ఒక ఊరిలో ఒక పాప ఉండేది.
ఆ పాప పేరు సీత.
సీత చాలా మంచి పాప.

అమ్మకు చాలా సాయం చేసేది.


నాన్నకు బొమ్మలు గీసేది.

ఒకసారి నాన్న ఒక తేలు బొమ్మ గీశాడు.
సీత ఆ బొమ్మకు రంగులు వేసింది.

అంతలో ఆ బొమ్మ కదిలింది!
కదిలి ముందుకు నడిచింది!
సీతకు భయం వేసింది.
"ఓ నాన్నో!" అని అరిచింది, లేచి నిలబడి.
నాన్న పరుగున వచ్చాడు. " ఏమైంది ఏమైంది?" అని అడిగాడు.

"ఈ తేలు బాగా లేదు- కుడుతుంది" అని ఏడిచింది సీత.
నాన్నకు తన తప్పు అర్థమైంది.
"ఓస్, దానిదేముంది? చీపురుతో ఊడ్చేస్తే సరి!" అన్నాడు తేలికగా.
" మరి చీపురేది?" అడిగింది సీత.

"ఇదిగో!” అని నాన్న చీపిరిని గీశాడు.
"మరి ఊడ్చేదెట్లాగ?" అన్నది సీత.

నాన్న చెయ్యడ్డం పెట్టి రబ్బరుతో తేలుని ఊడ్చేశాడు. ఇప్పుడు చూస్తే అసలు అక్కడ తేలే లేదు!
సీత నవ్వింది- నాన్న చేసిన మాయ పాపకు తెలిసిపోయింది. "ఈ చీపిరితోనైతే దేన్నైనా ఊడ్చేయచ్చు!” అన్నది సంతోషంగా నవ్వుతూ .