చైనాలో చూడదగిన పవిత్ర స్థలాల్లో 'వూ-తాయ్' అనే పర్వతం ఒకటి ఉన్నదట. దాన్ని దర్శించుకునేందుకు చాలా మంది బౌద్ధ సన్యాసులు, ఎంతో దూరం నుండి నడిచి వెళ్ళేవాళ్ళుట.

చాలా సంవత్సరాల క్రితం ఒకసారి అలాగే ఆ పర్వతాన్ని దర్శిద్దామని బయలుదేరాడొక ముసలి సన్యాసి. వయసు మళ్లింది; చాలా బలహీనంగా ఉన్నాడు కూడాను. సన్యాసి కనుక, ఏరోజుకారోజు అవసరాన్ని బట్టి భిక్షనర్థిస్తూ, కొండలు-గుట్టలు పట్టి నడుస్తూ పోయాడు. చాలా అలసిపోయాడు.

అట్లా చాలా నెలలపాటు నడిచాక, సుదూరంగా కనబడింది, వూ-తాయ్ పర్వతం! ఆ గొప్ప పర్వతాన్ని చూసేసరికి, ఆయనకు ప్రాణం లేచివచ్చినట్లైంది. కొంచెంసేపు అక్కడే నిలబడి, ఆ అద్భుత దృశ్యాన్ని చూసి మైమరచిపోయాడు.

కొద్దిగా తేరుకున్నాక, దగ్గర్లో ఎవరైనా మనుషులు కనబడతారేమోనని అన్నివైపులా పరికించాడు సన్యాసి. అక్కడే రోడ్డు ప్రక్కన పొలంలో నడుంవంచి పనిచేస్తూ కనబడ్డది- ఒక ముసలమ్మ . "అమ్మా! నేను వూ-తాయ్ పర్వతాన్ని దర్శించుకునేందుకు వెళ్తున్నాను. పర్వతాన్ని చేరుకునేందుకు ఇంకా ఎంత కాలం పడుతుంది?" అడిగాడు సన్యాసి ఆమెను.

ఆమె లేచి నిలబడి అతనికేసి చూసింది ఒక క్షణం పాటు. ఆపైన గొంతుతో ఏదో గరగరమని శబ్దం‌చేసి, మళ్ళీ తన పనిలో మునిగింది. సన్యాసి మళ్ళీ అడిగాడు- ఇంకోసారి అడిగాడు- రెండు మూడు సార్లు అడిగినా ఆమెనుండి ఏ సమాధానమూ లేదు!

"బహుశ: ఆమెకు చెముడు అయిఉంటుంది-లేకపోతే మూగదేమో-" అనుకున్నాడు సన్యాసి. "ఇంకొంచెం ముందుకు పోయి, వేరే ఎవరినన్నా అడిగితే సరి-" అని, నడక మొదలుపెట్టాడు.

ఒక పది అడుగులు వేశాడో లేదో, ముసలమ్మ అరుపు వినబడింది వెనకనుండి- "రెండు రోజులు! మీరు కొండను చేరుకునేందుకు ఇంకా రెండు రోజులు పడుతుంది!" అని.

సన్యాసి ఓమాటు వెనక్కు తిరిగి "నీకు చెముడేమో అనుకున్నాను- నేను అడిగినదానికి వెంటనే జవాబిచ్చి ఉంటే ఏమి?" అన్నాడు కొంచెం కోపంగా.

ముసలమ్మ ఆయనకు నమస్కరిస్తూ చెప్పింది- "'ఎంత కాలం పడుతుంది?' అని మీరు అడగగానే మీవైపుకు చూశాను స్వామీ- మీరప్పుడు కదలకుండా ఒకేచోట నిలబడి ఉన్నారు. అట్లా నిలబడి ఉంటే ఎంతకాలమైనా ఎక్కడికీ చేరరు. ఒకసారి మీరు నడవటం మొదలెట్టాక గానీ నాకు మీ నడక వేగమూ, మీ పట్టుదలా అర్థం కాలేదు. అట్లా గట్టిగా నడిస్తే రెండు రోజుల్లో వూ-తాయ్ కి చేరుకోవచ్చు కదా అని, చెప్పాను. క్షమించండి" అని. సన్యాసికి ఆమెలో బుద్ధుడు కనిపించాడు!

మనంకూడా, ఎక్కడికైనా చేరుకోవాలంటే ముందడుగులు వేయాల్సిందే. నడకే మొదలు పెట్టకపోతే, ఇక గమ్యం ఎప్పటికీ చేరుకోలేం. అందుకని- ఒక్కొక్క అడుగూ వేస్తూ పోదాం! నడుస్తూ పోదాం!!

2011 సంవత్సరం అందరికీ సుఖ సంతోషాలనూ, ముందుకు నడిచేందుకు స్ఫూర్తినీ ఇస్తుందని ఆశిస్తూ,

కొత్తపల్లి బృందం