జపాన్‌లోనూ, చైనాలోనూ బహుళంగా విస్తరించిన బౌద్ధ శాఖల్లో "జెన్" శాఖ ఒకటి. జెన్ గురువులు జీవన విధానాన్నీ, తాత్విక దృష్టినీ మిళితం చేసి, "సూటిగా" చూడటాన్ని నేర్పించేవాళ్ళు, శిష్యులకు.
అనగా అనగా చాలా రోజులక్రితం అలాంటి ఒక గొప్ప జెన్ గురువుగారు ఉండేవారు. ఆయన "అత్యంత మెలకువతో కూడిన ధ్యానం" ఒకదాన్ని సాధన చేస్తుండేవాడు- అంటే ఎప్పుడూ మెలకువతో ఉండాలని ప్రయత్నించేవాడన్నమాట.
అయితే ఎవరైనా పడుకొని నిద్రపోయేటప్పుడు "మెలకువ"తో ఎట్లా ఉంటారు, ఉండలేరు కదా? అందుకని, ఆయన కూర్చొనే నిద్రపోవటం సాధన చేశాడు. ఎప్పుడూ కూర్చొనే ఉండేవాడు, చకిలంమొకిలం (బాసింపట్లు) వేసుకొని- ఎప్పుడోగాని నిద్రకూడా పోయేవాడు కాదు. రోజంతా సీరియస్‌గా కూర్చొని ధ్యానమే చేస్తూ ఉండేవాడు. అట్లా చేస్తే తప్ప విముక్తి లభించదని నమ్మేవాడు మరి!
ఆయనకు బుద్ధి చెప్పాలనుకొని, బోధిసత్త్వుడు స్వయంగా ఆయనకు శిష్యుడిగా వచ్చి చేరాడు.
వచ్చినప్పటినుండీ ఆ శిష్యుడు విపరీతమైన బద్ధకాన్ని ప్రదర్శించటం మొదలుపెట్టాడు. రోజూ ప్రొద్దునే ప్రార్థన సమయాన్ని సూచించే గంట మ్రోగిన తర్వాత కూడా వాడు పడక దిగేవాడు కాదు. అరగంట గడిచినా ఇంకా ముసుగుతన్ని పడుకొనే ఉండేవాడు. గురువుగారికి ఈ సంగతి తెలిసి చాలా కోపం వచ్చింది.
శిష్యుడిని పిలిపించి గట్టిగా కోప్పడ్డారు: "నువ్వు నా శిష్యుడిగా చేరావు సరే- కానీ రోజంతా పడుకొని నిద్రపోతూ ఇంత బద్ధకంగా ఎందుకుంటున్నావు? ఇక్కడి ప్రవర్తనా నియమావళి ఏం చెబుతున్నదో నీకు అర్థం కాలేదా? "గంట మ్రోగిన తర్వాతకూడ నిద్రలేవక, పడక దిగనివాడు తదుపరి జన్మలో పాముగా పుట్టి, తన బద్ధకానికి తగిన ఫలితాన్ని అనుభవిస్తాడు" అని అంత సూటిగా చెప్పామే?" అని.
శిష్యుడు జవాబిచ్చాడు- "గురువుగారూ! ఎప్పుడూ పడుకొనీ, పడుకొనీ ఉంటాను గనక వచ్చే జన్మలో నేను పాముగా పుడతానని శలవిచ్చారు తమరు- మరి తమ మాటేమిటి? ఎప్పుడూ కూర్చొనీ-కూర్చొనీ తమరు వచ్చే జన్మలో కప్పగా పుట్టాలి- అంతేగా?" అని.
గురువుగారు క్రిందికి వంగి ఒక ఇటుకను చేతులోకి తీసుకొన్నారు- ఇంకొక బండతో దాన్ని పాలిష్ చేయటం మొదలు పెట్టారు.
శిష్యుడు కొంతసేపు చూసి "ఏం చేస్తున్నారు?" అని అడిగాడు.
"ఈ ఇటుకను సానపట్టి అద్దంలాగా చేయాలని చూస్తున్నాను- కానీ ఎంత పాలిష్ చేసినా ఈ బండ అద్దం అయ్యేటట్లు లేదు" అన్నారు గురువుగారు.
"అవునవును- బాగా చెప్పారు. బాసింపట్లు వేసుకొని ఎంత కూర్చున్నా బుద్ధుడు అవ్వలేరు ఎవ్వరున్నూ" అని శిష్యుడు అంతర్థానం అయిపోయాడు.
ఆ క్షణంలోనే గురువుగారి ప్రజ్ఞ మేల్కొన్నదట!