అనగా అనగా ఒక ఊరు ఉండేది. ఊరు చుట్టూ అడవి. అడవిలో చాలా ఏనుగులు ఉండేవి. ఎండాకాలం, అడవిలో ఒక ఏనుగుకు మేత సరిగ్గా దొరకలేదు. పాపం బాగా ఆకలి అయినట్లుంది, ఊళ్ళోకి జొరబడింది- ఏమైనా తినేందుకు దొరుకుతుందేమోనని. అయితే అట్లా తినేందుకు ఏదైనా దొరికేలోపుగానే, ఒక తియ్యని సువాసన దాని ముక్కుపుటాలను ఘాటుగా తాకి, దాని నోరు ఊరించింది.

ఏనుగు ఆ వాసనను పట్టుకొని నడుచుకుంటూ పోయింది. ఊళ్ళో మిగతా ఇళ్ళకు కొంచెం దూరంగా, ఎడంగా ఉన్న పూరి గుడిసె ఒకటి దాని ముక్కును ఆకర్షించింది. సువాసన ఆ గుడిసె లోంచే వస్తున్నది. గుడిసె కూడా ఏమంత గట్టిగా లేదు. గోడకున్న రంధ్రం లోంచి తలను లోపలికి దూర్చి చూసింది ఏనుగు. తొండాన్ని గుడిసె లోపలికంటా జొనిపి, వాసన ఎక్కడినుండి వస్తున్నదో కనుక్కున్నది.

ఆ పాకలోనే ఒకడు దొంగతనంగా నాటు సారాయి తయారు చేస్తుంటాడు. గుడిసెలో మూలగా ఉంచిన కుండలోని సారాయి వాసనే, ఏనుగును ఆకర్షించింది! అట్లా ఆ ఏనుగు బయటినుంచే తన తొండాన్ని కుండలోకి ముంచి, ఒక్క దెబ్బకు కుండను పూర్తిగా ఖాళీ చేసింది.

అట్లా కడుపునిండా నాటు సారాయి తాగటంతో దాని దాహం తీరింది- ఇప్పుడు దానికి రెండింతలు ఆకలి మొదలైంది.

నిజానికి ఖాళీ కడుపుతో, తొందర తొందరగా సారాయి త్రాగటం ప్రమాదం. అంత పెద్ద ఏనుగూ ఆ నాటు సారాయి దెబ్బకు తట్టుకోలేకపోయింది. కడుపు నిండా సారాయినె పెట్టుకొని, అది అట్లా అట్లా తూలుకుంటూ నడిచిపోయింది. ఒక కిలోమీటరు కూడా పోకనే, సారాయి దెబ్బకు నేలమీద బారున పడిపోయింది. పడిపోయిన మరుక్షణం అది స్పృహ తప్పింది, ఇక కదలక మెదలక అలాగే పడి ఉండిపోయింది.

తెల్లవారేసరికి, చనిపోయిన ఏనుగు గురించిన వార్త గ్రామంలో దావానలంలా వ్యాపించింది. ఏనుగు మృతికి కారణమైన దొంగసారా తయారీదారుడు తన సామాన్లన్నీ ఎత్తుకొని నిశ్శబ్దంగా పరారయ్యాడు.

మిగిలిన గ్రామస్తులందరూ చచ్చిపోయిన ఏనుగు చుట్టూ గుమిగూడి, ఆ ఏనుగు ఎవరి స్థలంలోనైతే చచ్చి పడి ఉన్నదో ఆ రైతును ఓదార్చేందుకు ప్రయత్నించసాగారు: ఎందుకంటే, ఏదైనా అడవి జంతువు ఒకవేళ దానంతట అదే మన పొలంలోకి వచ్చి చచ్చిపోయినా సరే, 'దాన్ని మనం చంపలేదు' అని నిరూపించుకునే బాధ్యత మనదే- మన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోనంత వరకూ మనం దోషులమే! అటవీ శాఖ అధికారులు, పోలీసులు మనల్ని వేధించుకు తింటారు! ఈ సందర్భంలో మాత్రం గ్రామస్తులందరూ కలిసి తీర్మానించుకున్నారు- రైతు అమాయకుడు- తమలో‌ఒకడు- అతనిని ప్రభుత్వ అధికారులకు అప్పగించి ఊరుకునే ప్రశ్నే లేదు.

అటవీ శాఖ అధికారి తన అనుచరులను వెంట బెట్టుకొని సంఘటనా స్థలికి వచ్చాడు. పరిస్థితిని మొత్తం సమీక్షించాడు. గ్రామస్తులతో వివరంగా చర్చించాడు. చివరికి అతను అన్నాడు-"నేను ఈ రైతు మీద ఏ కేసూ పెట్టను. ఏలాంటి విచారణా లేకుండా ఇతన్ని విడిచిపెట్టేస్తాను". చాలా దయగల అధికారి అన్నమాట! "అయితే ఒక షరతు-" అన్నాడాయన! "గ్రామస్తులందరూ నాతో ఒక ఒప్పందానికి రావాల్సిఉంటుంది!" ఏమిటట, ఆ ఒప్పందం?-

ఆ అధికారి ఈ ఏనుగు మృతిని 'సహజ మృతి'గా ధృవీకరిస్తాడు- ఏనుగు శరీరాన్ని పూడ్చి పెట్టేందుకు గాను గ్రామస్తులు పెద్ద గొయ్యి తవ్వాలి. అలా గొయ్యి త్రవ్వినందుకుగాను ఆ అధికారే వాళ్ళకు వెయ్యి రూపాయలు ఇస్తాడు! మరి ఇంకేమిటి, సమస్య?- అసలు కిటుకు ఏంటంటే- ఏనుగు శవాన్ని పూడ్చిపెట్టేముందుగా దాని దంతాలు రెండింటినీ అతను తీసేసుకుంటాడు- ఈ రకంగా అందరికీ‌ లాభమే! ఎలాగుంది?

