అనగనగా ఒక ఊరు. ఆ ఊరి పేరు ఇరిట్టి. ఇరిట్టిలో ఒక ఇంట్లో ముగ్గురు పేద అక్కాచెల్లెళ్ళు నివసిస్తుండేవాళ్ళు. బట్టలు నేస్తూ, నూలు వడుకుతూ జీవనం గడుపుతుండేవాళ్లు వాళ్ళు.
ఒక రోజు ముగ్గురూ బట్టలు నేస్తూ ఆ సంగతీ- ఈ సంగతీ మాట్లాడుకుంటుండగా, పెళ్ళి ముచ్చట వచ్చింది, చర్చలోకి. అప్పుడు వాళ్లలో పెద్దామె "రోసి" అన్నది, "రాజు దగ్గర వంట చేసే వాడిని పెళ్ళి చేసుకుంటే ఎంత బాగుంటుందో! ఎప్పుడూ ఎంచక్కా మంచి మంచి వంటలు తినవచ్చు!" అని.
రెండో ఆమె 'సుచి' తన మనసులో మాట చెప్పింది: "రాజు దగ్గర బట్టలు కుట్టే దర్జీని పెళ్ళి చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఎంచక్కా కొత్త కొత్త రకాల మోడల్సులో బట్టలు కుట్టి వేసుకోవచ్చు!" అని.
అప్పుడు మూడో ఆమె 'సీమ' అన్నది కలల్లో తేలిపోతూ- "నేను గనక రాజుని పెళ్ళి చేసుకుంటే నాకు ఇద్దరు పిల్లలు పుడతారు- ఒక బాబు , ఒక పాప! బాబు చేతిలో యాపిల్ పండు ఉంటుంది. పాప నుదుటి మీద నక్షత్రం గుర్తుతో ఒక బొట్టు వుంటుంది" అని. ఈ ముచ్చట విని అక్క లిద్దరూ గట్టిగా నవ్వారు.
ఆ దేశపు రాజుగారు తనకు వీలైనప్పుడల్లా మారువేషంలో తిరిగి ప్రజల కష్ట సుఖాలను కనుక్కుంటూ ఉండేవాడు. సరిగ్గా ఈ అక్కా చెల్లెళ్ళు మాట్లాడుకునే సమయానికే రాజుగారు అటువైపు వచ్చి, వాళ్ల మాటలు విన్నాడు. తెల్లవారగానే ఆయన భటుల్ని పంపించాడు: పెద్దామె 'రోసి'కి వంటమనిషిని ఇచ్చి పెళ్ళి చేశాడు. రెండో అమ్మాయి 'సుచి'కి దర్జీని ఇచ్చి పెళ్ళి చేశాడు. మూడో ఆమె 'సీమ'ను తను పెళ్ళి చేసుకున్నాడు.
కొన్నాళ్ళకు అక్కా చెల్లెళ్లు ముగ్గురూ గర్భవతులయ్యారు. రాజుగారు భార్య 'సీమ'ను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. ఇప్పుడు అక్కలిద్దరికీ తమ చెల్లి 'సీమ' అంటే చాలా కోపం పట్టుకున్నది. 'ఏదో ఒక విధంగా ఆమెను అక్కడి నుండి తరిమేయాలి' అనుకున్నారు. భార్య కాన్పు సమయం దగ్గర పడుతున్నది- అంతలోనే రాజుగారికి చాలా దూరప్రయాణం ఒకటి చేయాల్సి వచ్చింది. అక్కలిద్దరూ చాలా సంతోషించారు- తమ దుష్టపధకాలను అమలు పరచేందుకు 'ఇదే తగిన సమయం' అనుకున్నారు.
అంతలోనే సీమకు కానుపైంది. ఇద్దరు కవల పిల్లలు- ఒక బాబు, ఒక పాప- పుట్టారు ఆమెకు. సీమ చెప్పినట్టుగానే, పిల్లవాడి చేతిలో ఆపిల్ ఉంది. పాపకు నుదుటి మీద నక్షత్రం ఉంది! అక్కలిద్దరూ కూడబలుక్కున్నారు- ఆ పసికందుల్ని తీసుకెళ్లి అడవిలో వదిలేసి వచ్చారు. ఆ పిల్లల స్థానంలో రెండు కుక్కపిల్లల్ని తెచ్చి పడుకోబెట్టారు. మురిపెంగా తన బిడ్డల్ని చూసుకునేందుకు వచ్చిన రాజు గారు ఖంగుతిన్నారు- "నా బిడ్డల్ని ఏం చేశావో చెప్పు!" అని ఆయన సీమను ఎంత అడిగినా సీమ ఏమీ బదులివ్వలేకపోయింది- దాంతో ఆయనకు విపరీతమైన కోపం వచ్చింది. తక్షణమే ఆమెను బందీని చేసి కారాగారంలో పెట్టించారు.
