అనగా అనగా వెంకటంపల్లి గ్రామంలో సుశీలమ్మ అనే ముసలమ్మ ఒకామె నివసిస్తూ ఉండేది. ఆమె ఒక చిన్న కొట్టంలో ఉండేది- అది కాక ఆమెకు ఒకే ఒక్క జీవనాధారం ఉండేది- అది ఒక మేకపిల్ల. అవ్వకు ఆ మేకపిల్ల అంటే చాలా ఇష్టం. దానికి కూడా అవ్వ అంటే ప్రాణం. అవ్వకు పెద్దగా శక్తి ఉండేది కాదు గదా, అందుకని ఆ మేక పిల్ల వారం వారం ఒక అడవిని దాటి చెన్నేకొత్తపల్లికి వెళ్ళేది. అక్కడి సంతలో వదిలేసిన కాయగూరలను తిని తిరిగి ఇంటికి వచ్చేది.
ఒక రోజున ఆ మేక సంతకు వెళ్తుంటే దారిలో దానికి ఒక పెద్ద పులి ఎదురైంది. మేక గజగజా వణుకుతూ నిలబడిపోయింది. పులి గర్జిస్తూ మేక మెడను ఒక పంజాతో పట్టుకొని, దాని చెవిలో నోరు పెట్టి "మేకా! నాకు చాలా ఆకలిగా ఉంది. నేను నిన్ను వెంటనే తినేస్తాను- ఏమీ అనుకోకు!" అన్నది.
మేకకు అకస్మాత్తుగా తెలివి మేలుకున్నది- అయ్యా! పులి గారూ! నేను ఇప్పుడు బలంగా లేను- నా కడుపు చూడండి, ఎంత లోపలికి పోయి ఉన్నదో! సంతకు వెళ్ళి కాయగూరలు తిని వస్తే బలంగా ఔతాను. అప్పుడు నన్ను తింటే మీ ఆకలి తీరుతుంది- ఇప్పుడు ఏం ప్రయోజనం, కొంచెం ఆలోచించండి!" అన్నది. "మరి నువ్వు సంతకు వెళ్ళి మళ్లీ ఇక్కడకు రాకుండా ఎక్కడికైనా వెళితే?" అన్నది పులి, అనుమానంగా.
"తమరు ఇక్కడే ఎదురుచూస్తూ ఉండండి- నేను సంతకువెళ్ళి భోజనం చేసుకొని వస్తాను. ఇవాళ్ళ కాకపోతే రేపైనా దొరకాల్సిందే గదా, మీకు? అంతమోసం చేస్తానా, ఒకే ఊరివాళ్ళ?" అని నమ్మబలికి సంతకు వెళ్ళింది మేక, గండం గడిచిందని ఊపిరి పీల్చుకుంటూ.
సంతలో తృప్తిగా భోజనం చేశాక అది ఆలోచనలో పడింది మళ్ళీ- "తిరిగి ఇంటికి వెళ్ళాలంటే మధ్యదారిలో పులి ఎదురు చూస్తూ ఉంటుంది నాకోసం! ఒకసారి ఎలాగో ఒకలాగ తప్పించుకున్నాను- మళ్ళీ తప్పించుకోవటం కుదరదు. ఏంచేద్దాం?" అని బాగా ఆలోచించి, చివరకు అది ఒక ఇనుప ట్యాంకులో దూరి ముడుచుకొని కూర్చున్నది. ట్యాంకును పడుకోబెట్టి, గణగణ మని దానిని దొర్లించుకుంటూ వస్తోంది. అడవిదారిలో తన కోసం ఎదురుచూస్తున్న పులి కనబడింది దానికి!
పులికి గణగణా దొర్లుకుంటూ వస్తున్న ట్యాంకు కనబడింది. అది దాని వెంటే పరుగెత్తుతూ "ట్యాంకూ,ట్యాంకూ! సంతలో మేక ఏమైనా కనబడ్డదా?" అని అడిగింది. "చూశాను-చూశాను.. గణగణ .. చాలా మంచి మేక అది..గణగణ.. సంతలో భోజనం చేస్తోంది..గణగణ.." అన్నది ట్యాంకులోఉన్న మేక గట్టిగా, ఇంకొంచెం వేగంగా దొర్లేందుకు ప్రయత్నిస్తూ. "కానీ నాకు చాలా ఆకలేస్తోందే, ఏం చేయను?" అని అరచుకుంటూ, పులి తనే సంతకు బయలుదేరి వెళ్ళింది మేక కోసం పులి వెళ్లిపోయాక.
