ధనపురంలో గోపాలం,కామాక్షి అనే దంపతులుండేవాళ్ళు. గోపాలానికి పక్షులన్నా‌, జంతువులన్నా‌ ఎంతో మక్కువ. వాటిని చేరదీస్తూ ఉండేవాడు. అతనికి పూర్తి వ్యతిరేకం కామాక్షి- ఆమెకు గోపాలం చేష్ఠలు అస్సలు నచ్చేవి కావు.

ఒక రోజు గోపాలం ' మాట్లాడే చిలుకని', ' మనిషి లా ప్రవర్తించే కోతి'ని ఇంటికి తీసుకొచ్చాడు.వాటిని చూడగానే కామాక్షికి అలవి గాని కోపం వచ్చింది: "మీరు రోజురోజుకూ చిన్నపిల్లాడిలా మారిపోతున్నారు- వీటిని ఇంటికెందుకు తీసుకొచ్చారు?" అంటూ పెద్ద గొడవ పెట్టుకున్నది. "ముందు వీటిని బయటకు పంపిస్తారా, లేదా?" అని అరవటం మొదలుపెట్టింది.

మామూలుగా అయితే గోపాలం భార్య మాట వినేవాడే, కానీ ఆమె అలా రచ్చ చేయటం అతనికి నచ్చలేదూ సరికదా, కోపం కూడా తెప్పించింది. అందుకని అతను కటువుగా "ఇవి ఇంట్లోనే ఉండాలి. నాఇష్టం- నేను మాత్రం వీటిని ఇంట్లోనే ఉంచుతా!" అని, పంజరాన్ని ఇంట్లో తగిలించి, కోతిని ఓ మూలన కట్టివేశాడు. ఆ రోజు నుంచి భార్యా భర్తల మధ్య మౌనం రాజ్యమేలింది.

కామాక్షి ప్రతిరోజూ చిలుకను, కోతిని చీదరించుకునేది. గోపాలం మాత్రం వాటిని ప్రాణ ప్రదంగా చూసుకునేవాడు.

ఒక రోజు రాత్రి, పేరుమోసిన గజదొంగ గంగులు వీళ్ళ ఇంటిలో జొరబడ్డాడు. ఆ అలికిడికి కామాక్షికి మెలకువ వచ్చి కేకలు వేయబోయింది. వెంటనే గంగులు తన చేతిలోని కత్తిని ఆమె మెడకు ఆనించి 'అరిచావంటే చంపేస్తా' అని బెదిరించి, ఆమెను స్థంభానికి కట్టి పడేసాడు. అటుపైన గోపాలానికీ‌ అదే గతి పట్టింది. వాళ్ళు ఇద్దరూ ఇక నోరు మెదపకుండా కట్టేసాక, వాళ్ళను వదిలి ఇనపపెట్టె ఉన్న గదిలోకి వెళ్ళాడు గజదొంగ.

ఇదంతా గమనిస్తున్నై, కోతీ చిలుకా. మాట్లాడే చిలుక కోతితో- మెల్లగా అన్నది" మిత్రమా, చూశావుగా!? దొంగ ఆ గదిలోకి వెళ్ళాడు! నిన్ను కట్టిన త్రాడు బాగానే పొడవు ఉన్నది- తొందరగా రా, దొంగ దూరిన గది తలుపుకు గడియ వేసేయ్!" అని. ఒక్క ఉదుటున ముందుకు దూకిన కోతి తక్షణం గది తలుపులు మూసి, గడియ వేసేసింది.

జరుగుతున్నది చూసిన గోపాలం, కామాక్షిలు నోళ్ళు వెళ్ళబెట్టారు. కోతి వెళ్ళి వాళ్ళ కట్లు విప్పేసింది. అంత పేరు మోసిన గజదొంగను పట్టించినందుకు పోలీసులు వాళ్ళను ఎంతగానో మెచ్చుకున్నారు. పెద్ద బహుమతినే ఇచ్చారు.

"చూశావా, ఈ మామూలు జంతువులు మనకు ఎంత సహాయం చేశాయో, ఆపదలో?" అన్నాడు గోపాలం, కామాక్షితో.

"నన్నుక్షమించండి! ఇకమీద అన్ని ప్రాణులనూ గౌరవిస్తాను- వేటినీ‌ తక్కువ చేసి చూడను" అన్నది కామాక్షి తలవంచుకొని.