ఇక అక్కడ, అడవిలో పడేసిన పసికందులు ఆకలికి ఏడ్వసాగారు. ఆ ప్రాంతంలో ఉన్న వన దేవత వాళ్లను చూసి జాలిపడి, తనతో తీసుకెళ్ళి పెంచుకున్నది. కాలం ఎవ్వరికోసమూ ఆగదు కదా, కొద్ది సంవత్సరాలు గడిచేసరికి వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళయ్యారు.
రాజభవనానికి దగ్గర్లోనే అడవిలో ఒక పెద్ద ఇల్లు నిర్మించింది వనదేవత. ఆ ఇంట్లో పిల్లలిద్దరికీ కావల్సిన సామాన్లన్నీ తెచ్చి పెట్టింది. తనకు వీలైనప్పుడల్లా వచ్చి ఆ పిల్లలతో ఆటలాడుకొని పోతుండేది. పిల్లలిద్దరూ అడవిలో తిరుగుతూ, జంతువులతో ఆడుకుంటూ చాలా సంతోషంగా జీవించసాగారు.
అయితే వాళ్ళుండేది రాజభవనానికి దగ్గరే కదా, ఒక రోజున సీమ అక్కలిద్దరూ చూశారు వాళ్లని. నక్షత్రకుమారి నుదుటిమీద బొట్టును చూడగానే ఆమె ఎవరో తెలిసిపోయింది వాళ్లకు.
'వదిలించుకున్నాం గదా' అని ఇన్నేళ్ళూ నిశ్చింతగా ఉన్నారు వాళ్లు- ఇప్పుడు భయం వేయసాగింది. 'ఎలాగైనా వీళ్లిద్దరినీ చంపేయాల్సిందే' అనుకున్నారు.
ఇద్దరూ కలిసి, ఒక రోజున- అన్న లేని సమయం చూసుకొని వచ్చారు నక్షత్ర కుమారి దగ్గరికి. " మీ ఇల్లు చాలా బాగుందమ్మా! మీ అమ్మ వనదేవత ఎంత చక్కగా కట్టిపెట్టింది, దీన్ని! అయితే దీనిలో ఉండాల్సినవి ఇంకోరెండు ఉన్నాయి- ప్రవహించే నీళ్లు, మాట్లాడే పక్షి- ఆ రెండూ కూడా వుంటే మీ ఇల్లు ఎంత బాగుంటుందో!" అన్నారు.
'ప్రవహించే నీళ్లు, మాట్లాడే పక్షి' అనగానే నక్షత్ర కుమారికి ఉత్సాహం వచ్చింది: "ఇవన్నీ ఎక్కడ ఉంటాయి?" అని అడిగింది వాళ్లని.
"అయ్యో! మీ అమ్మ వనదేవత తలచుకుంటే ఏది సాధ్యం కాదు? నీ అన్నను పంపిస్తే తీసుకువస్తాడు. ఇదొక పనా?" అన్నారు వాళ్ళు నవ్వుతూ. మనసులో మాత్రం "వాటికోసం వెళ్ళినవాళ్ళెవ్వరూ తిరిగిరాలేదు- అట్లా వాడి పీడ కూడా విరగడౌతుంది. ఆ తర్వాత ఈ పిల్ల పని పట్టచ్చు సులభంగా " అనుకున్నారు.
అన్న రాగానే నక్షత్ర కుమారి వాడికి ఎదురువెళ్ళి, తన కోరికను వెల్లడించింది. ప్రవహించే నీళ్లను, మాట్లాడే పక్షిని తెచ్చిపెట్టమని బ్రతిమాలింది. 'సరేలే, దానిదేముంది, త్వరలో తెచ్చి పెడతాను చూడు!' అని చెప్పి ఆ పిల్లవాడు ముందుగా ప్రవహించే నీటి కోసం బయలుదేరాడు. అయితే ప్రవహించే నీళ్లను తెచ్చుకోవటం ఎట్లా? అవి ఏ గిన్నెలోనూ పట్టవు గదా?
