అసలుకు ఎసరు!
టీచర్: 'నారు పోసినవాడే నీరు పోస్తాడు' ఇలాంటి సామెత ఇంకోటి చెప్పరా!
విద్యార్థి: 'పాఠం చెప్పిన వాళ్ళే పరీక్ష రాయాలి' టీచర్!
తెగని బంధం!
యముడు: పిసినారి పాపయ్యను తీసుకురమ్మంటే, అతని ఇనప్పెట్టెను తెచ్చారేంట్రా?
యమకింకరులు: ఇది లేకుండా అతను రావట్లేదు, ప్రభూ!
రోజుకొక్కడు!
టీచర్: రామూ! మన ముఖ్యమంత్రి ఎవర్రా?
రాము: నిన్నా? మొన్నా? ఈరోజా?
నువ్విక చాలు!
సినిమా డైరెక్టర్: ఇదిగో! నువ్వు పది అంతస్తుల మేడ మీదినుండి క్రిందికి దూకాలిప్పుడు.
హీరో: అమ్మో! నాకేమన్నా అయితే ఎలా?
సినిమా డైరెక్టర్: ఏమీ కాదులే, ఇది లాస్టు సీను!
పరవాలేదు!
తండ్రి: హలో డాక్టరుగారూ! మా కొడుకు పెన్ను మింగాడండీ!
డాక్టరు: పరవాలేదు. నేను వచ్చేంతవరకూ పెన్సిల్ తో రాసుకుంటాడులే.
దయ!
ఒక చీమ పరుగెత్తి పోతూ ఉంటుంది-
మరొక చీమ: ఎందుకలా పరుగెడుతున్నావు?
మొదటి చీమ: నా ఫ్రెండు ఏనుగుకు యాక్సిడెంట్ అయ్యింది. రక్తం ఇవ్వటానికి వెళ్తున్నాను.
నేనూ రెడీయే!
భర్త: టిఫిన్ రెడీ అయ్యిందా?
భార్య: లేదండీ! పది నిముషాలు ఆగండి- రెడీ అవుతుంది.
భర్త: అయితే పది నిముషాల్లో నేను హోటల్లో తినేసి వస్తా!
భార్య: అయితే ఆగండి- నేను రెడీ అయి వస్తా!
భర్త: టిఫీన్ రెడీ అయ్యిందా?
ఏవి వచ్చు?
టీచర్: బాబూ! రామాయణాన్ని రాసిందెవరు?
బాబు: తెలియదు టీచర్!
టీచర్: పాండవులలో మధ్యముడి పేరేంటి?
బాబు: తెలియదు టీచర్!
టీచర్: రాముడికి సీత ఏమౌతుంది?
బాబు: తెలీదు టీచర్!
టీచర్(కోపంగా): అసలు నీ పేరైనా తెలుసా-లేదా, నీకు?
బాబు: ఏ వీ రావు టీచర్!
పోతే పోనీ!
కావేరి: అక్కా! ఈరోజు బియ్యంలో రాళ్ళు ఏరటంలేదేంటి?
కీర్తన: ఈరోజు నేను ఉపవాసం కదా, వంట ఆయనొక్కరికే!
బడి ఉంటుంది!
పిల్లవాడు: అన్నా! ఈరోజు బడి లేదా అన్నా?
పెద్దవాడు: పునాది గట్టిదిరా, మన బడి ఎక్కడికీ పోదు- అక్కడే ఉంటుంది.
నెలలు-నేలలు
సోషల్ మాస్టారు: ఏమ్మా! నేలలు ఎన్ని రకాలు? అవి ఏవో చెప్పు!
అమ్మాయి: నెలలు 12. అవి జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రియల్, మే,..
ఎవరు అవసరం?
సభ అధ్యక్షులు: మహిళ వంట చేయటానికి ముఖ్యంగా ఏం కావాలి?
మహిళలు: మహిళ వంట చేయటానికి ముఖ్యంగా భర్త ఉండాలి.
ప్రయత్నం!
తండ్రి: లెక్కల్లో ఇంకా ఎక్కువ మార్కులు సాధించటానికి ప్రయత్నించలేకపోయావా?
కొడుకు: ప్రయత్నిద్దామనుకున్నాను డాడీ! కానీమా లెక్కల టీచరు గారు పేపర్లన్నీ బీరువాలో పెట్టి తాళం వేస్తుంటుంది!
మంచి పిల్లవాడు!
తల్లి: లైబ్రరీకి వెళ్ళినవాడివి, కథల పుస్తకం తెచ్చుకోకుండా 'పిల్లల పెంపకం' పుస్తకం తెచ్చావేమిట్రా? కొడుకు: నన్ను సరైన పద్ధతిలో పెంచుతున్నావో లేదో చూడటానికి, మమ్మీ!
తెలుసా, తెలీదా?
టీచర్: సోమూ! రెండు మూళ్ళు ఎంతరా?
సోము: ఆ మాత్రం తెలీదా, మేడమ్?
టీచర్: నాకు తెలుసులేరా, నువ్వు చెప్పు!
సోము: మీకు తెలిస్తే నన్నెందుకు అడుగుతారు, ఊరుకోండి మేడమ్!
శోకుడు!
టీచర్: 'అశోకుడు రోడ్డుకు ఇరువైపులా చెట్లను నాటించెను' -ఎందుకు?
రాము: రోడ్డు మధ్యలో నాటిస్తే వచ్చే పోయే వాహనాలకు అడ్డం అని!
ఉభయకుశలోపరి!
టీచర్: ఒరేయ్, రామూ! ఒక ఉభయచరజీవి పేరు చెప్పరా!
రాము: కప్ప.
టీచర్: ఒరేయ్, సోమూ! నీకు తెలిసిన కొన్ని ఉభయచరజీవుల పేర్లు చెప్పరా!
సోము: తల్లి కప్ప, తండ్రి కప్ప, పిల్ల కప్ప.