అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యం పేరు విష్ణుపురం. అక్కడ రాజు వీరభద్ర. అదే రాజ్యంలో ఒక జైలు ఉంది. తను ఓడించిన రాజులను చంపకుండా అక్కడికి తీసుకొని వచ్చి అందులో బంధించేవాడు ఆయన.
కొంత కాలానికి ఆ రాజ్యంలో సైన్యాధిపతి పదవి ఖాళీ అయ్యింది. తను ఓడించిన రాజులలోనుండి ఒక శక్తివంతమైన రాజును తీసుకొని, తన సైన్యాధిపతిగా చేర్చుకోవాలనుకున్నాడు వీరభద్ర. కానీ 'సైన్యాధిపతి' అంటే మామూలు కాదు- అతడు యుద్ధంలో ముందుండి సైన్యాన్ని నడిపించాల్సి ఉంటుంది. కాబట్టి "సింహంతో యుద్ధం" ఎవరైతే చేస్తారో- వారికే ఆ పదవి అప్పగించాలి అని రాజు అనుకున్నాడు.
అయితే ఆ జైలులో ఎవరూ దానికి ఒప్పుకోలేదు. అందరినీ అడగ్గా, చిట్టచివరికి ఒక రాజు ఒప్పుకున్నాడు. ఆ రాజు పేరు విష్ణు. వీరభద్ర రాజు విష్ణు నిర్ణయాన్ని మెచ్చుకున్నాడు. తరువాతి రోజునే యుద్ధం జరగాలని నిర్ణయించాడు.
ఆలోగా మిగతా రాజులంతా విష్ణు దగ్గరికి వచ్చి "ఒరేయ్, నీకు పిచ్చి పట్టినట్టు ఉంది. సింహాన్ని చూస్తే చాలు- ఎవరికైనా వణుకు పుట్టుకొస్తుంది. నువ్వు దానితో యుద్ధం చేసే సంగతి అటుంచు- అసలు దాన్ని చూశాక ప్రాణాలతో ఉంటావో లేదో" అని విష్ణును నిరాశపరచారు. విష్ణు వాళ్ల మాటలు పట్టించుకోకుండా నిశ్శబ్దంగా కూర్చొని వింటూ ఉన్నాడు.
తరువాతి రోజున యుద్ధం ప్రారంభించేముందు రాజు వీరభద్ర "విష్ణూ! సింహంతో యుద్ధంచేయటానికి నీకు ఏ ఆయుధం కావాలో కోరుకో" అని అడిగాడు.
విష్ణు నవ్వి 'నాకు ఒక నలుపు రంగు గుడ్డ కావాలి' అని అడిగాడు. రాజు ముందు కొంచెం ఆశ్చర్యపోయాడు గానీ, వెంటనే "సరే" అని విష్ణుకి ఒక పెద్ద- నలుపు రంగు గుడ్డను ఇచ్చాడు.
యుద్ధం మొదలయ్యింది. సింహాన్ని యుద్ధరంగంలోనికి దింపారు. విష్ణు తన నలుపు గుడ్డతో యుద్ధభూమిలోనికి దిగాడు. సింహానికి చాలా ఆకలిగా ఉంది. బోను తెరచిన వెంటనే అది విష్ణువైపు పరుగెత్తటం మొదలుపెట్టింది. దాన్ని తన దగ్గరికి రానిచ్చి, విష్ణు తన చేతిలో ఉన్న నలుపు రంగు గుడ్డను దాని కళ్ళపైన పడేట్లు గిరాటు వేశాడు. మరుక్షణంలో దానిపైకెక్కి, ఆ గుడ్డను దాని కళ్ళకి గట్టిగా కట్టేశాడు!
పాపం సింహానికి ఏమీ కనిపించలేదు- ఒక్క క్షణంలో దాని ప్రపంచం మొత్తం చీకటైపోయింది! ఇక అది అటూ-ఇటూ ఎంత వేగంగా పరుగుతీసిందంటే, అటు పోయినా, ఇటు పోయినా అది ఆ యుద్ధరంగపు గోడలకి గుద్దుకుంది!. పాపం దాని తలంతా రక్తంతో తడిసిపోయింది! చివరికి విష్ణుకే దానిమీద జాలి వేసి, మెల్లగా దాని కళ్ళపైనుండి నలుపు గుడ్డను విప్పేసి, రక్తం వచ్చిన చోట కట్టాడు. సింహంతో యుద్ధం చేసిన విష్ణునే తన సైన్యాధిపతిగా స్వీకరించాడు రాజు.
కాబట్టి ధైర్యం ఉంటే ఏదైనా సాధించవచ్చు.