వాటిని వెతుకుతూ పోయిన పిల్లవాడికి అడవిలో ఒక చోట వింత అరుపులు, మూలుగులు, ఏడుపులు వినబడ్డాయి. వాడు వెళ్ళి చూసే సరికి, అక్కడ ఒక కొండచిలువ, కొన్ని పక్షి పిల్లల్ని గట్టిగా చుట్టుకొని, మ్రింగబోతున్నది! పిల్లవాడికి ఆ పక్షి పిల్లల్ని చూడగానే జాలి వేసింది. వాడు పరుగెత్తుకొని పోయి, తన కత్తితో కొండచిలువను గట్టిగా పొడిచాడు. ఆ దెబ్బతో కొండచిలువ పక్షి పిల్లల్ని వదిలేసి, వాడిని చుట్టుకున్నది. అయినా వాడు భయపడక, తన చేతులు దానికి అందకుండా ప్రహారం చేశాడు; చివరికి దాన్ని తుదముట్టించాడు.
వాడు కాపాడిన ఆ పక్షి పిల్లలు గండభేరుండాలు! తమ పిల్లల్ని కాపాడినందుకుగాను అవి వాడికి ప్రత్యుపకారం చేస్తామన్నాయి. ప్రవహించే నీటికోసం వెతుకుతున్నానని వాడు చెప్పగానే "అయ్యో! అవి నీకెందుకు నాయనా? అవన్నీమాట్లాడే పక్షిదగ్గర, రాక్షసుల సంరక్షణలో ఉంటాయి. మామూలు- వాళ్లకు అందేవి కావు అవి- మామాట విని వెనక్కి తిరిగి వెళ్ళు" అన్నాయి.
కానీ ఆ పిల్లవాడు పట్టిన పట్టు విడువలేదు. ప్రవహించే నీళ్లు, మాట్లాడే పక్షి రెండూ ఒకచోటనే ఉన్నాయని తెలిసి వాడు ఇంకా సంతోషపడ్డాడు- 'ఇప్పుడు తను రెండింటినీ ఒకేసారి సంపాదించవచ్చు!' చివరికి గండభేరుండాలు "సరే, నీ యిష్టం. నిన్ను అక్కడికి తీసుకెళ్ళటం వరకూ మేం చేయగలం- అటుపైన నీదే బాధ్యత" అని, వాడిని తమ వీపు మీద ఎక్కించుకొని, కొండలు , గుట్టలు, సముద్రాలు,నదులు అన్నీ దాటి పోయి, చివరికి వాడిని ఒక ద్వీపంలో వదిలాయి. "నీకు కావలసినవి ఉండేది ఇక్కడే. జాగ్రత్త. ప్రమాదాలనుండి ఎలా తప్పించుకుంటావో ఏమో- నీ పని అయ్యాక మమ్మల్ని తలుచుకుంటే చాలు- మేం వచ్చి నిన్ను వెనక్కి తీసుకెళ్తాం" అని చెప్పాయి.
అట్లా వెళ్ళిన అన్న ఎంతకూ తిరిగి రాలేదు! చాలా రోజులైంది- చివరికి నక్షత్రకుమారికి అనుమానం వచ్చింది- అన్న ఏదో ప్రమాదంలో ఇరుక్కొని ఉండచ్చని. ఆమె ఇక ఆగలేకపోయింది- అన్నకోసం బయలు దేరి వెళ్లింది.
వాళ్లను సాకిన వనదేవతను కలుసుకొని, సంగతి అంతా వివరించింది- వనదేవత కొంతసేపు విని, దివ్యదృష్టితో చూసింది- "అయ్యో! నీ అన్న ఆ పక్షి మాయలో పడి అక్కడే శిలగా మారి పడి ఉన్నాడు. నువ్వు వెళ్ళు. మధ్యలో గండభేరుండాల సాయం తీసుకో. రాక్షసులు లేని సమయం చూసుకొని తెలివిగా పక్షిని పట్టుకొచ్చుకో. ఆ పక్షి ఈక తగిలితే అక్కడి శిలలన్నిటికీ ప్రాణాలు లేచి రాగలవు. అయితే ఒక సంగతి గుర్తుంచుకో- ఆ మాయ పక్షి ఏమి చెప్పినా నువ్వు నమ్మకు- తిరిగి ఏమీ మాట్లాడకు!" అని దీవించి పంపింది.
