నవీనపురం ఉన్నత పాఠశాల మైదానం-
ఫుట్ బాల్ మ్యాచ్ జరుగుతోంది.
రెండు జట్లూ హోరాహోరీగా ఆడుతున్నాయి.
ప్రేక్షకులు ఊపిరి బిగబట్టి చూస్తున్నారు.
అంతలో ఓ జట్టులోని ఆటగాడు గోలు చేశాడు. ఆవరణంతా చప్పట్లుతో మారుమోగి పోయింది.
“వావ్! అద్భుతమైన గోలు కదూ! ఆట మొదలయ్యాక పావుగంటకి చేసాడు!” మెచ్చుకోలుగా అన్నాడు ఆనంద్!
“ఓస్! ఇదీ గొప్పేనా? అదే నేనైతేనా!? రెండు నిముషాల్లో గోలు చేసేవాడిని!” గొప్పగా అన్నాడు రమేష్! వాళ్ళిద్దరూ తొమ్మిదో తరగతి చదువు తున్నారు. రమేష్ మాటలు విని ఆనంద్ తో పాటు వాళ్ళ క్లాస్ మేట్లు కూడా ముఖముఖాలు చూసుకున్నారు.

~~~~~~~~

ఆదివారం ఉదయం. నరేష్ మార్కెట్ కు బయలు దేరాడు. అమ్మకూరలు తెచ్చి పెట్టమంది మరి! వేగంగా వెళ్తున్న నరేష్ కి రమేష్ ఎదురయ్యాడు.
“హాయ్ నరేష్! మార్నింగ్ షోకి వెళ్దాం, వస్తావా?” అన్నాడు.
“లేదు రా! అమ్మ మార్కెట్ కెళ్ళి రమ్మంది. కూరలు కొనుక్కుని ఇంటికెళ్ళే సరికే గంటన్నర పడుతుంది. టైమ్ చాలదు” నరేష్ చెప్పాడు.
“గంటన్నరెందుకు రా! అదే నేనైతేనా? అరగంటలో పూర్తి చేస్తాను” తలెగరేసాడు రమేష్!

    ~~~~~~

సాయంత్రం స్కూల్ అయిపోయాక అందరూ ఇళ్ళకి బయలు దేరారు.
“ఒరేయ్! నిన్న మా బాబాయి ఊరి నుండి వచ్చాడు. ఇంజనీరింగ్ చదువుతున్నాడు. మానాన్న పాత బైకు మూలన పెట్టేసాం చూడు! అది తుప్పెక్కి ఉంది. దాన్ని ఏ పార్టుకా పార్టు విప్పి, శుభ్రం చేసి, పోయిన పార్టులన్నీ వేసి రిపేర్ చేసాడు. మొత్తం ఒక్కపూటలో చేసేసాడు తెలుసా? ఇప్పుడది కొత్త బైకులా ఉంది!” సంతోషంగా చెప్పాడు రమణ.
“ఓస్! అదీ గొప్పేనా!? అదే నేనైతేనా! ఒక్క గంటలో బాగు చేయగలను” ఠక్కున అన్నాడు రమేష్.

చుట్టూ ఉన్న పిల్లలందరికీ వళ్ళు మండి పోయింది. అందరూ కలిసి రమేష్ కి గట్టిగా బుద్ది చెప్పాలను కున్నారు.

ఓ పదిరోజుల తర్వాత వాళ్ళందరికీ సంక్రాంతి సెలవులొచ్చాయి. ప్రక్క ఊరి దేవాలయం దగ్గర జరిగే జాతరకి క్లాస్ మేట్లు అందరూ కలిసి వెళ్ళారు.

మిఠాయి అంగళ్ళు, దుస్తుల దుకాణాలూ, బొమ్మల కొట్లూ… జెయింట్ వీల్, రంగుల రాట్నాలూ… ఒకటే హడావుడి… ఎటు చూసినా జనమే! కోలాటాలు, డప్పు డాన్సులూ, తప్పెట గుళ్ళు, చెక్కభజనలు! భలే హుషారుగా ఉంది పిల్లలకి.

తెచ్చుకున్న డబ్బులతో ఇష్టమైనవి తిన్నారు, నచ్చినవి కొన్నారు. చెరుకు రసాలు జుర్రుకున్నారు. రంగుల రాట్నాలెక్కి గిర్రున తిరిగారు. నవ్వులూ కేరింతలతో హుషారుగా జాతరంతా తిరిగేసారు. సాయంత్రానికి అంతా తిరుగు ప్రయాణ మయ్యారు. గమనించుకుంటే తమ గుంపులో రమేష్ కనబడలేదు. జాతరలో ఎప్పుడో తమ నుండి వేరుపడిపోయాడని మిగిలిన వాళ్ళకి అర్ధమైంది.

