు స్నేహం నెరపుతున్నాడు- కాటక పాటకులతో అతను నిత్యమూ ఏవేవో మంతనాలు ఆడుతున్నాడు" అని చెప్పారు. దాన్నిబట్టి ఇతని ప్రవర్తనలో మార్పును అర్థం చేసుకోగలిగాను. ప్రభువు మేలుకోరేవాడు కలలోనైనా స్వామిద్రోహులతో నేస్తం నెఱిపేందుకు పూనుకుంటాడా?" అని చెప్పి, అటూ ఇటూ కలయచూసి, చేతితో నోరు మూసుకొని, ప్రభువుల చెవికి దగ్గరగా తన నోటిని చేర్చేందుకై మోర సారించి, గుసగుసగా "ఇది తమరి సన్నిధిలో ఉన్న సేవకులకు అందరికీ‌ తెలిసిపోయి ఉండవచ్చు- సంజీవకుడంటే ఉన్న భయం కొద్దీ ఇక్కడివాళ్ళు బయటపడకుండా ఉన్నట్లున్నారు. ఇంత ఎందుకు? ఏ ఒక్కడిని పిలిచి విచారించినా కథంతా తమరి చిత్తానికి అర్థమైపోగలదు" అని ఊదింది.

అది విని పింగళకునిలో అపారమైన రోషం, విషాదం పెల్లుబికినై. అతను సేవకుడొకడిని పిలిచి "ఇదిగో నిజం చెపు- ఇక్కడ పనిచేసేవాళ్ళలో ఎవరైనా కాటక పాటకులతో స్నేహంగా ఉంటున్నారా?" అని అడిగాడు. వాడు భయంతో‌ కంపిస్తూ గుటకలు మ్రింగగా, పింగళకుడు- "భయపడకు, నిజం చెప్పు. నీ ప్రాణానికేమీ అవ్వదు" అని మాట ఇచ్చాడు. దాంతో నోటివెంట మాట పెగిలి, వాడు "అయ్యా! సంజీవకుడు వారి చేరికకు అంగీకరించినట్లు కనబడుతున్నది" అని చెప్పేశాడు. అప్పుడు ప్రభువు "సరే, మేము నిన్ను ఇట్లా అడిగామన్న సంగతిని ఇక్కడే మర్చిపో. బయట ప్రొక్కనివ్వకు. ఇక పో!" అని వాడిని పంపించి, ఏమి చేయాలో తెలియని వాడిలాగా దు:ఖితుడై, నేలవైపుకు చూస్తూ కూర్చున్నాడు.

వెంటనే దమనకుడు ఇట్లా అన్నాడు- " దీన్ని బట్టి చూస్తే మనతో సంజీవకుడు సన్నిహితంగా వర్తించే అవకాశం ఇక లేదనే తోస్తున్నది. మనం అతని గురించి కొంత తెలుసుకున్నాం, కనుక ఇకమీద మన మనసుకు కూడా‌ గతంలో లాగా అతని పట్ల దగ్గరితనం ఉండదు. అయినప్పటికీ ఇతను చాలాకాలంగా ప్రభువుల ఆస్థానంలో ఉండి, మనసుకు దగ్గరైనవాడు. చిరకాలంగా సేవిస్తున్న అనుచరుడు తెలిసీ-తెలియక ఏవైనా అపరాధాలు చేస్తే క్షమించాలిగాని, బయటివాళ్ళలాగా వాడిని వెళ్లగొట్టటం ధర్మం కాదు. కాబట్టి, ఇతడు ఇంతవరకు చేసిన తప్పుడు పనులను బయటపెట్టి, భయం పుట్టించి, క్షమాపణ కోరేటట్లు చేసి, 'ఇకమీద ఎన్నడూ ఇట్లాంటి పని చేయకు' అని కఠినాతి కఠినంగా చెప్పి, ఎప్పటిలాగానే అతని సేవలను అంగీకరించటం అన్ని విధాలుగా మంచిది' అని తోస్తున్నది" అని.

అది విని, మృగరాజు తల ఎత్తి, దమనకుడి ముఖం మీద చూపులు నిలిపి, కొంచెం సేపు ఆలోచించి- "రాజద్రోహులకు ఎంత శిక్ష విధించినా చాలదు. అయినప్పటికీ చాలా కాలంగా నన్ను సేవించిన అటువంటి వాడి పట్ల నా మనస్సు మెత్తనై, తెగింపుకు సమ్మతించటంలేదు. కాబట్టి వాడిని వెళ్ళగొట్టేద్దాము.. నువ్వు చెప్పినట్లే చేసేద్దాం.." అన్నాడు.

అప్పుడు ఆ నక్కల రాజు- "ఇది ఇప్పటికి తోచిన మార్గం. అయినప్పటికీ‌ , 'సహసా విధధీత న క్రియా' అని సామెత- అంటే 'తొందరపడి ఏ పనినీ చేయకూడదు'- అందువల్ల ఈ విషయాన్నంతా వేరొక బుద్ధికుశలురు ఎవరితోనైనా- తమ మనస్సుకు నచ్చినవారితో- విచారించి చూద్దాం. ఆపైన తమకు ఏది సరైనదిగా తోస్తే అది చేయవచ్చు. బాగా ఆలోచించి చేస్తే ఏ తప్పూ జరగదు. ఆలోగా జరిగే నష్టమూ ఏదీ లేదు గదా" అన్నది.

అది విని సింహరాజు 'ఇక్కడున్నవాళ్ళంతా నీకు తెలిసినవాళ్ళే. వాళ్ల వాళ్ల తెలివితేటలు ఎంతటివో నీకు తెలియనిది కాదు. నీ మనస్సుకు తోచినవాళ్ళెవరో చెప్పు" అన్నది.

అప్పుడు దమనకుడు కొంచెంసేపు కనుఱెప్పలార్పకుండా పైకి చూసి, మళ్ళీ మృగరాజును చూసి, "మా అన్న కరటకుడు వివేకవంతుడు; ప్రభువులవారి హితం కోరేవాడు. ఈ పనికి అతడే 'సరైనవాడు' అని నా మనస్సుకు తోస్తున్నది. తమరి ఆజ్ఞ అయితే అతనిని నేను ఇప్పుడే ఇక్కడికి రప్పిస్తాను" అని చెప్పి, ఒప్పించి, ఒక రాజభటుని పంపి కరటకుడిని అక్కడికి పిలిపించింది. (మిగతాది మళ్ళీ....)