ఒక ఊరిలో బుడమకాయంత బుడ్డోడు ఉన్నాడంట. వానికి గురిగింజంత పెడ్లాం. వాళ్ళకి పుట్టగోసంత జొన్నతోట. ఆ జొన్నతోటలో చక్కని పంటంట. కానీ ఎప్పుడు చూసినా ఆ జొన్నతోటని గువ్వలు తినేస్తుండేవంట.
ఒక రోజూ బాగా వాన వస్తుంది. ఆ రోజు సంతకి పోయినవాళ్ళంతా తడిసిపోయి వస్తుంటారు. కానీ బుడ్డోడు మాత్రం తడవలేదు. ఎందుకంటే వాడు తన బట్టల్ని విప్పేసి మరవబండ కింద పెట్టింటాడు. తనూ ఆ బండకింద దూరింటాడు. వాన నిలిచిపోయిన తరువాత బట్టలు వేసుకున్నాడు.
అప్పుడు దావంటి దాసప్ప వస్తున్నాడు. దాసప్ప బుడమకాయంత బుడ్డోని చూసి, "మేమంతా నానిపోయినాము, వీడేమో నానిపోలేదు" అని బుడమకాయంత బుడ్డోని తాకి పోతాడు. దాసప్ప బుడమకాయంత బుడ్డోని తాకి పోయి, "ఏమన్నా నువ్వు తడిసిందేలేదు? ఆ రాసెం నాకూ చెప్పు" అంటాడు.
బుడమకాయంత బుడ్డోడు "నాకొక మంత్రం వచ్చు" అంటాడు. "ఆ మంత్రం ఏదో నాకు చెప్పన్నా" అంటాడు దాసప్ప.
"అలాగే చెప్పుతాను, మరి నువ్వు కూడా నాకొక మంత్రం చెప్పు" అంటాడు బుడ్డోడు.
" 'నాజొన్న తోటలో గువ్వలన్ని టింగరబుల్లయ్య ' అను- నీ తోటలో ఉండే గువ్వలన్నీ చనిపోతాయి" అని ఒక మంత్రం చెప్పాడు దాసప్ప. "మరి నీ మంత్రం చెప్పు" అన్నాడు.
"వాన వచ్చినప్పుడు బట్టలు విప్పేసి మరవ బండకింద దూరుకో" అని చెప్తాడు బుడ్డోడు.
"ఓసి అంతేనా, నీ మంత్రం!" అని దావంటి పోతాడు దాసప్ప.
అప్పుడు బుడమకాయంత బుడ్డోడు సంతోషపడి పోయేసి, "నాజొన్న తోటలో గువ్వలన్నీ 'టింగరబుల్లయ్య'" అంటాడు. అప్పుడు గువ్వలన్నీ చనిపోతాయి. బుడ్డోడు వాటన్నిటినీ ఒక గంపలో వేసుకొని ఇంటికెళ్ళి, గురిగింజంత పెండ్లాంని పిలిచి మసాలాలు రుబ్బమంటాడు.
ఆమె మసాలు రుబ్బి , చారు చేసింటే, చాలా బాగా "గుమగుమా"వచ్చింటింది. ఇంక ఆగలేక, ఆమె గబగబ అందులోని ముక్కలన్నీ తినేసి, ఏమీ ఎరగనట్లు ఊరికే కూచొనింటింది. అంతలో వాడువచ్చి బువ్వ పెట్టమంటాడు. అప్పుడు ఆమె ఒట్టి 'పులుసు-పులుసు 'పోస్తుంది.
"ముక్కలేవి?" అంటే "నేను నీళ్లకి పోతే రెడ్డోరి పిల్లి వచ్చి తినిపోయింది" అని చెప్పుతుంది.
బుడ్డోడికి కోపం వచ్చి "రెడ్డోరి పిల్లి 'టింగరబుల్లయ్య ' " అంటానే రెడ్డోరి పిల్లి కాస్తా చనిపోయింటింది.
మళ్ళీ పోయి గువ్వలు పట్టుకొని వస్తాడు వాడు. ఈసారి కూడా ఆమే తినేసి, "కుక్క తినింది" అని అపద్ధం చెప్తుంది- అప్పుడు బుడమకాయంత బుడ్డోడికి సంగతి అర్థమై- "నా పెండ్లాం 'టింగరబుల్లయ్య' " అంటాడు. వెంటనే వాని పెండ్లాం కాస్తా చనిపోయింది.
ఇప్పుడింక వానికి వంట ఎవరు చేసి పెట్టాలి? అందికని వాడు ఒక పెండ్లి లోకి పోయి, వానికి ఇష్టమొచ్చినట్లు రకరకాల తిండిపదార్థాలు తిని, వెంటనే "పెండ్లోల్లందరు 'టింగరబుల్లయ్య'"
అన్నాడు. వెంటనే పెండ్లోల్లందరూ చనిపోయారు.
పెండ్లి కొడుకు, పెండ్లి కూతురు వాని దగ్గరకు పరుగెత్తి కొట్టబోయారు. వెంటనే వాడు "పెండ్లికూతురు, పెండ్లికొడుకు 'టింగరబుల్లయ్య' " అన్నాడు- అదంటే వాళ్ళు కూడా చనిపోయారు.
అప్పుడు బుడమకాయంత బుడ్డోనికి కడుపులో విపరీతంగానొప్పి వచ్చింటింది. ఇంక చూసుకునేవాళ్ళు ఎవ్వరూ లేరని బాధగా కూడా ఉంటింది. చివరికి వాడు కాలే కాలే బండ మీద పడుకొని "నా కడుపు 'టింగరబుల్లయ్య' " అంటాడు- అంతే! వాడు కూడా చనిపోతాడు.