కంగారుగా అంతటా వెదికారు. అంతమంది జనంలో, హడావిడిలో, ఎవరికెవరని? ఎక్కడా రమేష్ కనబడలేదు. వాళ్ళనీ వీళ్ళనీ అడిగారు. ఎవరూ ఆచూకీ చెప్పలేదు.

చివరికి మైకులో ప్రకటనలిచ్చే చోటుకు వెళ్ళి, రమేష్ పేరూ ఊరూ వివరాలు చెప్పి, ప్రకటన ఇప్పించారు. ఎంత సేపు ఎదురు చూసినా, చీకటి పడింది గానీ, రమేష్ జాడలేదు.

ఇక చేసేది లేక ఆనంద్, నరేష్, కార్తీక్ తదితరులంతా, తమ ఊరికి బయలు దేరారు. అప్పటికి బాగా చీకటి పడటంతో ఆటోలు కూడా లేవు. అయినా ‘పదిమందిమి ఉన్నాం, ఆరు కిలోమీటర్లే కదా’ అనుకొని, కబుర్లు చెప్పుకుంటూ నడవ సాగారు.

అల్లంత దూరంలో రమేష్ రోడ్ ప్రక్కన పడిపోయి కన్పించాడు. స్పృహలో లేడు. మిత్రులందరూ ఆందోళన పడి, రమేష్ ముఖం మీద నీళ్ళు చల్లి, సేద తీర్చారు. కళ్ళు తెరిచిన రమేష్ మంచినీళ్ళు తాగి కాస్త స్థిమిత పడ్డాడు.

“ఏమైందిరా? ఎక్కడి కెళ్ళావు?” అందరూ ఒకేసారి కంగారుగా అడిగారు.

“ముందు ఇళ్ళ కెళ్దాం. రేపు తీరిగ్గా మాట్లాడుకోవచ్చు” అన్నాడు ఆనంద్. రమేష్ కి తన చేతిలోని తినుబండారా లిచ్చాడు. పళ్ళిచ్చాడు నరేష్. అవి తిని కాస్త తేరుకున్నాడు రమేష్. వేగంగా నడిచి ఇళ్ళు చేరారంతా!

మర్నాడు రమేష్ కి ఏమైందని మళ్ళీ అడిగారు.

“అది కాదురా! మనం జయింట్ వీల్ దిగాక చూసుకుంటే, మీరంతా కనబడలేదు. మిమ్మల్ని వెదుకుతూ మరో వైపు వెళ్ళినట్లున్నాను. ఎంత సేపు వెదికినా ఎవరూ కనబడలేదు. హడావుడిలో చూసుకుంటే నా జేబులో డబ్బులు లేవు. ఎంత ఏడుపొచ్చిందో! ఆకలి వేసింది. ఏమైనా తిందామంటే జేబులో రూపాయి కూడా లేదు. ఆటోకి కూడా డబ్బుల్లేక, నడుచుకుంటూ మన ఊరికి బయలు దేరాను.

వస్తుంటే దారిలో…” చెప్పటం ఆపాడు రమేష్. భయంతో అతడి వళ్ళు వణుకుతోంది.

“ఏమైందిరా! భయం లేదు చెప్పు” అన్నారు మిత్రులు.

“దారిలో దొంగ ఎదురయ్యాడు. కత్తి చూపించి “జేబులో డబ్బులన్నీ ఇవ్వు” అన్నాడు. నా జేబులో డబ్బుల్లేవని చెబితే నమ్మలేదు- సరికదా, “అబద్ధాలాడతావా? బుర్ర బద్దలు కొడతా” అంటూ చెయ్యెత్తాడు. భయంతో చెమటలు పోసాయి. వదిలెయ్యమని దండం పెట్టా. గుడ్లురిమాడు - అంతే గుర్తుంది!. కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా మీరున్నారు. మీరే రాకపోతే నేనేమై పోయేవాడినో” ఇప్పటికీ భయంతో వణుకుతూ అన్నాడు రమేష్!

“అదేంటిరా! అక్కడున్నది నువ్వు కదా- ‘అదే నేనైతేనా, ఏదైనా చెసెయ్య గలను!’ అంటావుగా!? ఒక్క మామూలు దొంగ ఎదురయ్యేసరికే, భయపడి స్పృహ తప్పి పడిపోయావా?” రమేష్ ని నిశితంగా చూస్తూ అన్నాడు ఆనంద్!

