అనగనగా శ్రీతు అనే ఒక పేద పాప ఉండేది. శ్రీతు మంచి పిల్ల; చాలా తెలివిగలది కూడా. అయితే దురదృష్టం, ఆ పాప ఇంకా పెద్దదవ్వకుండానే వాళ్ల అమ్మ చనిపోయింది. తండ్రి శ్రీహరి కాస్తా రెండవ పెళ్ళి చేసుకున్నాడు. అట్లా శ్రీతుకి సవతి తల్లిగా వచ్చింది సుమిత్ర.
సుమిత్ర అస్సలు మంచిది కాదు. 'ఏ దిక్కూలేనిది గదా' అని, ఆమెకు శ్రీతుని చూస్తే చాలా చులకన భావం ఉండేది. శ్రీతుని ఆమె చాలా కష్టాలకు గురి చేసేది. బడికి పోనివ్వక, ఏవేవో పనులు చెప్పి సతాయిస్తూఉండేది.
శ్రీహరి ప్రతిరోజూ పొద్దున్నే లేచి, ఆవుల దగ్గరికి వెళ్ళి పాలు పితుక్కొని వచ్చేవాడు. ఒక రోజున ఏదో పని పడి ప్రక్క గ్రామానికి పోయిన శ్రీహరి సమయానికి వెనక్కి రాలేదు. తెల్లవారగానే సుమిత్ర శ్రీతుని పిలిచి "ఆవుల దగ్గరికి వెళ్ళి పాలు పితుక్కురా, పో" అని పంపించింది.
శ్రీతుకేమో పాలు పితకడం రాదు. అయినా ఆవుల దగ్గరికి వెళ్ళి, వాటిని ప్రేమగా పలకరించి, అతి కష్టం మీద పాలు పితికింది ఆ పాప. నిండిన పాల కడవను ప్రక్కన పెట్టి, వెళ్ళి చేతులు కడుక్కుని వచ్చి చూసేసరికి, ఏముంది?- పాల కడవ కాస్తా ఖాళీ!
"అయ్యో! కడవ నిండుగా పిండిన పాలన్నీ ఏమయ్యాయి? ఇప్పుడు పిన్నమ్మ అడిగితే ఏమని జవాబు చెప్పాలి?" అని ఏడుస్తూ అక్కడే కూర్చున్నది శ్రీతు. ఆ పాప దు:ఖానికి అక్కడున్న ఆవుల గుండెలన్నీ కరిగిపోయాయి. అంతలో అక్కడ నాగుపాము ఒకటి ప్రత్యక్షం అయ్యింది. దాని తలమీద ఒక మణి వెలుగులు చిమ్ముతున్నది. ఆ పాము శ్రీతును స్నేహంగా పలకరించి, "నన్ను చూసి భయపడకు- నీ కడవలోని పాలన్నీ త్రాగింది నేనే- నా ఆకలి తీర్చినందుకు ధన్యవాదాలు" అన్నది.
అప్పుడు శ్రీతు కొంచెం ధైర్యం తెచ్చుకున్నది. "నీకు ఆకలిగా ఉన్నదని పాలన్నీ త్రాగేశావు సరే, మరిప్పుడు నా సంగతి? మా పిన్నమ్మనుండి నన్నెవరు రక్షిస్తారు? వేరేవాళ్ళ వస్తువులు తీసుకునేముందు వాళ్ళకు ఒక మాట చెప్పటం పద్ధతి కదా" అన్నది పాముతో.
అప్పుడు పాము "అయ్యో! అంత ఆలోచించలేదమ్మా! ఆకలికి తట్టుకోలేక, పాలు కనబడగానే త్రాగేశాను. నువు ధైర్యంగా ఇంటికి వెళ్ళు. నీకేమీ కాదులే. మళ్ళీ నీకే తెలుస్తుంది" అని శ్రీతుకు ధైర్యం చెప్పి ఇంట్లోకి పంపించింది.
ఇంక చేసేదేముంది? శ్రీతు ఖాళీ కడవనే ఎత్తుకొని ఇంట్లోకి వెళ్లింది. "పిన్నీ పాలు తెచ్చాను- దేనిలో పోయాలి?" అని అడిగింది సవతి తల్లిని. పనిలో మునిగి ఉన్న సుమిత్ర "అక్కడ- ఆ పాత్రలో పొయ్యి" అని ఒక గిన్నెను చూపించింది. శ్రీతు అక్కడికి వెళ్ళి ఖాళీ కడవనే బోర్లించింది అందులోకి-
ఆశ్చర్యం! ఆ పాత్ర నిండిపోయింది పాలతో! చూస్తే కడవ అడుగున ఇంకొన్ని పాలు ఉన్నై- అందుకని శ్రీతు మరొక గిన్నెలోకి వంపింది కడవను. ఆ గిన్నె కూడా నిండిపోయింది! చూస్తూ చూస్తూ ఉండగానే అట్లా ఐదు పెద్ద పెద్ద గిన్నెలు పాలతో నిండిపోయాయి!
