బాల హనుమంతుడు పరిగెత్తుకుంటూ ఇంట్లోకెళ్ళాడు. అమ్మ కోసం చూశాడు. అమ్మ ఎక్కడా కనిపించలేదు. బయటికి వచ్చి ఇంటి చుట్టు పక్కల చూశాడు. బయట కూడా లేదు! మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి ప్రతి గదిలోనూ చూశాడు. "అమ్మా, అమ్మా" అని బిగ్గరగా పిలిచాడు. జవాబు లేదు.
ముందు గదిలో తివాచీ చుట్ట చుట్టి ఉంది. ఆ మూలన మనిషి ఎత్తున ఒక శిల్పముంది. అది ఇంట్లోకి కొత్తగా వచ్చినట్లుంది. ఇన్నాళ్ళూ లేదది. ఆఖరికి తను పొద్దున ఆడుకోవడానికి బయటికి వెళ్ళినప్పుడు కూడా లేదు.
వంటిట్లికి వెళ్ళి చూశాడు. అక్కడ అమ్మ వండి ఉంచిన పిండి వంటలున్నాయి. నోరూరిస్తుంటే గబుక్కున ఒక లడ్డూ నోట్లో వేసుకున్నాడు. బయట ఏదో అలికిడి వినిపించింది. చెంగుమని గెంతి పెరట్లోకి వెళ్ళాడు. చెట్ల ఆకులు చిన్నగా కదిలాయి. అటు వైపు చూశాడు. తన స్నేహితులెవరో తనతో దాగుడు మూతలు ఆడుతున్నారు. ఇది ఆడుకునే సమయమా? అమ్మ ఎక్కడుందో వెతకాలి.
తన స్నేహితుల పేర్లు పెట్టి గట్టిగా పిలిచాడు. అక్కడక్కడా ఎవరో కొమ్మల మీద గెంతి, ఆకుల మాటున దాక్కోవడానికి ప్రయత్నిస్తున్న చప్పుడే వినిపిస్తోందికానీ, ఎవరూ బదులు పలకరే? "మా అమ్మని చూశారా? ఇంట్లో లేదు. ఎక్కడికి వెళ్ళిందో తెలీదు!" అని బిగ్గరగా అరిచాడు. ఇంకొంచెం అలికిడే తప్ప సమాధానం లేదు.
ఇంతలో "హనుమంతూ!" అని ముందు గదిలోంచి ఎవరో పిలిచినట్లనిపించింది. అమ్మ గొంతులా ఉంది. పరిగెత్తుకు వెళ్ళి చూస్తే అమ్మ లేదు. కానీ తివాచీ పరిచి ఉంది. గోడల మీద తీగెలు అలంకరించి ఉన్నాయి. చూరు నుంచి వేళ్ళాడుతూ సూర్యుడిలా కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ గాజు బంతి ఉంది. తను సూర్యుడిని పండు అనుకుని పట్టుకోబోయిన విషయం గుర్తుకు వచ్చి మెల్లగా నవ్వుకున్నాడు హనుమంతుడు. అనాలోచితంగా ఆ బంతిని పట్టుకోవడానికి ఎగిరాడు. అది కాస్త పైకి జరిగింది. ఆశ్చర్యపోయాడు. అందుకోవడానికి మళ్ళీ పైకి ఎగిరాడు. ఇంకాస్త పైకి జరిగింది అది. ఈ సారి ఒక్క ఉదుటున మెరుపు వేగంతో పైకెగిరి ఆ బంతి పైకి జరిగే లోపు, మెళుకువతో పట్టుకున్నాడు. చుట్టూ చప్పట్లు, కిచ కిచలు, కేరింతలు, నవ్వులూ వినపడ్డాయి. తన స్నేహితులందరూ వాళ్ళు దాకున్న చోట్లనుంచి ఒక్క సారిగా బయటకి వచ్చారు. ఇంతకీ అమ్మేదీ?
కొత్తగా కనిపించిన శిల్పం వెనక నుంచి వచ్చి బుగ్గ మీద ముద్దు పెట్టింది. "ఎప్పుడూ అల్లరి చేస్తూ నన్ను కంగారు పెడుతుంటావు గదా. ఇప్పుడు నా వంతు!" అంది. అర్థం కానట్టు చూస్తున్న హనుమంతుడిని దగ్గర తీసుకుని "ఈ రోజు నీ పుట్టినరోజురా, కన్నా!" అని ఆశీర్వదించింది.