ఒక అడవిలో పెద్ద మర్రి చెట్టు కింద ఒక ముని తన శిష్యులకు పాఠం చెబుతున్నాడు. శిష్యులు అందరూ శ్రద్ధగా వింటున్నారు. వాళ్లలో ఒకడు మాత్రం అక్కడికి వచ్చిన ఎలుకను ఒకదాన్ని గమనిస్తున్నాడు.
అతను చూస్తూండగానే ఆ ఎలుక మర్రిచెట్టు తొర్రలోకి వెళ్ళింది.
గురువుగారి పాఠం కొనసాగుతున్నది. అంతలోనే తొర్రలోంచి బయటికి వచ్చింది ఎలుక. శిష్యుడు దాన్నే చాలా ఆసక్తిగా చూస్తున్నాడు. అంతలోనే ఆ ఎలుక ఎటు వెళ్ళిందోమరి- కనబడలేదు.
శిష్యుడు దానికోసం అటూ ఇటూ చూశాడు. ఎంతకీ కనబడలేదది! చివరికి వాడు దాని సంగతి వదిలేసి, పాఠం వినటం మొదలు పెట్టాడు. ఇంతలోనే మళ్ళీ వచ్చింది ఎలుక- ఎక్కడి నుండి వచ్చిందో మరి! ఈసారీ అది మర్రిచెట్టు తొర్రలోకే వెళ్ళింది. కానీ దాని తోక మాత్రం బయటకు కనబడుతున్నది. శిష్యుడు ఆసక్తిగా చూస్తున్నాడు ఆ తోకనే.
గురువుగారి పాఠం కొనసాగుతున్నది కానీ శిష్యుడు వినటం మాత్రం ఆగిపోయింది. వాడి మనసు అంతా పూర్తిగా ఎలుకతోకతోటే నిండిపోయింది!
అంతలో గురువు గారు అన్నారు గట్టిగా: "ఒరే శిష్యులూ! మీకు ఈ రోజు చెప్పిన పాఠం బాగా అర్థమయిందా?" అని.
శిష్యులందరూ "అర్థమైంది గురువర్యా!"అని చెప్పితే , ఈ శిష్యుడు మాత్రం "లేదు గురువర్యా! తోక మాత్రం బయటనే ఉండిపోయింది!" అన్నాడు. నిజమే మరి- తోక లోపలికి పోలేదు గద!