ఒక అడవిలో కుందేలు, ఉడత మంచి మిత్రులు. కొన్ని రోజుల తరువాత అవి రెండూ ఎందుకనో, బాగా గొడవ పడి, విడి పోయాయి. ఉడతకు ఇక అక్కడ ఉండటం కూడా ఇష్టం కాలేదు. అది ఆ అడవిని విడిచి వెళ్ళాలని నిర్ణయించుకున్నది. ప్రక్క అడవికని బయలు దేరి వెళ్లింది. ఆ క్రొత్త అడవిలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నది.

అట్లా అది ఆ అడవిలో తిరుగుతూ ఉండగా ఒక ఎలుక కనిపించింది. ఎలుక "ఇంతకూ ఎవరమ్మా, నువ్వు? ఎందుకు, ఇక్కడికి వచ్చావు?" అని అడిగింది. ఉడతకు దు:ఖం తన్నుకొచ్చింది. అది భోరున ఏడుస్తూ తన కథను వివరించింది. కుందేలు తనను ఎలా మోసం చేసిందో చెప్పింది. ఎలుక దాన్ని ఓదార్చి, "ఏడవకు! ఇవాల్టి నుండీ మనం ఇద్దరం స్నేహితులం! ఒకరికొకరం సహాయం చేసుకుందాం, సంతోషంగా ఉందాం" అని చెప్పింది. అందుకు ఉడతకూడా చాలా సంతోషపడింది.

ఇక అక్కడ, ఉడతతో పోట్లాడిన కుందేలు కోపంగా ఒక గుహ ప్రక్కగా వెళ్తుంటే, దానికి సింహం, ఏనుగు ఎదురు వచ్చాయి. "ఏమిటి మిత్రమా, సంగతి? ఎందుకు, అలా ఉన్నావు?" అని అడిగాయవి, కుందేలును. కుందేలు జరిగిన విషయాన్ని వివరించింది. వాటికి ఉడత తనను ఎన్నెన్ని మాటలన్నదో‌ చెప్పింది. "మరి ఆ ఉడతను అక్కడి కక్కడే చంపెయ్యక పోయావా?" అన్నాయి ఆ రెండూ. "సరే, ఇప్పటికైనా ఏముంది? పద, మేమూ వస్తాం. ముగ్గురం‌ కలిసి దాని సంగతి చెప్పుదాం!" అన్నాయి. కుందేలు కొంచెం వెనుకడుగు వేసింది. "ఎందుకులే, అది ఎటో వెళ్ళి పోయి ఉంటుంది" అని అది అన్నా మిగిలినవి రెండూ వినలేదు. అలా ఆ మూడూ కలిసి బయలుదేరాయి - ఉడతను చంపేసేందుకు. .

తీరా అక్కడికి వెళ్లి చూస్తే ఉడత కనబడలేదు. అవి మూడూ కలిసి అక్కడే ఉన్న చీమను అడిగాయి "ఉడత ఎటు వెళ్ళిందో చూశావా?" అని. "ఏడ్చుకుంటూ ఆ రెండో అడవి వైపు వెళ్ళటం చూశాను" అన్నదది.

ఆ అడవి అన్నిటికీ‌ కొత్తే! అయినా, ఉడత మీది కోపం కొద్దీ "కానీలే! ఆ అడవిలోకే వెళ్ళి పట్టుకుందాం, దాన్ని ఎలాగైనా చంపెయ్యాల్సిందే!" అని కుందేలు, సింహం, ఏనుగు అటువైపుకు నడవసాగాయి.

ఇక అక్కడ, ఎలుక ఉడత అడవిలో‌ తిరుగుతూ ఒక వంతెనను చేరుకున్నాయి. అంతలో వాటికి ఒక వింత శబ్దం వినబడింది. "అదేం శబ్దమో!" అని అవి రెండూ మెల్లగా ఒక చెట్టు చాటున దాగి చూశాయి. అక్కడొక వేటగాడు- వంతెన క్రింద పేలుడు పదార్థాలు సమకూర్చుకుంటూ కనబడ్డాడు! వాడు తనలో తానే మాట్లాడుకుంటూ గట్టిగా "హుం..ఈ రోజు నాకు మంచి రోజు. ఇవాళ్ళ చాలా జంతువులు దొరుకుతై. నా అదృష్టం బాగుంటే ఒక ఏనుగు కూడా దొరకవచ్చు!" అనుకుంటున్నాడు. అంతలో వంతెనకు అటువైపునుండి అక్కడికి కుందేలు, సింహం, ఏనుగు నడచి వస్తూ కనబడ్డాయి.

"చూశావా మిత్రమా? కుందేలు నిన్ను చంపాలని వీటిని వెంటబెట్టుకొని వస్తున్నది! వీటికి తగిన శాస్త్రి జరగాల్సిందే. చూడు, ఇప్పుడు అవి వంతెన మీదికి రాగానే వేటగాడు వంతెనను పేల్చేస్తాడు!" అన్నది ఎలుక, ఉడతతో. ఉడతమాత్రం ఇక ఉండబట్టలేకపోయింది: "ఆగు మిత్రమా! ఇక్కడికి రావద్దు- వంతెన ఎక్కకండి! వెనక్కిపోండి! క్రింద వేటగాడు ఉన్నాడు!" అని గట్టిగా అరిచింది. ఆ అరుపులు వినగానే కుందేలు, సింహం, ఏనుగు గబుక్కున వెనక్కి పరుగెత్తాయి.

అంతలోనే వేటగాడు ప్రేలుడు పదార్థాన్ని పేల్చేశాడు. ఆ ప్రేలుడుకు వంతెన అంతా కుప్ప కూలి పోయింది.

కుందేలు, సింహం, ఏనుగు "అమ్మయ్య ! ఎంత ప్రమాదం తప్పింది! ఈ ఉడత సాయం చెయ్యకపోతే మనం కూడా ఈ వంతెనతోబాటు కూలిపోయి ఉండేవాళ్ళం. ఇంత మంచి మిత్రుడినా, మనం చంపాలను కున్నది?" అని సిగ్గుపడ్డాయి.

సింహం, ఏనుగు, కుందేలలకు ఏమీ కాలేదని గమనించిన వెంటనే వేటగాడు అక్కడినుండి ఉడాయించాడు. అవి మూడూ తలలు వంచుకొని ఎలుక, ఉడతల దగ్గరకు వెళ్ళి క్షమాపణ కోరాయి. మంచిమనసు గల ఉడత, ఎలుక వాటిని క్షమించి అక్కున చేర్చుకున్నాయి. అప్పటి నుండి కుందేలు, సింహం, ఏనుగు, ఎలుక, ఉడతల స్నేహం కలకాలం వర్ధిల్లింది!