గ్రామస్తులందరూ‌ ఒప్పుకున్నారు.

అయితే ఇదంతా అయ్యేసరికి సూర్యాస్తమయం అయిపోవచ్చింది. అటవీ శాఖాధికారి దయగలవాడు; మాట మీద నిలబడేవాడు కూడాను- తను ఇస్తానన్న వెయ్యి రూపాయలూ ఆయన గ్రామస్తులకు ఇచ్చేశాడు. ఏనుగు దంతాలు దెబ్బ తినకుండా కోసేందుకు కొంత సామగ్రి అవసరం‌ ఉంది- ఆయన ఆ సామాన్లు తీసుకొని మరునాడు ఉదయమే వస్తానన్నాడు. ఆయన వచ్చేసరికి గ్రామస్తులు తమ వంతు పనీ పూర్తిచేసి ఉండాలి. ఆయన రాగానే, ఏనుగు దంతాలు తీసెయ్యగానే ఏనుగు శరీరాన్ని పూడ్చి పెట్టెయ్యచ్చు.

గ్రామస్తులంతా ఆసరికి బాగా అలిసిపోయారు. తమకు వచ్చిన వెయ్యి రూపాయలతో‌ మంచి పార్టీ చేసుకుందామని నిర్ణయించుకున్నారు అందరూ. పాటలు, సారాయి, నాట్యాలతో రాత్రంతా పెద్ద హంగామా జరిగింది. తెల్లవారు జామున, ఇంకా నిద్ర కళ్లతోటే గ్రామస్తులంతా పారలు, పికాసులు, తట్టలు, తాళ్లు తీసుకొని, తాము గుంత తవ్వవలసిన ప్రదేశానికి బయలుదేరి వెళ్ళారు.

ఆలోగా మన ఏనుగుకు తెలివొచ్చింది. అది ఇంతసేపూ పడి ఉన్నది సారాయి మత్తులోనే! ఆ సంగతి తెలీక, అది చచ్చిపోయిందనుకున్నారు అందరూ! అది మెల్లగా కదిలి, తన తల ఎత్తి, కాళ్ళు నాలుగూ జాడించి, బరువైన తన శరీరాన్ని రెండు మూడు సార్లు విరుచుకొని, తూలుతూనే లేచి నిలబడ్డది. ఇంకా మసక మసక గానే, మత్తుగానే ఉంది అది- తల విదిలించి చూసేసరికి- జనాలు దాని దగ్గరికి వస్తుండటం కనబడింది! అకస్మాత్తుగా దాని మత్తు మొత్తం వదిలిపోయింది! ఒక్కసారి బిగ్గరగా అరిచి, వాళ్ళమీదికి దూకుతున్నట్లు ఒక్క గెంతు గెంతిందది. నిద్రకళ్ళతో జోగుతూ వస్తున్న గ్రామస్తులు ఒక్కదెబ్బకు కకావికలయ్యారు. ఏనుగు ఉన్న దిక్కును వదిలి మిగిలిన అన్ని దిక్కుల్లో దేన్నీ వదలకుండా పరుగులు పెట్టారు. అందరూ పారిపోయారనీ, తనకి ఇక ప్రమాదం లేదనీ అర్థం అయ్యాక ఏనుగు మరోసారి బిగ్గరగా అరిచి, వెనక్కి తిరిగి అడవిలోకి వెళ్ళిపోయింది- తన ప్రశాంత జీవితాన్ని కొనసాగించుకునేందుకు.

"చచ్చిపోయిన ఏనుగు తిరిగి ఎలా లేచి నిలబడింది?" ధైర్యం కూడగట్టుకుని మళ్ళీ ఒకచోట సమావేశమైన గ్రామస్తులకు ఈ సంగతి అర్థమయ్యేందుకు చాలా సేపే పట్టింది. ఆలోగా అటవీ శాఖాధికారిగారు విచ్చేశారు- తన సామాన్లన్నీ వెంటబెట్టుకొని. గ్రామస్తులు ఆయన చుట్టూ చేరి, తమకు అర్థమైన 'సారాయి త్రాగి పడిపోయిన ఏనుగు' కథను ఆయనకు వివరించేసరికి, ఏనుగు దంతాలతో తన పంట పండిందనుకొని ఆయన నిర్మించుకున్న ఆశల సౌధం మొత్తం కుప్పకూలింది. ఇప్పుడాయనకు తన వెయ్యిరూపాయలు వెనక్కి వస్తే చాలు!

గ్రామస్తులు నవ్వారు- "మేం కూడా మీ వెయ్యి రూపాయల్ని తాగేశాం సార్!" అన్నారు, ఆఫీసరు గారికి ధన్యవాదాలు చెప్పి ఇకిలిస్తూ.