కొద్దిదూరం దొర్లి, మెల్లగా ట్యాంకులో నుంచి బయటకు వచ్చి, అటూ ఇటూ చూసింది మేక. తను ఎటో దారి తప్పినట్లుంది. బాగా దాహంకూడా వేస్తున్నది. అక్కడ దానికి పాడుబడ్డ భవనం ఒకటి కనిపించింది. మేక అందులోకి దూరి కడుపునిండా నీళ్ళు త్రాగి, మేడ మెట్లు ఎక్కి పైనున్న గదుల్లో ఏముందో చూద్దామని వెళ్ళింది. చూడగా, అదేదో దొంగల స్థావరంలాగా ఉన్నది- వజ్రాలు, బంగారు నాణాలు అన్నీ కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి. వెంటనే అది తనకు వీలైన్నన్ని వజ్రాలను, బంగారు నాణాలను గబగబా మ్రింగి వేసింది. ఆపైన అది మళ్ళీ ట్యాంకులో కూర్చొని దొర్లుకుంటూ దొర్లుకుంటూ, దారి వెతుక్కుంటూ ఇల్లు చేరుకున్నది!
ఇంటికి చేరుకోగానే అది ఒక రోకలి బండను తీసుకొని ముసలమ్మకు ఇచ్చి, చెప్పింది: "అవ్వా! నాకు విపరీతంగా కడుపు నొప్పి వస్తోంది. కడుపుకు కుడివైపున రోకలిబండతో ఒక్క సారి కొట్టు" అని. అవ్వ అలాగే కొట్టగానే దాని నోట్లోంచి వజ్రాలు బయటికి వచ్చాయి.
అప్పుడు అది రెండోవైపుకు తిరిగి పడుకొని, ఎడమ వైపున కొట్టుమంది అవ్వను. అవ్వ ఎడమ వైపున ఒక్కసారి కొట్టేసరికి అది మ్రింగిన బంగారు నాణాలన్నీ బయట పడ్డాయి!
అవ్వ చాలా సంతోషపడింది. కొన్నాళ్ళకు ఆమె పెద్ద ఇల్లు కట్టించుకొన్నది. ఇక మేకను సంతకు పంపించలేదసలు. దాన్ని ఇంకా చాలా ప్రేమగా చూసుకోసాగింది.
అవ్వ ఇంటికి పొరుగునే నివసిస్తారు, వెంకటరెడ్డి దంపతులు. అవ్వ జీవితంలో మార్పును చూసి వాళ్ళకు కన్నుకుట్టింది. మెల్లగా వాళ్ళు అవ్వతో స్నేహం పెంచుకొని, ఆమెకు ఆ డబ్బు ఎలా వచ్చిందో తెలుసుకొన్నారు. 'మేకను సంతకు పంపించి, అది వెనక్కి వచ్చాక కట్టెతో కొడితే ఇన్ని డబ్బులు వస్తాయా!' అని ఆశ్చర్యపోయి, వాళ్ళ మేకను కావాలని బలవంతం చేసి, సంతకు పంపించారు వాళ్ళు!
అయితే అక్కడ అడవిలో సింహం మేక కోసమే ఎదురు చూస్తోంది ఇన్నాళ్ళూ. ఒక మామూలు మేక తనని మోసం చేసి తప్పించుకున్నదన్ని ఆ సింహం చాలా కోపంగా ఉన్నది. ఇప్పుడు వెంకటరెడ్డి వాళ్ళ మేక నింపాదిగా సంతకు నడచుకొని పోతుంటే దానికి ఎక్కడ లేని ఆవేశం వచ్చింది. పొదల చాటునుండి ఒక్క ఉదుటున దాని మీదికి దూకి, మరోమాట లేకుండా దాన్ని చంపి తినేసింది! తన శత్రువు అదేననుకున్నది మరి!
'మేక ఇంటికి ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు దాన్ని రోకలి బండతో కొడదామా' అని ఎదురు చూస్తున్న వెంకటరెడ్డి దంపతులకు డబ్బూ రాలేదు; మేకా దక్కలేదు!