సరే అని, నక్షత్రకుమారి ముందుకు సాగింది. మధ్యలో గండభేరుండ పక్షులను వేడుకొని, వాటి సాయంతో మాట్లాడే పక్షి ఉండే ద్వీపాన్ని చేరుకున్నది. అక్కడ చాలా మంది రాక్షసులు కాపలా కాస్తున్న కోట కనబడింది ఆమెకు. వనదేవతను ప్రార్థించుకొని, ఆమె ధైర్యంగా ఆ రాక్షసుల ముందునుండి నడుచుకుంటూ కోటలోకి వెళ్ళింది. రాక్షసులు ఆమెను అడ్డుకునేందుకు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది.
లోపలికి వెళ్ళి చూసే సరికి, మాట్లాడే పక్షి కనబడింది- కోటలో స్వేచ్ఛగా తిరుగుతూ. ఈ పాపను చూడగానే అది మనిషిలాగానే ఇకిలిస్తూ "నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? మీ అమ్మ జైలులో ఉంది. జైల్లో పెట్టింది మీ నాన్న రాజే- ఇవన్నీ చేసింది మీ పెద్దమ్మలే!" అని పాడింది.
పాపకు చాలా కోపం వచ్చింది- కానీ వనదేవత చెప్పింది కదా, "మాట్లాడకు" అని? -అందుకని ఆ పాప పిట్టకు ఏమీ బదులివ్వకుండా ముందుకు పరుగెత్తింది. క్షణంలో ఆ పక్షిని పట్టుకొని, అది ఇక నోరు తెరవకుండా ఒక పట్టీ వేసేసింది.
అటుపైన ఆ పక్షి ఈకను ఒకదాన్ని తీసుకొని అక్కడ ఉన్న బండలకు తగిలించింది. వెంటనే అక్కడి బండలన్నీ మనుషులుగా మారిపోయారు! బయట కాపలా కాస్తున్న రాక్షసులంతాకూడా, తమను కమ్మిన మాయాజాలం విడిపోయినట్లు, తక్షణం మాయమైపోయారు. నక్షత్రకుమారి వాళ్లందరికీ మాట్లాడవద్దని సైగ చేసి, అందరినీ వెంట బెట్టుకొని తిరిగి తమ అడవికి చేరుకున్నది.
అప్పుడు వనదేవత మాట్లాడే పక్షి బంధాల్ని విడిపించి, దాని దుష్టశక్తులన్నిటినీ నిర్మూలించింది. అటుపైన ఆమె దాన్ని బుజ్జగిస్తూ "నీ శక్తుల్ని చెడుకోసం కాక అందరికీ మేలు చేసేందుకు వాడు" అని చెప్పింది.
మంచిగా మారిన పక్షి అందుకు అంగీకరించి, నక్షత్ర కుమారితో "పాపా! మీ తండ్రి మహారాజు. మీ పెద్దమ్మలను నమ్మి, మిమ్మల్ని చంపిన నేరాన్నే మోపి, మీ అమ్మను జైల్లో పెట్టాడు. నీకు లేని పోని ప్రలోభాన్ని కల్పించి, నన్ను వెతికే సాకుతో మీఅన్నను చంపాలని ప్రయత్నించింది కూడా మీ పెద్దమ్మలే. మనందరం కలిసి వెళ్దాం; మీకోసం అక్కడ మీ అమ్మ కలవరించని రోజు లేదు" అన్నది.
పిల్లల్ని చూడగానే గుర్తు పట్టారు రాజుగారు. చెయ్యని నేరానికి ఇన్ని సంవత్సరాలుగా జైలుశిక్ష అనుభవించిన రాణి దగ్గరకు వె ళ్లి క్షమాపణ కోరారు . ఇంత చెడు పని చేసినందుకుగాను "రోసి, సుచి" లను పట్టుకుందామని చూస్తే వాళ్ళు ఆ సరికే ఎక్కడికోతప్పించుకున్నారు!
అటుపైన అందరూ సంతోషంగా జీవించారు.