అంతలోనే "ఏవి, పాలు?" అని వచ్చి చూసిన సుమిత్రకు ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. అన్ని పాలను ఆమె ఏనాడూ కళ్ళ చూసి ఉండలేదు మరి! మరు క్షణంలో ఆమెకు ఆశ హెచ్చయింది. "సరే! పర్లేదు, బాగానే పిండావు. ఇక మీద ప్రతిరోజూ నువ్వే పాలు పితుక్కొని రావాలి" అని ఆజ్ఞ జారీచేసింది.
ఆ విధంగా, అటు తిరిగీ ఇటు తిరిగీ పని ఒత్తిడి మాత్రం శ్రీతు మీదే పడింది. ఆ పాప చేయాల్సిన పనుల జాబితాకు అదనంగా పాలు పిండే పని కూడా చేరుకున్నది. మర్నాటికి శ్రీహరి ఇల్లు చేరుకున్నప్పటికీ, సుమిత్ర మాత్రం అతన్ని పాలు పితకనివ్వలేదు. ప్రతిరోజూ శ్రీతు పాలు పితకటం, పాము వచ్చి పాలు త్రాగటం, ఐదు గిన్నెల నిండా పాలు తయారవ్వటం- ఇలాగే ఒక వారం రోజుల పాటు కొనసాగింది.
ఏడవ రోజున విచారంగా ఉన్న శ్రీతుని అడిగింది పాము "ఎందుకు శ్రీతూ, అట్లా బాధపడుతూ ఉంటావు, నువ్వెప్పుడూ?" అని. శ్రీతుకు ఏడుపు తన్నుకొచ్చింది. ఆ పాప పాముకు తన గోడంతా చెప్పుకున్నది. ఎవరూ లేరని తనను పిన్నమ్మ ఎంత చులకనగా చూస్తుందో చెప్పింది.
"నీ వయసులో పిల్లలందరూ బడికి వెళ్ళాలి కదా, నిన్ను పంపించరా?" అని అడిగింది పాము. "ఉహు" అని అడ్డంగా తల ఊపింది శ్రీరు.
"నీకు ఇష్టమేనా, బడికి వెళ్ళటం?" అడిగింది పాము. "ఓ, ఎంత ఇష్టమో, చెప్పలేను. చాలా ఇష్టం" అన్నది శ్రీతు.
"అయితే సరే, ఇవాల్టినుండీ నువ్వు బడికి పోతావు, చూస్తూండు" అన్నది పాము.
ఆరోజు కూడా ఎప్పటిలాగానే ఐదు గిన్నెలూ పాలతో నిండాక, శ్రీతు కడవను కడిగి పెట్టేందుకు బయటికి వెళ్ళగానే, సుమిత్ర వెళ్ళి ఆశగా ఐదు గిన్నెల పాలనూ చూసుకున్నది. ఆమె చూస్తూండగానే ఆ పాలన్నీ పాములైపోయాయి! అవన్నీ గిన్నెల్లోంచి బయటికొచ్చి గదిలో ప్రాకటం మొదలు పెట్టే సరికి, పిన్నమ్మ 'కెవ్వు కెవ్వు'మని అరుస్తూ గంతులు వేసింది కొంచెంసేపు.
అంతలో వాటి మధ్యలోంచి తలమీద మణిని ధరించిన నాగ సర్పం లేచి నిలబడింది. "పిన్నమ్మా! మేం అందరం శ్రీతు బంధువులం. నువ్వు ఆ పాపను కష్టపెట్టటం ఎవ్వరూ గమనించట్లేద-నుకుంటున్నావు కదూ? మేం చూస్తూనే ఉన్నాం. శ్రీతును బడికి పంపించట్లేదు; గొడ్డు చాకిరీ చేయిస్తున్నావు; దురాశకొద్దీ పాలు పితికే బరువు కూడా ఆ చిన్ని చేతులమీదే మోపావు. తప్పు కదూ?" అని అడిగింది.
సుమిత్ర పాముకు నమస్కారం పెడుతూ "తప్పు కాయి, నాగన్నా! ఇకమీద శ్రీతును నా బిడ్డలాగా చూసుకుంటాను. ఏ కష్టమూ రానివ్వను. నన్ను నమ్ము" అని కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యింది. పాము సంతోషంగా తల ఊపి మాయమైపోయింది. అటు తర్వాత సుమిత్ర పూర్తిగా మారిపోయింది. శ్రీతును సొంత బిడ్డకంటే మిన్నగా చూసుకున్నది. శ్రీతు బాగా చదువుకొని, తల్లిదండ్రుల పేరు నిలబెట్టింది.