బిక్కముఖం వేసాడు రమేష్!

“అవున్రా! 'అదే నేనైతేనా-' అంటూ ఎవరినైనా ఎగతాళి చేసేవాడివి కదా! ఆ పరిస్థితుల్లో ఏం చెయ్యాలో ఒక్క ఐడియా కూడా రాలేదా?” నరేష్ అన్నాడు.

“ఆలోచిస్తే ఎన్ని మార్గాలు లేవు? మైకు దగ్గరికెళ్ళి 'మమ్మల్ని వచ్చి కలుసుకొ'మ్మని ప్రకటన ఇప్పించవచ్చు; మన ఊరి వాళ్ళు ఇంకా చాలామందే వచ్చి ఉంటారు కదా, జాతరకి? వాళ్ళెవరైనా కన్పిస్తారేమోనని వెతికి, నీ పరిస్థితి చెప్పి, డబ్బు అప్పు తీసుకోవచ్చు, సాయం అడగ వచ్చు!” రమణ అన్నాడు.

“అంతే కాదురా! మన ఊరి వాళ్ళు కొందరు, జాతరలో అంగళ్ళు పెట్టారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, విషయం చెప్పి, సాయం అడగాల్సింది కదా!” మహేష్ అన్నాడు.

“ఆ ఆలోచనలేవీ రాలేదురా?” బేలగా చూస్తూ అన్నాడు రమేష్.

“పోనీ! ఒంటరిగా గాకుండా, నలుగురితో కలిసి మన ఊరికి బయలు దేరాల్సింది!” మందలిస్తున్నట్లుగా అన్నాడు శ్రీకాంత్.

“సరే ఇవేవీ కాదు- ‘అదే నేనైతేనా!’ అనుకుంటూ… దొంగని- సినిమా హీరో మాదిరి- ఈడ్చి ఒక్కటి తన్నాల్సింది!” అన్నాడు ఆనంద్.

ఒక్కసారిగా అందరూ ఘొల్లున నవ్వారు.

రమేష్ సిగ్గు పడ్డాడు. “సారీ రా! ఇప్పుడు నాకు అర్ధమైంది. ఏపనై చెయ్యటం కష్టం. మాటలు రువ్వడం చాలా తేలిక. అది గ్రహించకుండా అందర్నీ తక్కువ చేసి మాట్లాడాను. ఇక నుండి అలా ప్రవర్తించను” అన్నాడు నిజాయితీగా.

“శభాష్! తప్పు తెలుసుకోవటం, సరిదిద్దుకునే ప్రయత్నం చెయ్యటం మంచి లక్షణం. పొరపాటు మానవ సహజం” అన్నాడు దొంగ! హఠాత్తుగా దొంగ ప్రత్యక్షమయ్యే సరికి రమేష్ బిత్తర పోయాడు.

అతడి అయోమయం చూసి అందరూ మరోసారి నవ్వారు.

రమణ, రమేష్ భుజం మీద చెయ్యేసి “సారీ రా! నీకు వాస్తవం తెలియ జెప్పాలని, మేమంతా కలిసి మా బాబాయి చేత దొంగ వేషం వేయించాము. ఎవరైనా ఏదైనా పని చేస్తుంటే ‘ఓస్! అదెంత?’ అనటం తేలిక. స్వయంగా మనం చేసినప్పుడే వాస్తవం తెలిసి వస్తుంది. అందుకే అలా చేసాం. అంతే గానీ, నిన్ను నొప్పించాలని కాదు. మొదట నువ్వు తప్పిపోయినందుకు కంగారు పడ్డాం. తర్వాత మైకులో ప్రకటన ఇప్పించాం. నువ్వు రాలేదు. ‘సరే’ అని నీ కోసం వెదుకుతుంటే, నువ్వు అప్పటికే మన ఊరి దారిపట్టి కనిపించావు. అప్పుడే ఈ ఐడియా వచ్చింది. బాబాయి దొంగలా నటించి నిన్ను కాసేపు కంగారు పెట్టాడు. అంతే!”అని వివరించాడు రమణ.

“ధ్యాంక్యూ బాబాయ్. నిజంగా మీరు నా కళ్ళు తెరిపించారు” మనస్ఫూర్తిగా అన్నాడు రమేష్.

తర్వాతెప్పుడూ రమేష్ “అదే నేనైతేనా!” అనలేదు. అతడిలో వచ్చిన మార్పుకి అందరూ ఎంతో సంతోషించారు.